హైదరాబాద్ ఎల్ బీనగర్ లోని షైన్ పిల్లల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
ఓ శిశువు మృత్యువాత.. ముగ్గురికి తీవ్ర గాయాలు
స్వల్ప గాయాలతో బయట పడిన మరో శిశువు
ఎన్ఐసీయూలో రిఫ్రిజిరేటర్ పేలి మంటలు
ప్రమాద సమయంలో 45 మంది చిన్నారులు

అంతా బుజ్జి బుజ్జి చిన్నారులు. చిట్టి పొట్టి చేతులు, చిన్ని చిన్ని కళ్లు ముట్టుకుంటేనే ముడుచుకుపోయే లేలేత ప్రాయం. అమ్మఒడి తప్ప మరేమీ ఎరుగని బోసి నవ్వుల పసికందులు…. ఒక్కసారిగా అల్లాడిపోయారు. చుట్టుముట్టిన మంటలు, కమ్ముకొస్తున్న పొగల మధ్య విలవిల్లాడిపోయారు. హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి నాలుగునెలల శిశువు అసువులు బాయగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పిల్లల ఒళ్లు కాసింత వెచ్చబడితేనే కంగారుపడిపోయే తల్లిదండ్రులు వారిని చూసి తట్టుకోలేకపోయారు. కన్నీరుమున్నీరయ్యారు. ముక్కుపచ్చలారని తమ బిడ్డలను భుజాన వేసుకుని ఉరుకులు పరుగులు పెట్టారు.

హైదరాబాద్ ఎల్బీనగర్ లోని షైన్ ఆసుపత్రి పై అంతస్తులో సోమవారం తెల్లవారుజామున 2.40 గంట అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయిదుగురు చిన్నారులు అదే అంతస్తులో ఇంక్యుబేటర్లపై చికిత్సపొందుతున్నారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగి చిన్నారుల ఛాతి, పొట్ట, ముఖం భాగాలు కమిలిపోయాయి. ఈ ప్రమాదంలో 4 నెలల మగ శిశువు మృతిచెందాడు. మరో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఇంకో శిశువు పొగ పీల్చడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఈ నలుగురిని అత్యవసర – చికిత్స కోసం నగరంలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన • తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో మొత్తం 45 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు డెంగీ జ్వరంతో ప్లేట్ లెట్లు పడిపోయి అత్యవసర చికిత్స తీసుకుంటున్నారు .(ఆసుపత్రిలో 36 ను 42 మంది పిల్లలు ఉన్నట్లు పోలీసు ఫిర్యాదులో ఉండగా, 45 మంది ఉన్నారని అగ్నిమాపకశాఖ అధికారు తెలిపారు) పిల్లల తల్లిదండ్రులు, సిబ్బందితో కలసి సుమారు 70 మంది వరకు ఉన్నారు.

రిఫ్రిజిరేటర్ పేలి… పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆసుపత్రిలోని పై అంతస్తులో ఉన్న నవజాత శిశువుల అత్యవసర చికిత్స విభాగం (ఎఐసీయూ)లో మందుల నిల్వ కోసం ఉంచే రిఫ్రిజిరేటర్ లో పేలుడు సంభవించింది. దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. అక్కడ ఉన్న సిబ్బంది, తల్లిదండ్రులు అప్రమత్తమయ్యేలోపు క్షణాల్లో గదంతా మంటలు అంటుకున్నాయి. యాదగిరిగుట్ట డివిజన్ పరిధి మోటకొండూరు ఠాణాలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నరేష్, మానస దంపతుల నాలుగు నెలల కుమారుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. హుటాహుటిన సమీపంలోని రెయిన్‌బో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలుడు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వీరి స్వస్థలం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని దూపాడు గ్రామం.

కింది అంతస్తుల్లో అప్రమత్తమైన తల్లిదండ్రులు షైన్ ఆసుపత్రి మూడో అంతస్తులో ఎఐసీయూ ఉండగా…మిగతా అంతస్తుల్లో చిన్న పిల్లలకు చెందిన ఇతర వార్డులు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి పై అంతస్తులో మంటలు, పొగలు కమ్ముకోవడంతో మిగతా అంతస్తుల్లోని తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు. పడకలపై ఉన్న పిల్లలను భుజాలపై వేసుకొని హుటాహుటిన మెట్ల మార్గం నుంచి బయట పడ్డారు. కొందరు ఎటు వెళ్లాలో తెలియక ఉదయం వరకు చిన్నారులను పట్టుకొని ఆసుపత్రి ఆవరణలోనే ఉండిపోయారు. అదృష్టవశాత్తు తోపులాట వంటివి జరగకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. లేదంటే ప్రాణనష్టం ఊహించడమే కష్టమయ్యేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

దిశా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి:  రెండు రోజుల క్రితమే పొగలు వచ్చినా… తమ కుమారుడి మృతికి షైన్ ఆస్పత్రి యాజమాన్యంతోపాటు డ్యూటీ డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి తండ్రి నరేష్ ఎల్బీనగర్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నెల 17న తమ కుమారుడిని ఆస్పత్రిలో చేర్చగా.. రెండ్రోజుల క్రితం ఇదే ఎఐసీయూ విభాగంలో పొగలు వచ్చాయనీ.. ఈ విషయం ఆస్పత్రి వైద్యులు, యాజమాన్యం దృష్టికి తెచ్చినా సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే పెను ప్రమాదం చోటుచేసుకుందన్నారు. ఈ మేరకు ఎల్బీ నగర్ పోలీసులు 304ఎ సెక్షన్ కింద యాజమాన్యం, విధుల్లో ఉన్న వైద్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు ప్రమాదం, ఆసుపత్రికి సంబంధించి వివిధ అనుమతులపై దర్యాప్తు చేపడుతున్నారు. అగ్ని భద్రతకోసం ఆసుపత్రి తీసుకున్న అనుమతి గడువు కూడా ముగిసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిని సీజ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, వెంటనే ఎండీని అరెస్టు చేయాలని తల్లిదండ్రులు, స్థానికంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు.

Courtesy Eenadu…

Telangana, Hyderabad, fire, accident, in,Shine,hospital, one, child, dies,three,injured, administration,lapses