– అడ్డుకున్న పోలీసులు.. ఐక్య సంఘాల నేతల అరెస్టు
– 20న రాష్ట్రవ్యాప్త దీక్షలకు పిలుపు

హైదరాబాద్‌ : చేపపిల్లల పంపిణిలో అవినీతి జరుగుతున్న నేపథ్యంలో వెంటనే టెండర్లను రద్దు చేయాలనీ, అందుకు సంబంధించిన నగదు మొత్తాన్ని సొసైటీ బ్యాంక్‌ ఖాతాలో జమ చేయాలని మత్య్సకార సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ డిమాండ్‌ చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని మత్య్సశాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకొని భౌతిక దూరం పాటిస్తూ కఠోర దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన నిరసనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు గంటలకు పైగా దీక్ష జరగడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ధర్నా విరమించాలని పలుమార్లు కోరినా.. తమ డిమాండ్లపై ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని భీష్మించుకున్నారు. ఈ సందర్భంగా మత్య్సకారులు, పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి వాహనాల్లో ఎక్కించి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా తెలంగాణ మత్య్సకారులు, మత్య్సకార్మిక సంఘం (టీఎంకేఎంకేఎస్‌) రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ట మాట్లాడుతూ శాంతియుతంగా తాము కఠోర దీక్ష చేస్తుంటే మంత్రి తన పోలీసు బలగాలతో అక్రమంగా అరెస్టు చేయించారని విమర్శించారు. వెంటనే చేపపిల్లల కొనుగోలుకు సంబంధించిన నగదును సొసైటీ బ్యాంక్‌ ఖాతాలో జమచేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈనెల 20 రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మత్య్స కారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గూడబోయిన సాయిలు, తెలంగాణ ముదిరాజ్‌ మత్య్సకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు లోకబోయిన రమణ, తెలంగాణ గంగ పుత్ర సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రణవేణి లక్ష్మణరావు, టీఎంకేఎంకేఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముఠా విజయకుమార్‌, కార్యదర్శి అర్వపల్లి రాములు, నాయకులు గంగదారి పూర్ణచందర్‌, ముఠా దశరథ్‌, గుండు జగదీశ్‌, మాదబోయిన నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Courtesy Nava Telangana