నాలుగ్గోడలకే పరిమితం కాలేక మంచి జీతం వచ్చే హౌటల్‌ మేనేజ్‌మెంట్‌, బ్యాంక్‌ ఉద్యోగాలను వదిలేశారు. జర్నలిజంలోకి అడుగుపెట్టారు. మరేదో కొత్తగా చేయాలని విదేశాల్లో ఫిలిం మేకింగ్‌ కోర్సు చేసి వచ్చారు. తనకున్న టాలెంట్‌తో కోట్లు సంపాదించే అవకాశం వుంది. కానీ సమాజహితమే తన హితంగా భావించారు. యాక్టివిస్ట్‌గా మారిపోయారు. పర్యావరణం కోసం ఉద్యమాలు చేస్తూనే ఎన్నో సామాజిక అంశాలను సినిమాల రూపంలో ప్రజలకు చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఆమే సరస్వతి కవుల. అంతే కాదు చేనేత సంత ఏర్పాటు చేసి ఆ కార్మికులకు అండగా నిలబడ్డ ఆమె గురించి మరిన్ని విశేషాలు…

పుట్టింది అమ్మమ్మగారి ఊరు తాడేపల్లిగూడెంలో. అమ్మ కమల, హౌస్‌ వైఫ్‌. నాన్న దుర్గాప్రసాద రావు. బ్యాంక్‌లో ఉద్యోగం. నాన్న ఉద్యోగ రీత్యా అన్ని ప్రాంతాలకూ తిరిగేవాళ్ళం. నల్లగొండలో కొంత కాలం చదువుకున్నా. హైదరాబాద్‌, నల్లగొండ, వికారాబాద్‌ ప్రాంతాల్లో ఎక్కువగా గడిపాను.

నాలుగ్గోడల మధ్య ఇమడలేక
చిన్నప్పటి నుండి మెడిసిస్‌ కానీ, జర్నలిజం కానీ చేయాలని నా కోరిక. అయితే మెడిసిస్‌లో ర్యాంక్‌ వచ్చింది కానీ ఫ్ర ీసీట్‌ రాలేదు. సరే బీఏ జర్నలిజం చేద్దామని అప్లరు చేశా. నేను చదువులో పెద్ద క్లవర్‌నేమీ కాదు. నాకు వచ్చిన యావరేజ్‌ మార్కులకు అందులోనూ సీట్‌ రాలేదు. దాంతో మా నాన్న హౌటల్‌ మేనేజ్‌మెంట్‌ చేయమంటూ సలహా ఇచ్చారు. సరే అని అందులో చేరిపోయా. రెండేండ్లు ఉద్యోగం చేసిన తర్వాత ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. జాబ్‌కు రిజైన్‌ చేశా. అయ్యో ఉద్యోగం ఏమీ చేయడం లేదే అనే భయం పట్టుకుంది. దాంతో ఓ బ్యాంక్‌లో జాబ్‌ వస్తే అందులో చేరా. నాలుగ్గోడలకు పరిమితమైన ఉద్యోగం కావడంతో బ్యాంక్‌ ఉద్యోగం కూడా అస్సలు నచ్చలేదు. కొన్నాళ్ళకు అది కూడా మానేశాను.

ఫ్రీలాన్స్‌గా అడుగుపెట్టి…
నెక్ట్‌ ఏం చేద్దామని ఆరు నెలలు స్టడీ చేశా. నా ఫ్రెండ్స్‌ కొంత మంది సలహాలు ఇచ్చారు. హౌటల్‌మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన జాబ్‌ చేసేటప్పుడు పరిచయమైన స్నేహితురాలు ”పుస్తకాలు, సాహిత్యం బాగా చదువుతావు కదా మీడియా లోకి ఎందుకు వెళ్ళకూడదు” అని సలహా ఇచ్చింది. నాకూ జర్నలిజం అంటే ఇష్టమే కాబట్టి ఈ ఆలోచన నచ్చింది. అయితే ఒక దగ్గర ఉద్యోగం చేయడమంటే కష్టం. అందుకే ఫ్రీలాన్స్‌ చేయాల నుకున్నా. ఆలిండియా రేడియోలో కొంత కాలం చేశాను. తర్వాత దూరదర్శన్‌లో కూడా చేశాను. తర్వాత డాక్యుమెంటరీ మూవీస్‌ తీయాలనే ఆలోచన వచ్చింది. 1999లో ఇంగ్లాండ్‌ వెళ్ళి దీనికి సంబంధించిన కోర్సు చేసి వచ్చాను.

గ్రామీణ సమస్యలపై…
అయితే అప్పట్లో మన దగ్గర డాక్యుమెంటరీ సినిమాలకు పెద్దగా ఆదరణ లేదు. ఎవరూ ఆసక్తి కూడా చూపరు. అందుకే కోర్సు చేసిన తర్వాత కొంత కాలం ముంబయిలో వున్నా. ఢిల్లీకి చెందిన ఓ ప్రొడ్యూసర్‌ సపోర్ట్‌తో ఫ్రీలాన్స్‌గా కొన్ని ప్రాజెక్టులు చేశా. కమర్షియల్‌ సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాను. గ్రామీణ భారతం పేరుతో గ్రామాలన్నీ తిరిగేవాళ్ళం. రైతుల సమస్యలపై, గ్రామీణ ప్రాంతాల గురించి ఐదు నిమిషాల సినిమాలు చాలా చేశాను. మా నాన్నగారికి హెల్త్‌ బాగోక పోవడంతో 2002లో హైదరాబాద్‌ వచ్చేశాను. ఇక్కడకు వచ్చిన తర్వాత ఆర్కా మీడియా వారి ‘మార్నింగ్‌ రాగ’ అనే ఇంగ్లీష్‌ సినిమా చేశాను. ఇందులో షబానా అజ్మీ కూడా చేశారు. అదే ఆ సమయంలో నల్లగొండలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నా. అప్పటి నుండి పర్యావరణం కాపాడుకోవడం కోసం పని చేస్తూనే వున్నా.

అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా…
విశాఖపట్నం దగ్గరలో నర్సీపట్నం అనే ఊరు ఉంది. అక్కడ వజ్రం లాంటి రంగురాళ్ళు దొరుకుతున్నాయని అక్రమ తవ్వకాలు చేస్తు న్నారు. ఆ తవ్వకాల వల్ల వ్యవసాయం పాడైపోతుంది. అంతే కాక కొండలు, పొలాలు, నదులు, వాగులు ఎండి పోతాయి. వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. ఇలా ఎన్నో సమస్యలు వుంటాయి. ఇవన్నీ అక్కడ బయటపడ్డాయి. 2004లో అక్కడి ప్రాంతాలన్నీ తిరిగి ‘మెరుపు వెనక’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీశాను. నేను సొంతంగా తీసిన మొదటి ప్రాజెక్టు ఇది. ఇక అప్పటి నుండి కమర్షిల్‌ సినిమాల జోలికి వెళ్ళదలచుకోలేదు.

ఆర్గానిక్‌ సాగు గురించి…
15 ఏండ్ల కిందట యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తుంటే అభివృద్ధి నిరోధకులు అంటూ మమ్మల్ని తిట్టుకునేవారు. అయితే ప్రస్తుతం ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది. పర్యావరణం గురించి కాస్త ఆలోచిస్తున్నారు. మనం తినే తిండి కలుషితమైపోతుంది. అందుకే ఆర్గానిక్‌ వ్యవసాయం గురించి కూడా కొన్ని సినిమాలు తీశాను. ‘ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక’ అనే ఆర్గనైజేషన్‌కి 2010 నుండి 2014లో కన్వీనర్‌గా చేశాను. తర్వాత రంగారెడ్డి జిల్లాలో కొంత వ్యవసాయ పొలం తీసుకుని వ్యవసాయం చేయిస్తున్నా. ఇప్పుడు మా పొలం పక్కనే ఫార్మా సిటీ ప్రాజెక్ట్‌ ఒకటి పెట్టబోతున్నారు. దీని వల్ల చాలా నష్టాలు వున్నాయి. పొలాలు నాశనం అవుతాయి. నీరు కలుషితం అయిపోతుంది. ప్రసుత్తం దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాను.

చేనేత సంత
చేనేత కార్మికుల కోసం పని చేసే ఓ సంస్థ సహకారంతో డాక్యుమెంటరీ సినిమా కోసం గతంలో చేనేత కార్మికులను కొంత మందిని కలిసి మాట్లాడాను. వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకోడానికి కార్మికులు ఎంత కష్టపడుతున్నారో అర్థమయింది. అయితే ఆ సంస్థ అనుకోకుండా సంక్షోభంలో చిక్కుకుంది. కొంత కాలం ఆ సంస్థలో స్వచ్ఛందంగా పని చేశాను. చేనేతపై ఉన్న ఆసక్తితో 2015లో అనుకోకుండా ‘చేనేత సంత’ ను ప్రారంభించాను. దీన్ని ప్రారంభించడానికి నా స్నేహితులు 20 మంది వరకు సహకరించారు. సంత అంటే ఎలాంటి ఖర్చు లేకుండా అక్కడకు ఎవరైనా వచ్చి అమ్ముకు పోవచ్చు. చేనేత కార్మికులకు కూడా అలాంటి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ‘చేనేత సంత’ అని దానికి పేరు పెట్టాను. అయితే హైదరాబాద్‌ లాంటి చోట ఫ్రీగా నడపడమంటే చాలా కష్టం. అందుకే కార్మికులే సాధారణ ఖర్చులతో దాన్ని నడిపిస్తున్నారు. ప్రారంభించిన కొత్తలో ఓపెన్‌ ప్లేస్‌ ఒకరు ఫ్రీగా ఇచ్చారు. అయితే వర్షం వస్తే ఇబ్బందిగా వుండేది. అందుకే కొన్ని రోజుల తర్వాత అమీర్‌ పేట్‌లోని నాగార్జున నగర్‌ కమ్యూనిటీ హాల్లో దీన్ని పెడుతున్నాం. ప్రతి రెండు నెలలకు ఒకసారి మూడు రోజుల పాటు ఈ చేనేత సంత జరుగుతుంది. వీరు ఆన్‌లైన్‌లో కూడా తమ ఉత్పత్తులను అమ్ముకునే విధంగా ప్లాన్‌ చేశాం. శ్రీకాకుళం, చిత్తూరు, నాగర్‌కర్నూల్‌, గుంటూరు, మంగళగిరి, పోంచపల్లి, కరీంనగర్‌, వరంగల్‌ నుండి కార్మికులు వచ్చి ఇక్కడ తమ ఉత్పత్తులను అమ్ముకుంటారు. చెన్నై, బొంబయి నుండి రెగ్యులర్‌గా కస్టమర్లు వచ్చి పెద్ద మొత్తంలో ఉత్పత్తులు తీసుకుపోతారు.

స్వార్థ ప్రయోజనాల కోసమే…
ప్రస్తుతం ఫార్మా ఇండిస్టీ గురించి డాక్యుమెంటరీ తీస్తున్నాను. పెట్టుబడి దారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వాళ్ళు తయారు చేసే మందులతో జనాన్ని చంపుతున్నారు. పెట్టే ఫ్యాక్టరీ వల్ల కూడా జనాన్ని చంపేస్తున్నారు. అందుకే నాచురోపతి వైద్యాన్ని ప్రచారం చేయాలి. మహిళలు గర్భసంచిలో గడ్డలు వున్నాయని వస్తారు. వెంటనే ఆపరేషన్‌ చేసి గర్భసంచి తీసేస్తారు. దీని వల్ల మహిళలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. నిజం చెప్పాలంటే ఆ గడ్డలు సహజంగా కరిగిపోతాయి. కానీ కార్పొరేట్‌ డాక్టర్లు భయపెట్టి బిజినెస్‌ మాదిరిగా ఆపరేషన్‌లు చేస్తున్నారు. జనం కూడా ప్రతి దానికి మందు బిళ్లలకు అలవాటుపడ్డారు. పంట త్వరగా చేతికి రావాలని విపరీతంగా మందులు వేస్తే నేల ఎలాగైతే పాడైపోతుందో అలాగే మన శరీరం కూడా. ఏ మందు బిళ్ళలు పడితే అవి మింగుతుంటే మన శరీరం కూడా అంతే పాడైపోతుంది. అవగాహన లేక ఇలా చేస్తున్నారు. మన జీవన విధానంలో, తినే తిండిలో చిన్న చిన్న మార్చుకుంటే చాలు. రాబోయే ఎన్నో జబ్బులను తగ్గించుకోవచ్చు. వీటిపై అవగాహన కల్పించేందుకే ‘నేచర్‌ క్యూర్‌’ పేరుతో ఓ డాక్యుమెంటరీని తీశాను.

Courtesy Nava telangana