ఒక్కడే తీసుకెళ్లి ఖననం చేసిన తండ్రి
అనంతపురం జిల్లా గోరంట్లలో విషాదం

గోరంట్ల: ఊరు కాని ఊరు వచ్చాడు. రెక్కల కష్టాన్నే నమ్ముకున్నాడు. అనారోగ్యం బారిన పడిన కుమారునికి వైద్యం చేయించుకోలేని నిస్సహాయ స్థితి. ప్రాణాలు కోల్పోయిన బిడ్డను తరలించేందుకు సైతం డబ్బుల్లేక… చేతులపై మృతదేహాన్ని మోసుకెళ్లి ఖననం చేశాడు. అనంతపురం జిల్లా గోరంట్లలో చోటుచేసుకున్న ఉదంతం స్థానికులను కలచివేసింది.

కదిరి పట్టణానికి చెందిన మంచాల మనోహర్‌ కుటుంబం ఐదేళ్లుగా గోరంట్లలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో గుడారంలో జీవిస్తోంది. ఆయనకు భార్య రమణమ్మ, ఇద్దరు కుమారులు, ఒక పాప ఉన్నారు. గుజిరీ దుకాణం(తుక్కు కొనుగోలు)లో మనోహర్‌ హమాలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. పది రోజుల క్రితం పెద్ద కుమారుడు దేవాకు దగ్గు, జ్వరంతోపాటు గొంతుకింద గడ్డలు రావడంతో స్థానికంగా వైద్యం చేయించాడు. అయినా నయం కాకపోవడంతో గోరంట్ల ఆస్పత్రికి తరలించాడు. మెరుగైన వైద్యం కోసం హిందూపురానికి తరలించారు. మంగళవారం బాలుడి నోరు, ముక్కునుంచి రక్తం వస్తుండటంతో బెంగళూరు లేదా కర్నూలుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

విధిలేని పరిస్థితుల్లో హిందూపురంలోనే చికిత్స చేయించాడు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కుమారుడు మరణించినట్లు మనోహర్‌ తెలిపాడు. వైద్యం కోసం రూ.6వేలు ఖర్చుచేశానని, రూ.1700తో ప్రైవేట్‌ ఆంబులెన్స్‌లో కుమారుడి మృతదేహాన్ని గోరంట్లకు తీసుకొచ్చినట్లు తెలిపారు. అసలే లాక్‌డౌన్‌ ప్రభావం.. పైగా చేతిలో చిల్లిగవ్వలేక పోవడంతో కుమారుడి శవాన్ని చేతులపై ఎత్తుకుని సమీపంలోని చిత్రావతి ఒడ్డున ఖననం చేశాడు.

Courtesy Andhrajyothy