ప్రభుత్వ బొగ్గు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను పూర్తిగా విరమించుకున్నది. కోల్ ఇండియా లిమిటెడ్‌లో భారత ప్రభుత్వ వాటా 70.96 శాతం కాగా, ప్రైవేటు ఈక్విటీ 29.04 శాతంగా ఉన్నది. దేశానికి ఆర్థిక, సామాజిక ప్రయోజనాలెన్నో చేకూరుస్తూ, ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తున్న బొగ్గు పరిశ్రమలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించడం సమంజసమేనా?

 ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఒక టీవీ ఛానల్ లోపబ్లిక్ సెక్టార్ యూనిట్‌ (పీఎస్‌యూ) ప్రయివేటీకరణ గురించి మట్లాడుతూ ‘హమారే దేశ్ మే పీఎస్‌యూ కే జన్మ్ హోతా హై, ఓ మర్నే కే లియే హోతాహై, అబ్ ఇస్ కే రాస్తే ఖోజ్‌ గయే, యాతో బంద్ కర్ దో, నాతో ప్రైవేటైజ్ కర్ దో…’

ఆగస్టు 28న జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో సింగిల్ బ్రాండ్ రిటైలింగ్‌కు సంబంధించిన ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) నిబంధనలను మరింత సరళతరం చేస్తూ నిర్ణయించారు. బొగ్గు తవ్వకాలు, అనుబంధ మౌలిక వసతులు, కాంట్రాక్టు తయారీ విభాగాల్లో నూరు శాతం ఎఫ్‌డీఐలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపినారు. దానితో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌)తో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల భవిష్యత్తుపై ఆందోళనలు మొదలయ్యాయి. భారత దేశంలో బొగ్గు తవ్వకం 1774లో ప్రారంభమైనది. 1946 నాటికి బొగ్గు ఉత్పత్తి 30 మిలియన్ టన్నులకు పెరిగింది. స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వపరంగా భారీ పరిశ్రమలను స్థాపించడం వేగవంతమైంది. ఈ కారణంగా బొగ్గు అవసరం పెరిగింది. 1951లో మొదలైన మొదటి పంచవర్ష ప్రణాళిక నాటికి బొగ్గు ఉత్పత్తి 33 మిలియన్ టన్నులకు పెరిగింది. స్వదేశీ బొగ్గు ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు 1956లో ‘జాతీయ బొగ్గు అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ)ను ఏర్పాటు చేశారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1973 మే1న బొగ్గు గనులను జాతీయం చేసింది. దీనిలో భాగంగానే 1975 నవంబర్ 1న కేంద్ర ప్రభుత్వ సంస్థగా ‘కోల్ ఇండియా లిమిటెడ్’ (సీఐఎల్‌) ఆవిర్భవించింది. దానితో బొగ్గు రంగం ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొంగు బంగారం అయింది. నిర్దేశిత వార్షిక బొగ్గు ఉత్పత్తిని క్రమంగా అధిగమిస్తూ వచ్చింది. 2007–- 2008 ఆర్థిక సంవత్సరం నాటికి 379.46 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని పెంచుకుంది. 2007 మార్చి 28న ‘మినీ రత్న’ కంపెనీ హోదాను దక్కించుకుంది. అలాగే 2008 అక్టోబర్ 23న ‘నవ రత్న’ హోదాను, 2011 ఏప్రిల్ 11న ‘మహా రత్న’ హోదాతో వాసికెక్కింది.

2013 డిసెంబర్ 13న తెచ్చిన ‘కోల్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (సీఆర్‌ఎఐ)’ ప్రకారం బొగ్గు అమ్మకం ధరను నిర్ణయించుకునే అవకాశాన్ని కోల్ ఇండియా కోల్పోయింది.

1991–-1992లో ప్రారంభమైన పెట్టుబడుల ఉపసంహరణలు కోల్ ఇండియా విస్తరణను నిలువరించినవి. సర్వే చేయబడి తవ్వకాలకు సిద్ధమైన బొగ్గు బ్లాక్‌లను గంపగుత్తగా ప్రైవేటు వారికి కట్టబెట్టిన తీరు కుంభకోణంగా వెలుగులోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. 1993 నుండి 2005 సంవత్సరాల మధ్య ప్రైవేటుకు గంపగుత్తగా ఇచ్చిన 22 కోల్ బ్లాకులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. యూపీఏ హయాంలో ప్రభుత్వ పరిశ్రమల ప్రైవేటీకరణ మొదలైంది. ఎన్డీయే పాలనలో ప్రైవేటీకరణ వేగం పుంజుకుంది. వాజపేయి ప్రభుత్వంలో మొదటి సారిగా పెట్టుబడుల ఉపసంహరణ శాఖ ఏర్పాటుచేసి, దానికి అరుణ్ శౌరీని మంత్రిగా నియమించారు. బొగ్గు ప్రయివేటీకరణ చర్యలు 2014 నాటికి వేగిరమైనవి. నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘బొగ్గు గనుల ప్రత్యేక నిబంధనల చట్టం 2015’ను తీసుకువచ్చి 2018 జనవరి 8న బొగ్గు గనుల జాతీయకరణ చట్టం 1973ను రద్దు చేసింది. 2018 ఫిబ్రవరి 20న ఆర్థిక వ్యవహారాల కేంద్ర మంత్రి వర్గ సంఘం (సీసీఈఎ) పెద్ద, మధ్య, చిన్న స్థాయి బొగ్గు గనులను ప్రైవేటుకు ఇవ్వడానికి ఆమోదం లభించింది. చివరగా 2019 అగస్టు 28 నాటి కేంద్ర క్యాబినెట్ ఈ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించింది. ఇదే క్రమంలో సెప్టెంబర్ 13న క్యాబినెట్, రెవెన్యూ, బొగ్గు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సమావేశమై బొగ్గు రంగాన్ని ప్రైవేటీకరించే సంస్కరణలను సిఫారసు చేసినారు.

ఈ నేపథ్యంలో ‘కోల్ ఇండియా లిమిటెడ్’తో పాటు, తెలంగాణ రాష్ట్ర వాటా 51 శాతం, కేంద్ర ప్రభుత్వ వాటా 49 శాతం భాగస్వామ్యంతో నడుస్తున్న ‘ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’ ఉనికికి ముప్పు ముంచుకొచ్చింది. ప్రపంచంలో 5వ అతి పెద్ద బొగ్గు నిల్వలను కలిగి ఉన్న దేశంగా, బొగ్గు ఉత్పత్తిలో 4వ అతి పెద్ద దేశంగా ఉన్నది. 2018 అక్టోబర్ 31 నాటికి దేశంలో బొగ్గుతో 1,86,492.88 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అయింది.

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బొగ్గు పరిశ్రమకు బడ్జెట్ కేటాయింపులను పూర్తిగా విరమించుకున్నది. కోల్ ఇండియా లిమిటెడ్‌లో భారత ప్రభుత్వ వాటా 70.96 శాతం కాగా, ప్రైవేటు ఈక్విటీ 29.04 శాతంగా ఉన్నది. 2018-– 2019 ఆర్థిక సంవత్సరంలో 607 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించింది. రూ.1,32,718 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నది. టర్నోవర్‌గా, బొగ్గు ఉత్పత్తుల ఆదాయం రూ.1,40,603 కోట్లుగా ఉంది. నిర్వహణ ఆదాయంగా రూ. 27,125 కోట్లు, రాయల్టీ ఇతరత్రా పన్నుల పేర దాదాపు రూ. 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించి, రూ. 17,462 కోట్ల నికర ఆదాయాన్ని సాధించింది. ఈ విధంగా దేశానికి ఆర్థిక, సామాజిక ప్రయోజనాలెన్నో చేకూరుస్తూ, ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తున్న బొగ్గు పరిశ్రమలో మోదీ ప్రభుత్వం 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించింది. ప్రభుత్వము తీసుకున్న స్వదేశీ, ప్రభుత్వ పరిశ్రమల ఈ వ్యతిరేక చర్యలను వెనుకకు తీసుకోవాలనికోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కంపెనీలో సెప్టెంబర్ 24 న ఒక రోజు టోకెన్ సమ్మెకు ఎ.ఐ.టి.యు.సి, సి.ఐ.టి.యు, ఐ.ఎన్.టి.యు.సి, హెచ్.ఎం.ఎస్, ఎ.ఐ.సి.టి.యు పిలుపునిచ్చాయి. ఐ.ఎఫ్.టి.యు, పౌర హక్కుల సంఘాలు మద్దతు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పునరాలోచించి రాజ్యాంగ స్పూర్తితో వ్యవహరించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆమోద నిర్ణయాన్ని వెనుకకు తీసుకుంటుందని ఆశిద్దాం.

మేరుగు రాజయ్య

(కేంద్ర కార్యదర్శి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఎ.ఐ.టి.యు.సి.)

Courtesy AndhraJyothy..