భరత్‌నగర్‌ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం
ఒకరి మృతి.. ఐదుగురికి తీవ్రగాయాలు

దాదాపు మూడు నెలల క్రితం హైటెక్‌సిటీ సమీపంలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ మీద నుంచి ఒక కారు ఎగిరి కిందపడి మహిళ దుర్మరణం పాలైన ఘటన గుర్తుందా? మంగళవారం తెల్లవారుజామున ఎర్రగడ్డ వద్ద అలాంటి ప్రమాదమే జరిగింది. ఆరుగురు యువకులతో మూసాపేట వైపు నుంచి ఎర్రగడ్డ వైపు వెళ్తున్న కారు.. భరత్‌నగర్‌ ఫ్లై ఓవర్‌ పై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

ఎర్రగడ్డ/అడ్డగుట్ట/హైదరాబాద్‌ సిటీ : అది.. భరత్‌నగర్‌ ఫ్లై ఓవర్‌ మార్కెట్‌ ప్రాంతం! సమయం.. మంగళవారం తెల్లవారుజామున 2:15 గంటలు!! కూరగాయల లోడుతో వచ్చిన వాహనాల్లో సరుకును అన్‌లోడ్‌ చేసే పనిలో హమాలీలు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో.. ఢాం.. అనే భారీ శబ్దం వినిపించింది! అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో ఒక్క క్షణంపాటు ఎవ్వరికీ అర్థంకాలే దు. తలతిప్పి చూస్తే.. ఒక నల్లటి కారు నుజ్జునుజ్జయి అక్కడ పడి ఉంది. దాంట్లోంచి.. ‘కాపాడండి.. కాపాడండి’ అనే అరుపులు వినిపిస్తున్నాయి!!

తల పైకెత్తి చూస్తే వారికి అర్థమైంది.. ఆ కారు 30 అడుగుల ఎత్తున్న ఫ్లై ఓవర్‌ నుంచి పడిందని. వెంటనే హమాలీలు పరుగెత్తుకుంటూ కారువద్దకు చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. సమాచారం అందుకున్న సనత్‌నగర్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అదే సమయంలో.. అంబులెన్స్‌ కూడా అక్కడికి వచ్చింది. పొక్లెయినర్‌తో కారును పక్కకు తీశారు. కారులో మొత్తం ఆరుగురు యు వకులు ఉన్నారు. తలకు బలమైన గాయాలు కావడంతో సోహెల్‌అనే యువకుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన ఐదుగురు తీవ్ర గాయాలతో అచేతన స్థితిలో ఉన్నారు. పోలీసులు వారిని చికిత్స నిమిత్తం గాంధీకి తరలించారు. ఫ్లైఓవర్‌ నుంచి పడిన కారు మొదట కిందనిలిపి ఉన్న పొక్లెయినర్‌ మీద పడి, అనంతరం కిందపడినట్లు పోలీసులు గుర్తించారు. తొలుత పొక్లెయినర్‌పై పడటంతో దానికున్న ఇనుప పళ్ల ధాటికి కారు నిలువుగా కోసుకుపోయి నుజ్జునుజ్జు అయింది.

స్థానిక యువకులే..
బోరబండ పండిత్‌ నెహ్రూనగర్‌, స్వరాజ్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ సో హెల్‌, సునీల్‌, ఇర్ఫాన్‌, అశ్వక్‌, గౌస్‌, సోహెల్‌.. స్నేహితులు. మంగళవారం తెల్లవారుజామున రెండుగంటల ప్రాంతంలో మూసాపేటలోని గూడ్స్‌షెడ్‌ రోడ్డులో టీ తాగడానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో భరత్‌నగర్‌ కూరగాయల మార్కెట్‌ వైపుగా వచ్చి పై ఓవర్‌ ఎక్కారు. కొద్దిసేపటికే కారు అదుపు తప్పి.. ఎడమవైపు ఉన్న ఫుట్‌పాత్‌ ఎక్కి బ్రిడ్జి రెయిలింగ్‌ ను ఢీకొట్టి కింద పడింది. ఈ ప్రమాదంలో మహ్మద్‌ సోహెల్‌ (27) తల కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

అతివేగంతో కారు అదుపు తప్పడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. సోహెల్‌ మూసాపేట గూడ్స్‌షెడ్‌ రోడ్‌లోని బిస్మిల్లా హోటల్‌ యజమాని కుమారుడుగా తెలుస్తోంది. కారు దూసుకొచ్చిన విధానం, కిం దపడిన తీరు ను బట్టి గంటకు 100-120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన సునీల్‌పై ఐపీసీ 337, 304 ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నట్లు ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు.

Courtesy Andhrajyothi