– ఫీజు పెంపు.. డ్రెస్‌ కోడ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు
– విద్యార్థులపై నీటి ఫిరంగులు ప్రయోగించిన పోలీసులు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
ఫీజుల పెంపు నిర్ణయం దేశంలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) విద్యార్థుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. హాస్టల్‌ ఫీజులు తగ్గించాలని, ఆంక్షలతో కూడిన నిబంధనలు తొలగించాలనీ, ఈ సమస్యలపై విద్యార్థులతో వైస్‌ చాన్సలర్‌ చర్చించాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 1 నుంచి విద్యార్థుల పోరాటం కొనసాగుతుంది. వర్సిటీ యాజమాన్య అహంకార వైఖరితో అది కాస్తా సోమవారం ఉద్రిక్తంగా మారింది. దీంతో విద్యార్థులపై పోలీసులు, సీఆర్పీఎఫ్‌ భద్రతా సిబ్బంది దాడికి ఒడిగట్టారు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా వర్సిటీలోకి పోలీసులు గన్స్‌, టియర్‌ గ్యాస్‌ తీసుకొచ్చి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేశారు. మగ పోలీసులు విద్యార్థినీలపై పాశవికదాడికి పూనుకున్నారు. పోలీసులు దాడుల్లో అనేక మంది విద్యార్థులకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.
జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్‌ 2018-19 బ్యాచ్‌కు పీజీ విద్యార్థులకు పట్టాలు, పీిహెచ్‌డీ, ఎంఫిల్‌ పూర్తి చేసిన వారికి డాక్టరేట్లు ఇచ్చేందుకు స్థానిక ఏఐసీటీిఈ భవన్‌లో స్నాతకోత్సవం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రీయాల్‌, యూనివర్శిటీ చాన్సలర్‌, వైస్‌ చాన్సలర్‌ జగదీష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇటీవలి రూపొందించిన హాస్టల్‌ మాన్యువల్‌ విద్యార్థులకు వ్యతిరేకంగా ఉందనీ, దీన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులంతా ఉదయం తొమ్మిది గంటల నుంచే స్నాతకోత్సవం జరిగే భవనానికి వెలుపల ఆందోళన చేశారు. వైస్‌ చాన్సలర్‌ వచ్చి చర్చించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఆందోళన కొనసాగుతుండగానే జేఎన్‌యూఎస్‌యూ కార్యవర్గ సభ్యులు లోపలకెళ్లి రమేష్‌ పోఖ్రీయాల్‌కు వినతి అందించారు. వీసీ మొండి వైఖరిపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. కానీ వీసీ, కేంద్ర మంత్రి విద్యార్థి నేతల విజ్ఞప్తిని పక్కనపెట్టారు..
ఈ సందర్భంగా జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీ గోష్‌ మాట్లాడుతూ హాస్టల్‌ ఫీజులు అధికంగా పెంచారని విమర్శించారు. గత మూడు వారాలుగా వీసీని విశ్వప్రయత్నాలు చేశామని తెలిపారు. తమ సమస్యలపై చర్చించేందుకు వీసీ, డీన్‌, రెక్టార్‌ ఎవ్వరూ అందుబాటులో లేరన్నారు.
అసలేం జరిగిందంటే..?
హాస్టల్‌ ఫీజులు పెంచుతూ, అలాగే కొన్ని ఆంక్షలు విధిస్తూ డ్రాఫ్ట్‌ హాస్టల్‌ మాన్యుల్‌ వెబ్‌సైట్‌లో పెట్టారు. దీనిపై అక్టోబర్‌ 21 వరకు ఈ మెయిల్‌ ద్వారా ఫిర్యాదులు ఇవ్వొచ్చని తెలిపారు. దాదాపు మూడు వేల మంది విద్యార్థులు ఈ మెయిల్‌ ద్వారా ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులను పరిశీలించి, డ్రాఫ్ట్‌ను ఆమోదించేందుకు అక్టోబర్‌ 21న ఇంటర్‌ హాస్టల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఐహెచ్‌ఏ) కమిటీ సమావేశం జరుగుతుందని తెలిపారు. అయితే దాన్ని ఆరోజు జరపకుండా అకస్మాత్తుగా అక్టోబర్‌ 28 వాయిదా వేశారు. విద్యార్థుల ప్రతినిధులైన అన్ని హాస్టల్స్‌ అధ్యక్షులంతా ఐహెచ్‌ఏ కమిటీలో సభ్యులు. అక్టోబర్‌ 28న ఐహెచ్‌ఏ సమావేశం జరుగుతుందని హాస్టల్స్‌ అధ్యక్షులందరికి సమాచారం ఇచ్చారు. హాస్టల్స్‌ అధ్యక్షులందరూ నిర్ణీత సమయంలోనే ఆ సమావేశానికి వెళ్లారు. అయితే వారు వెళ్లి కమిటీ హాల్‌లోకి అడుగు పెడుతున్నారనే సరికి, సమావేశం అయిపోయిందని, డ్రాఫ్ట్‌ను ఆమోదం పొందిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో వారంతా ఖంగుతిన్నారు. పది నిమిషాల్లో సమావేశం ఎలా పూర్తి చేస్తారని విద్యార్థి నేతలు ప్రశ్నించారు. ”అక్టోబర్‌ ఎనిమిది నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి.

Courtesy Navatelangana..