Image result for delhi fire accident"దిల్లీలో అగ్నికీలల్లో 4 అంతస్తుల భవంతి
43 మంది వలస కూలీల దుర్మరణం
భవనంలో అక్రమంగా తయారీ యూనిట్లు
ఊపిరి అందక నిద్రలోనే కడతేరిపోయిన ప్రాణాలు
కోవింద్‌, మోదీ, కేజ్రీవాల్‌, సోనియా దిగ్భ్రాంతి
దిల్లీ
వారు పగలంతా కష్టపడి పనిచేసి అలసి ఆదమరిచి నిద్రపోయారు. తెల్లవారుజామున గాఢనిద్రలో ఉండగా మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలిసే లోపే చాలా మంది ప్రాణాలు పోయాయి. నిద్ర నుంచి తేరుకున్న వారు తప్పించుకోవాలని ప్రయత్నించినా ఒకటే తలుపు ఉండడంతో బయటపడడం సాధ్యం కాలేదు. దేశరాజధాని దిల్లీ నడిబొడ్డులోని అనాజ్‌మండీ ప్రాంతంలో నివాసాల నడుమ… ఎలాంటి అనుమతులు లేకుండానే చిన్న పాటి పరిశ్రమలు నడుస్తున్న నాలుగంతస్తుల భవనంలో చోటు చేసుకున్న భారీ విషాదమిది.
దేశ రాజధాని దిల్లీలో సూర్యుడు ఉదయించకముందే మృత్యువు ఒళ్లు విరిచింది. అగ్ని కీలల రూపంలో నిలువునా 43 నిండు ప్రాణాలను దహించేసింది. పొట్ట చేతపట్టుకుని హస్తినకు వలస వచ్చిన పేదల ప్రాణాలు మరెవరిదో నిర్లక్ష్యానికి గాలిలో కలిసిపోయాయి. దిల్లీలోని అనాజ్‌మండీలో ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో నాలుగు అంతస్తుల భవనాన్ని మంటలు చుట్టుముట్టాయి. మంటలతో తీవ్రగాయాలవడంతో పాటు అలముకున్న పొగ (కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువు) ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో ఊపిరి తీసుకోవడం కష్టమై పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది. మృతుల్లో ఎక్కువమంది బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారే. 1997లో దిల్లీలో ఉపహార్‌ సినీ థియేటర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం తర్వాత అంతటి తీవ్రమైనది ఇదేనని భావిస్తున్నారు. ఆనాటి ప్రమాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రాణాలు పోయేలా ఉన్నాయంటూ కుటుంబసభ్యులకు ఫోన్లు
ప్రాణాలు కోల్పోయే ముందు పలువురు కార్మికులు ఆర్తనాదాలు చేశారు. సజీవంగా బయటపడే అవకాశాలు కనిపించడం లేదని, మరణం అనివార్యంగా కనిపిస్తోందని తమ కుటుంబసభ్యులకు ఫోన్లలో చెప్పారు. రక్షించాలంటూ తమ పెద్ద కుమారుడు ఫోన్లో అడిగాడని, అలా చెబుతుండగానే అతని మాటలు ఆగిపోయాయని మొరాదాబాద్‌ (యూపీ)కు చెందిన నఫీజ్‌ కన్నీళ్లతో చెప్పారు. రెండో కుమారుడి చివరి మాటల్ని ఫోన్లోనైనా వినలేకపోయానని విలపించారు. వారు పాలిథిన్‌ సంచుల తయారీ పనులు చేసేవారని తెలిపారు. బిహార్‌లోని మధుబని ప్రాంతానికి చెందిన జాకిర్‌హుస్సేన్‌… గర్భవతి అయిన తన భార్యకు ఫోన్‌ చేసి, తానిక చనిపోతున్నానని చెప్పినట్లు కుటుంబసభ్యులు రోదిస్తూ వెల్లడించారు. మృతుల్లో దాదాపు 20 మంది ఆదివారం ఉదయం బిహార్‌కు బయల్దేరాల్సి ఉంది.
ఇరుకు ప్రదేశంలో సహాయక చర్యలకు అవస్థ
Image result for నిర్లక్ష్యమే నిప్పురవ్వ"ప్రమాద స్థలం ఇరుగ్గా ఉండడంతో సహాయక సిబ్బంది అక్కడకు చేరుకోవడమూ కష్టమయింది. కిటికీ ఊచలు కోసి, వాటి ద్వారా వారు ఆ భవనం లోపలకు ప్రవేశించగలిగారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ఇరుకు సందు కావడంతో పలువురిని ఆటోల్లో బయటకు తీసుకురావాల్సి వచ్చింది.
63 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
5.22 గంటల సమయంలో సమాచారం అందడంతో 30 అగ్నిమాపక శకటాలు రంగంలో దిగి, మంటల్ని చల్లార్చేందుకు అయిదు గంటల పాటు ప్రయత్నించాల్సి వచ్చింది. దాదాపు 150 మంది అగ్నిమాపక సిబ్బంది కృషి చేసి, 63 మందిని ఆ భవనం నుంచి కాపాడగలిగారు. లేనట్లయితే ప్రాణనష్టం ఇంకా పెరిగేదని భావిస్తున్నారు. అంతమంది ఆ భవంతిలో ఉంటారన్న విషయం అగ్నిమాపక సిబ్బంది ఊహకైనా అందలేదు. సాయం కోసం ఆర్తనాదాలు చేస్తూ అనేక మంది అక్కడ కనిపించడంలో వారు నివ్వెరపోయారు. 600 చదరపు గజాల స్థలంలోని భవనానికి ఒకే ఒక్క ప్రవేశమార్గం ఉంది. సహాయక చర్యల్లో భాగంగా ఇద్దరు సిబ్బందికీ గాయాలయ్యాయి. మోకాలి గాయాన్నీ లెక్కచేయకుండా ఫైర్‌ఫైటర్‌ రాజేశ్‌ శుక్లా ముందుగా లోపలకు వెళ్లి 11 మందిని కాపాడారు.
ప్రమాదానికి కారణాలేమిటి?
అనాజ్‌మండీ ప్రాంతం పేరుకు నివాస ప్రాంతమయినప్పటికీ దాదాపు 40 వేల దుకాణాలు, వెయ్యి వరకు కర్మాగారాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఆదివారం నాటి ప్రమాదంలో భవనం రెండో అంతస్తు నుంచి మొదటగా మంటలు మొదలయ్యాయని అధికారులు చెబుతున్నారు. టోపీలు, హ్యాండ్‌ బ్యాగులు వంటివి ఈ భవంతిలో తయారు చేస్తుంటారు. కార్డుబోర్డులు, ప్లాస్టిక్‌ వస్తువులు, దుస్తులు, బొమ్మలు, రెగ్జిన్‌ వంటివి పెద్ద పరిమాణంలో నిల్వ ఉండడంతో మంటలు వెనువెంటనే వ్యాపించాయి. అగ్గి రాజుకుంటే చటుక్కున ఆపేందుకు చిన్నపాటి పరికరమైనా అక్కడ లేదు. దానికి తోడు షార్ట్‌ సర్క్యూట్‌ చోటు చేసుకొంది. ఇక్కడ అడుగడుగునా యమపాశాల్లా విద్యుత్తు తీగలు వేలాడుతున్నాయి. అయితే.. వాటి వల్ల ప్రమాదం సంభవించలేదని, భవనంలో ‘‘అంతర్గత వ్యవస్థ’’ (ఇంటర్నల్‌ సిస్టం) దానికి కారణమై ఉండవచ్చని దిల్లీ విద్యుత్తు మండలి అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన భవనానికి తమ అనుమతి లేదని, అక్కడ ఏ అంతస్తులోనూ అగ్నిమాపక పరికరాలు లేవని దిల్లీ అగ్నిమాపక శాఖ ప్రకటించింది.
రాజకీయ దుమారం
ఈ ప్రమాదంపై రాజకీయ దుమారం మొదలైంది. భవనంలోని యూనిట్లకు ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇచ్చినా వారిని అక్కడకు దిల్లీ సర్కారు తరలించకపోవడం వల్లనే అవి ఇంకా అదే చోట ఉన్నాయని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి ఆరోపించారు. భాజపా శవ రాజకీయాలు చేస్తోందని ఆమ్‌ఆద్మీ పార్టీ మండిపడింది. ఈ రెండు పార్టీలనూ కాంగ్రెస్‌ తప్పుపట్టింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ఇస్తామని దిల్లీ భాజపా ప్రకటించింది.
మృతుల కుటుంబాలకు రూ.12 లక్షల పరిహారం
అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం ఇస్తామని మోదీ, రూ.10 లక్షలు వంతున చెల్లిస్తామని కేజ్రీవాల్‌ ప్రకటించారు. మృతుల్లో బిహార్‌కు చెందిన వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షలు చొప్పున అదనపు పరిహారం అందించనుంది. ఘటనపై మెజిస్టీరియల్‌ దర్యాప్తునకు దిల్లీ సర్కారు ఆదేశించింది. భవనం యజమాని రేహాన్‌పై పోలీసులు కేసు పెట్టి, అదుపులో తీసుకున్నారు.

(Courtesy Eenadu)