కన్న కూతురిపై తండ్రి అత్యాచారం
ఆర్నెల్లుగా ఘోరం.. 2 నెలల గర్భం
పోలీసులమని చెప్పి వివాహితపై రేప్‌
పెళ్లి పేరుతో బాలికపై అత్యాచారం
కూతురుపై అత్యాచారయత్నం

అత్యాచారాలు ఆగడం లేదు. దుండగులు రెచ్చిపోతూనే ఉన్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురుపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తూ ఆరునెలలుగా ఆమెపై ఘోరానికి పాల్పడుతున్నాడు. కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసిందీ   ఘటన. మాచారెడ్డి మండలానికి చెందిన 42ఏళ్ల వ్యక్తికి భార్య, కూతురు (19), కొడుకు (15) ఉన్నారు. కూతురు పదో తరగతి దాకా చదవి ఇంటివద్దే ఉంటోంది. ఉదయం భార్య వ్యవసాయ పనులకు, కొడుకు బడికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న కూతురిని బెదిరించి లోబర్చుకునేవాడు. రాత్రుళ్లలో భార్య, కుమారుడికి కల్లుతాపి, వారు నిద్రపోగానే కూతురిపై అత్యాచారం చేసేవాడు. బాధితురాలి శరీరంలో మార్పులు రావడంతో ఆమెను తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా రెండు నెలల గర్భిణి అని తేలింది. భర్తే కారకుడని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఓ వివాహితపై గుర్తుతెలియని ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ వివాహిత (32) గుట్కాప్యాకెట్లతో బస్సులో ప్రయాణిస్తుండగా పోలీసులమని చెబుతూ ఇద్దరు వ్యక్తులు, వస్తాపూర్‌ కమాన్‌ వద్ద బస్సును ఆపారు. ఆమెను బస్సులో నుంచి దింపి, పాడుబడిన గోడల పక్కకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు.

ఖమ్మం జిల్లాలో కన్నకూతురుపై తండ్రే అత్యాచారయత్నం చేశాడు. భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి, మొదటి భార్యకు జన్మించిన కూతురు (13)పై కన్నేశాడు. ఆదివారం మధ్యాహ్నం  ఆమె నిద్రిస్తుండగా అసభ్యంగా ప్రవర్తించాడు. కుటుంబసభ్యులు మందలించినా బుద్ధి మార్చుకోని అతడు, రాత్రి  మరోసారి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు.  సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికపై నాగరాజు అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో బిచ్చమెత్తుకుంటూ బతికే ఓ మహిళ (40)పై చిన్న హిమామ్‌ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. ఆర్మూర్‌లో 12ఏళ్ల బాలిక పట్ల బాలయ్య (60) అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు.

Courtesy Andhrajyothi