ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
హైదరాబాద్‌: ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రేషన్‌ తీసుకోలేదని చెప్పి ఏప్రిల్‌ నుంచి రేషన్‌తో పాటు లాక్‌ డౌన్‌ వేళ ఆర్థిక సాయం రూ. 1500 పంపిణీ చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెల్ల రేషన్‌ కార్డు దారులు చాలామందిపనుల కోసం వలస వెళ్లి ఉంటారనీ, ఆ కారణంగా ఆ మూడు నెలలకు రేషన్‌ తీసుకుని ఉండరని హైకోర్టు అభిప్రాయపడింది. ఎందుకు రేషన్‌తో పాటు నగదు కూడా ఇవ్వలేదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన,్‌ జస్టిస్‌ విజరుసేన్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ గురువారం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాదులో 20లక్షలకు పైగా తెల్ల రేషన్‌ కార్డులు కోసం దరఖాస్తు లు వస్తే 17 లక్షలు దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించిందనీ, రేషన్‌ కార్డు లేదని చెప్పి చాలా మందికి లాక్‌ డౌన్‌ సమయంలో రేషన్‌తోపాటు ఆర్థిక సాయం కూడా చెల్లించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు చెప్పారు. దీనిపై పూర్తి వివరాలు సమర్పిస్తామని, అయితే ప్రత్యక్ష విచారణ చేయాలని అడ్వకేట్‌ జనరల్‌ బి ఎస్‌ ప్రసాద్‌ కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కంటే ప్రత్యక్షంగా విచారణ చేయాలని అభ్యర్థించారు. దీంతో విచారణ వచ్చే నెలకు వాయిదా పడింది.

Courtesy Nava telangana