బంగాళాఖాతం టు అరేబియా

సిక్కోలు నుంచి వలస వెళ్లనున్న 13 వేల మంది

రాష్ట్రంలో సగానికిపైగా ఇక్కడ నుంచే

 

బంగాళాఖాతం తీరంలో ఉండే సిక్కోలు మత్స్యకారులు, అరేబియా సముద్ర తీరంలో ఉండే గుజరాత్‌లోని వీరావళి ప్రాంతానికి వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఏటా ఆగస్టులో వెళ్లి, ఏప్రిల్‌లో తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌ మొత్తంగా 25వేల మందికి పైగా వీరావళికి వె ళ్తుండగా, అందులో 13వేల మందికి పైగా శ్రీకాకుళం జిల్లా నుంచే వెళ్తుండడం ఇక్కడి మత్స్యకారుల దుస్థితికి నిదర్శనం.

శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల సముద్రం తీరం ఉంది. సౌకర్యాలు, అధునాతన బోట్లు లేకపోవడంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు దూరం వెళ్లలేని పరిస్థితి. దీంతో తక్కువ దూరం వెళ్లి, వెనక్కి వచ్చేస్తుండడంతో, మత్స్య సంపద తక్కువగా దొరుకుతోంది. జెట్టీలు, ఫిషింగ్‌ హార్బర్‌లు నిర్మిస్తే… ఆధునాతన బోట్లు అందుబాటులోకి వస్తే సముద్రంలో దూరానికి వెళ్లి వేట చేయొచ్చు. శ్రీకాకుళం జిల్లాలో కనీసం ఒక్క జెట్టీ కూడా నిర్మించలేదు. ఫిషింగ్‌ హార్బర్‌ ఊసే లేదు. వేటకు అవసరమైన సరైన సౌకర్యాలు లేకపోవడంతో మత్స్యకారులకు ఉపాధి లభించడం లేదు.

అందుకే అక్కడకు..
గుజరాత్‌లో చేపల వేట అనుకూలంగా ఉండేలా, శాశ్వత ప్రయోజనాల కోసం అక్కడి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ప్రతి 20 నుంచి 25 కిలోమీటర్లకు తీరంలో జెట్టీలు నిర్మించారు. ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు నిర్మించారు. ఫిషింగ్‌ హార్బర్లు ఏర్పాటు చేశారు. కోల్డ్‌స్టోరేజీ, హేచరీస్‌ తదితర వాటిని అధిక సంఖ్యలో నెలకొల్పారు. మత్స్య సంపద ప్రధాన ఆదాయ వనరుగా గుజరాత్‌లో ఉంది. చేపల వేట గిట్టుబాటు అయ్యేలా అనుకూల పరిస్థితుల కల్పనకు అక్కడి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. దీనివల్ల మన ప్రాంత మత్స్యకారులు కూలీలుగా చేపల వేటకు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, గుజరాత్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
గుజరాత్‌లో మెక్‌నైజ్డ్‌ బోట్లతో చేపల వేట సాగిస్తున్నారు. ఈ బోటు విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుంది. మన ప్రాంతంలో సంప్రదాయ తెప్పలు, ఫైబర్‌ తెప్పలు, మోటరైజ్డ్‌ బోట్లతో చేపల వేట సాగిస్తున్నారు. దీనివల్ల వేటకు ఎక్కువ దూరం పోయేందుకు వీలుండదు. తెల్లవారుజామున నాలుగైదు గంటల సమయంలో చేపల వేటకు వెళ్తే, మధ్యాహ్నం ఒంటి గంటకు ఒడ్డుకు చేరుతారు. దీనివల్ల పెద్దగా చేపల వేట సాగడం లేదు. మెకనైజ్డ్‌ బోట్లతో చేపల వేట లాభసాటిగా ఉంటుందని అధ్యయన కమిటీ గుర్తించింది.

నెరవేరని ఫిషింగ్‌ హార్బర్‌ కల  
ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.150 కోట్లతో ప్రతిపాదించిన ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి అతీగతీ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా హార్బర్‌ ఏర్పాటుకు నిధులు కేటాయించాల్సి ఉంది. రాళ్లపేట(ఎచ్చెర్ల)లో రూ.ఏడు కోట్లతో, మంచినీళ్లపేట (వజ్రపుకొత్తూరు)లో రూ.ఎనిమిది కోట్లతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. కవిటి మండలం ఇద్దివానిపాలెంలో ఫిషింగ్‌ హార్బర్‌కు ప్రతిపాదించారు. వీటి నిర్మాణం ఉంటుందని మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు.

ఏటా 13 వేల మందికి పైగానే వలస
గుజరాత్‌ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏటా సుమారు 25 వేల మందికి పైగానే మత్స్యకారులు వలసపోతున్నారు. ఇందులో శ్రీకాకుళం జిల్లా నుంచి సుమారు 13 వేల మంది ఉన్నట్లు ఇటీవల గుజరాత్‌ వెళ్లి, అధ్యయనం చేసి వచ్చిన ప్రభుత్వ అధికారుల కమిటీ గుర్తించింది. ముఖ్యంగా ఎచ్చెర్ల, రణస్థలం మండలాల నుంచి ఎనిమిది వేల మంది వరకు గుజరాత్‌లో చేపల వేటలో ప్రస్తుతం ఉన్నట్లు గుర్తించారు. ఇందులో బాలురు కూడా ఉన్నారు. ఆగస్టులో ఇక్కడి నుంచి వెళ్లే మత్స్యకారులు, ఏప్రిల్‌ వరకు అక్కడే ఉండి చేపల వేట సాగిస్తారు. 22 నుంచి 25 రోజుల వరకూ గుజరాత్‌లోని అరేబియా సముద్రంలో ఉండి చేపల వేట సాగిస్తారు. రెండు రోజులు మాత్రమే ఒడ్డున ఉంటారు. ఆ సమయంలో కూడా బోటులోనే విశ్రాంతి తీసుకుంటారు. తండేలు (బోటు డ్రైవర్‌)కు నెలకు రూ.25 వేల వరకు జీతం చెల్లిస్తారు. కళాసీ, వంట మనుషుల(బండారి)కు జీతం రూ.8వేల నుంచి రూ.10 వేల వరకు ఉంటుంది. అడ్వాన్స్‌లు ఇచ్చి వీరికి బోటు అప్పగిస్తారు. చేపల వేట సరిగా లేకపోతే బోటు యజమాని చీదరింపులకు కూడా గురికావాల్సిందే. ముందుగా నిర్ణయించిన మొత్తాన్నీ పూర్తిస్థాయిలో చెల్లించరు. ఈ విషయాలను అధ్యయన కమిటీ ఎదుట గుజరాత్‌లో మన ప్రాంత మత్స్యకారులు వాపోయారు. ఇలా వీరావళికి వలస వెళ్లిన భారత మత్స్యకారుల్లో 22 మంది గతేడాది డిసెంబరులో పాక్‌ జలాల్లోకి ప్రవేశించారన్న పేరిట పాక్‌ కోస్టుగార్డులు బందీలుగా చేసింది. ఇందులో 20 మంది శ్రీకాకుళం జిల్లావాసులే. నేటికీ వారు పాక్‌ జైళ్లలోనే మగ్గుతున్నారు.

వలసలను ఆపాలి
జిల్లా నుంచి మత్స్యకారుల వలసలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జిల్లాలోని సముద్రం తీరం వెంబడి వేటకు సౌకర్యాలు కల్పించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఆ చర్యలు తక్షణమే తీసుకొని, మత్స్యకారులను ఆదుకోవాలి.
మూగి గురుమూర్తి,
మత్స్యకార ఎస్‌టి సాధన సమితి నాయకుడు

జెట్టీలు నిర్మించాలి
గుజరాత్‌లో ప్రతి 25 కిలోమీటర్లకు ఒక జెట్టీని నిర్మించారు. దీనివల్ల అక్కడ చేపల వేటకు అవకాశాలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ జెట్టీలు ఉన్నా… శ్రీకాకుళం జిల్లాలో ఒక్క జెట్టీ కూడా లేదు. దీంతో సముద్రంలో దూరంగా వెళ్లి, వేటకు చేయడానికి వీలు కుదరడం లేదు. ప్రభుత్వం ఆ దిశగా దృష్టిసారించాలి. 

మూగి రామారావు,
మత్స్యకార సంక్షేమ సంఘం నాయకులు

ఫిషింగ్‌ హార్బర్‌ మాటేమిటి..?
ఎచ్చెర్ల మండలం బుడగట్ల పాలెంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి కొన్నేళ్లుగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. అవి ఆచరణలో కనిపించడం లేదు. మరి ఇంకెప్పుడు నిర్మిస్తారో తెలియడం లేదు. ప్రభుత్వాలు తక్షణం దీన్ని నిర్మించాలి. 

వారధి ఎర్రయ్య,
మాజీ సర్పంచి, బడివానిపేట, ఎచ్చెర్ల

మత్స్యకారులపై నిర్లక్ష్యం వద్దు
మత్స్యకారుల ఉపాధి పెంచ డంపై నిర్లక్ష్యం వహించొద్దు. వెంటనే జిల్లాలో జెట్టీలు, ఫిషింగ్‌ హార్బర్‌, హేచరీస్‌, కోల్డ్‌స్టోరేజీలను నిర్మించాలి. ఆధునాతన బోట్లను రాయితీపై అంది ంచాలి. తద్వారా మత్స్యకారుల వలసలు ఆగుతాయి.
ఎం.శ్రీరాములు,

(Courtacy Prajashakti)