ఒకరి తలవైపు మరొకరి కాళ్లు.. వెల్లకిలా పడుకున్న రోగి ఓ పక్కకు తిరిగే వీలే లేదు. ఎందుకంటే ఒకే బెడ్‌ మీద ముగ్గురు రోగులు. ఈ దృశ్యం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్కారు దవాఖానలోది. రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇదే దైన్యం! ఒకే బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు రోగులను పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు.

  • కిక్కిరిసిన ఆస్పత్రులు.. పెరుగుతున్న డెంగీ కేసులు
  • సరిపోని పడకలు.. ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు
  • నేలపై పడుకోబెట్టి చికిత్స.. ఔట్‌ పేషెంట్ల బారులు
  • ప్లేట్‌ లెట్ల పేరుతో ఆస్పత్రుల్లో అడ్డగోలు దోపిడీ
  • నిబంధన ప్రకారం లక్ష ప్లేట్‌లెట్స్‌ రూ.11 వేలు
  • లక్షల్లో రాబడుతున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు
  • రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ అక్కర్లేదు
  • 99 శాతం సాధారణ జ్వరాలే: ఈటల

నాలుగు రోజుల క్రితం నా కొడుకుకు బైలుకు పెట్టింది. జ్వరమొచ్చింది. వనపర్తి జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చిన. ఇక్కడా దోమలున్నయి. ఫ్యాన్లు లేవు. నాలుగు రోజులుగా ఆస్పత్రిలోనే ఉండటంతో నాకూ జ్వరమొచ్చింది. మా ఇద్దరిని చూసుకునేందుకు ఊరినుంచి మా తమ్ముడొచ్చిండు. ఇప్పుడు వాడికి ఏమైతదోనని భయమైతుంది. వనపర్తి జిల్లా తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన మద్దిలేటి అనే వ్యక్తిది ఈ ఆవేదన! రాష్ట్రంలో జ్వరాలు ఏ స్థాయిలో పట్టిపీడిస్తున్నాయో చెప్పేందుకు ఇదో ఉదాహరణ! ఏ ఇంట్లో చూసినా ఒకరిద్దరు జ్వరంతో బాధపడుతున్నారు. మోకాళ్లు, ఒళ్లు నొప్పులు.. సర్ది, దగ్గు, గొంతునొప్పితో బాధితులు వేలల్లో వస్తున్నారు. ఎక్కడ డెంగీ సోకిందో ఏమోనన్న భయం రోగులను పీడిస్తోంది. దీనికి తగ్గట్లుగానే డెంగీ కేసులూ పెరుగుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌, చికున్‌గున్యా వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్‌లు సరిపోవడంలేదు. తాత్కాలికంగా మంచాలను తెచ్చినా అవీ చాలడంలేదు. చాలాచోట్ల నేల మీద పడుకోబెడుతున్నారు. అక్కడక్కడా డెంగీ మరణాలు నమోదవుతుండటం కలవరపరుస్తోంది. ఖమ్మం ఆస్పత్రికి వేలల్లో ఔట్‌పేషంట్లు వస్తుంటే డెంగీ లక్షణాలతో 50మంది దాకా ఉంటున్నారు. మంగళవారం ఖమ్మం ఆస్పత్రిని పరిశీలించేందుకు వచ్చిన మంత్రి ఈటల రాజేందర్‌.. బెడ్‌ మీద ఒక్కరోగినే ఉంచాలని, సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను గట్టిగా ఆదేశించారు. అయినా ఆయన ఆదేశాలు అమలుకావడం లేదు. ఇక్కడ వైద్యులూ సరిగా అందుబాటులో ఉండటంలేదు.

శుక్రవారం సాయంత్రం ఒక్క వైద్యుడే విధుల్లో ఉన్నారు. పొద్దట్నుంచి సాయంత్రందాకా ఓపీ లైన్‌లో రోగులు బారులు తీరుతున్నారు. రోజుకు 1200 మంది రోగులకుపైగా బ్లడ్‌ టెస్ట్‌లు చేస్తున్నారు. పొద్దున పరీక్ష చేస్తే.. రాత్రికిగానీ రిపోర్టు చేతికి అందడం లేదు. రిపోర్టుల కోసం రోగులు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా ఖవ్మం జిల్లాలో 971 డెంగీ కేసులు నమోదయ్యాయి. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఇప్పటివరకు డెంగీ రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయలేదు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఇప్పటిదాకా 36, వికారాబాద్‌ జిల్లాలో 54, జనగామ జిల్లాలో 60, మహబూబాబాద్‌ జిల్లాలో 25, కామారెడ్డి జిల్లాలో 28, నారాయణపేట జిల్లాలో 55, సంగారెడ్డి జిల్లాలో 115, నిజామాబాద్‌ జిల్లాలో 150 డెంగీ కేసులు నమోదయ్యాయి.

 ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ
విషజ్వరాల సీజన్‌ను ప్రైవేటు ఆస్పత్రులు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. డెంగీ బాగా ప్రబలుతుండటంతో చిన్నపాటి జ్వరం వచ్చినా ఆ వ్యాధేనేమో అనుకొని జనం ఆస్పత్రులకు వెళుతున్నారు. అక్కడేమో ఆ టెస్ట్‌లు.. ఈ టెస్ట్‌లు చేయాలంటూ ఓ ఆరేడు రకాల పరీక్షలు చేయిస్తున్నారు. చికిత్స పేరుతో ఓ నాలుగైదు రోజులు ఆస్పత్రిలోనే ఉంచేసి రూ.50వేల దాకా బిల్లు వసూలు చేసి పంపిస్తున్నారు. డెంగీ ప్రబలుతుండటంతో రోగులకు ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయి. గాంధీలో గత 24 గంటల్లో 40 మందికిపైగా రోగులకు ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్లేట్‌లెట్స్‌ దాతలు ముందుకు రావాలని, 040 24600146 నంబరులో సంప్రదించాలని ఉస్మానియా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ కోరారు.
 డెంగీతో గాంధీలో ఆరుగురు మృతి!
అడ్డగుట్ట: ‘మా దగ్గర ఇప్పటివరకు డెంగీతో బాధపడుతూ ఎవ్వరూ చనిపోలేదు’ ఇది గాంధీ ఆస్పత్రి వైద్యుల సమాధానం! ఇటీవల ఆ ఆస్పత్రిని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి ఈటలకూ అధికారులు ఇదే చెప్పారు. అయితే. డెంగీతో బాధపడుతూ ఈ నెల ఒకటి నుంచి 12వ తేదీ మధ్య ఇదే ఆస్పత్రిలో ఆరుగురు చిన్నారులు చనిపోయారని తెలిసింది. ఫలక్‌నుమా వడ్డెపల్లికి చెందిన నవీల్‌ (9), గోషామహల్‌కు చెందిన అపూర్వ (3) గాంధీనగర్‌ కు చెందిన అపూర్వ (8), బడంగ్‌పేట్‌ కోహీర్‌కు చెందిన హర్షిత (4), సైదాబాద్‌కు చెందిన రాకేశ్‌ (9), తార్నాకకు చెందిన నవీన్‌ (12)కు డెంగీతో బాధపడుతూ చనిపోయారు.
నరకయాతన
అది తాండూరు ప్రభుత్వ ఆస్పత్రి. బాగా ఉబ్బిపోయిన కాళ్లు, పొట్టతో బాధపడుతూ గురువారం రాత్రి ఆస్పత్రి ఆవరణలో ఓ వ్యక్తి కూలబడ్డాడు. పేరు గౌస్‌ అని చెప్పాడు. కొందరు ఆస్పత్రిలోకి వెళ్లి గౌస్‌ను అడ్మిట్‌ చేసుకోవాలని వైద్యులను అర్థించారు. వారేమో ‘ఆ రోగి వద్ద మీరు ఉంటారా?’ అని ప్రశ్నించారు. విషయం ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి రావడంతో అక్కడికి వెళ్లగా సిబ్బంది వచ్చి గౌస్‌ను ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే చనిపోయాడు.

(Courtesy Andhrajyothi)