*మోడీ సర్కారు ఓడితే ఫాసిస్టు శక్తులు బలహీన పడతాయా?*

ఈ మధ్య సోషల్ మీడియా లో ప్రగతిశీల మిత్రబృందాల మధ్య ఒక సంతోషకరమైన అంశంపై చాలా విస్తృత చర్చ జరుగుతోంది. అదే తాజా లోక్ సభ ఎన్నికల్లో మోడీ సర్కారు ఓటమిని పొందపోబోతున్నదనే సర్వేల కథనాల సంగతి! వీటి పై భావమిత్రులతో పాటు ప్రగతిశీల మేధో మిత్రుల నుండి ఈమధ్య కాలంలో వ్యక్తమయ్యే సంతోషకర వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలపై చారిత్రిక అనుభవాల స్పృహతో ఒక స్నేహపూర్వక హెచ్చరిక చేయాలని ఆలోచించా. ఐతే భావ మిత్రులకి అది బాధ కలిగించే అవకాశం ఉంది. మన భావ మిత్రుల ని నిరుత్సాహ పరిచే ఉద్దేశ్యం ఏ కోశానా నాకు లేదు. రేపటి మోడీ సర్కార్ ఓటమి వార్త భవిష్యత్తుపట్ల భావ మిత్రుల్లో ఓ రాజకీయ ఆశని కలిగిస్తున్నది. అట్టి నేపథ్యంలో వారిని నిరుత్సాహ పరచడం మంచిది కాదని భావించా. నిజానికి దేశంలో ఫాసిస్టు రాజకీయ ప్రమాదం పెరిగే క్లిష్టకాలంలో మోడీ సర్కారు ఓటమి ముమ్మాటికీ ఒక ఆనందించే పరిణామమే! దానితో నేనూ పూర్తిగా ఏకీభవిస్తా. అదే విధంగా రేపటి ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాయనే అంచనాతో కూడా దాదాపు నేను ఏకీభవిస్తున్నా. ఐతే అది ఏకపక్ష ఆనందం గా భావించలేక పోతున్నా. ఒక ఆనందం, మరోముప్పు లతో కూడిన సమ్మిళిత పరిణామంగా భావిస్తున్నా. అట్టి హెచ్చరిక చేయాల్సి ఉందని భావించా. ఐతే నేడు భావ మిత్రులు పొందే సహజ ‘భావఆనందం’ పై నీళ్లు చల్లుతున్నాననే భావన వారి మనస్సుల్లో కలగ కుండా జాగ్రత్త తీసుకోవాలి కదా! అందుకే రేపటి మోడీ సర్కార్ ఓటమి వెంట దాపురించే మరో అతి ప్రమాదం గూర్చి హెచ్చరిక చేద్దామనుకున్న నా ప్రయత్నాన్ని ఇంతవరకి నిగ్రహించుకుంటూ వచ్చా. కానీ కొన్ని కీలక రాజకీయ పరీక్షా సమయాల్లో ‘మౌనం’ కూడా క్షమించరాని నేరమే! ఈ సందేహం కూడా నన్ను వేధిస్తూ వస్తున్నది. ఇలాంటి సందర్భాలలో సకాలంలో స్నేహపూర్వక ముందస్తు హెచ్చరిక చేయకపోతే నేటి భావ మిత్రుల ‘ఏకపక్ష ఉత్సాహం’ రేపు ‘ఏకపక్ష నిరుత్సాహం’ గా మారే అవకాశం కూడా ఉంటుంది. కావున నేడు మిత్రులు అపోహపడ్డా నా మనస్సు లోని మాటని చెప్పాలని భావిస్తున్నా. రేపటి మోడీ ప్రభుత్వ ఓటమిని వెంబడించే పెను ఫాసిస్టు ప్రమాదం పట్ల రాజకీయ అప్రమత్తత కోసం ఈ ముందస్తు హెచ్చరిక ని చేస్తున్నా.

RSS తల్లి రాజకీయ సంస్థ! బిజెపి పిల్ల రాజకీయ సంస్థ! తన కన్న బిడ్డని అధికారంలోకి తెచ్చుకున్నది తల్లి సంస్థ! బిడ్డ గద్దె పై ఉన్నంత కాలం అట్టి అధికార స్థానానికి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడటం తల్లి బాధ్యత! బిడ్డ అధికార స్థానాన్ని తెలివిగా ఉపయోగించుకొని తల్లి తన దీర్ఘకాలిక రహస్య రాజకీయ ఏజండాని అమలు చేసుకుంటుంది. అందుకు ఎంతో కొంత ఓర్పు, నేర్పు,నిగ్రహం, సంయమనం పాటించడం తల్లి బాధ్యత! బిడ్డని పౌర సామాజిక వ్యవస్థ గద్దె పై నుండి తప్పించాక తల్లి ఓర్పు, నేర్పు కోల్పోతుంది. అది విశృంఖల రాజనీతితో రెచ్చిపోతుంది. బహిరంగ నగ్న రూప ఫాసిస్టు రాజ నీతిని చేపడుతుంది. అది రేపటి భౌతిక సత్యం. అంటే బీజేపీ సర్కారు ఓటమి తర్వాత తలెత్తే ప్రమాదం పట్ల ఒక అంచనా ఉండాలి.

నేడు మోడీ ప్రభత్వంపై దేశప్రజల అసమ్మతి, నిరసనల పై ఆధారపడి రేపు కుహనా విశాల ఐక్య కూటమి సర్కారు గద్దె ఎక్కుతుంది. రాహుల్…..లాలూ… అఖిలేష్….మాయా…..మమత…..DMK స్టాలిన్…. వగైరా….వగైరా….పంచ కూల కషాయం వంటి సర్కారు ఢిల్లీ గద్దె నెక్కుతుంది. ఈ తల్లీబిడ్డల అండతో ఫాసిజాన్ని తెచ్చేది ద్రవ్య పెట్టుబడిదారీవర్గం మాత్రమే. ఫాసిజం వాస్తవ అవసరమైనది “ద్రవ్య పెట్టుబడి శిఖర కూటమి” కి మాత్రమే! అట్టి వాస్తవ పెట్టుబడి కూటమి పధకం ప్రకారం తెలివిగా రేపటి కొత్త పంచకూల కాషాయ సర్కారు కూటమి ని ఒక వైపు తమ ప్రయోజనాల కోసం అరటితొక్కలా వాడు కుంటూనే, మరోవైపు దాన్ని స్వయంకృతపరాధాలతో కూలిపీఏ పరిస్థితిని సృష్టిస్తుంది. ద్రవ్యపెట్టుబడి దారీ వర్గం యొక్క శిఖరాగ్ర కూటమి రహస్యంగా ‘పని విభజన’ చేసుకుంటుంది. అందులో ఒక్కొక్క ఆర్ధిక ముఠా రేపటి ఐక్య కూటమి ప్రభుత్వంలోని ఒక్కొక్క పార్టీని రెచ్చగొట్టి కుక్కలు చింపిన విస్తరిగా కొత్త సర్కారు పతనానికి పధకం పన్నుతాయి. మరో వైపు RSS కి పూర్తి నిధులిచ్చి వీధి పోరాటాలకు దించు తాయి. ఒకవైపు రేపటి సర్కారుని అస్థిరపరిచి, దేశం అస్థిరతకి గురైనట్లు ప్రజల్లో తన కార్పొరేట్ మీడియాతో భావన కలిగిస్తుంది. మోడీ వంటి ఉక్కుమనిషే పాలించాలని, అంతే కాకుండా ఈనాటి పార్లమెంటరీ వ్యవస్థ స్థానం లో అధ్యక్ష తరహా లేదా సైనిక పాలన కావాలని మీడియా తో ప్రజల్లో ప్రచారం చేయిస్తుంది. మరోవైపు RSSని ద్రవ్య పెట్టుబడిదారీ వర్గ శిఖరాగ్ర కూటమి రంగంలోకి దింపుతోంది. భీతావహ శక్తితో భయంకరమైన విస్ఫోటన శక్తితో వీధుల్లో అది బలపడే పరిస్థితిని సృష్టిస్తుంది. నేడు కుహనా లౌకిక, ప్రజాతంత్ర పార్టీల కూటమి పట్ల మద్దతు పలికిన నిజమైన ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులని, సంస్థలని కూడా రేపు వీధుల్లో రాహుల్ గాంధీ సర్కారు (లేదా మరో నేత) పాపాలకి బాద్యులని చేసే విధంగా ఫాసిస్టు శక్తుల విధానం రూపొందుతుంది. వారిని అప్రతిష్ట చేస్తాయి. ఈముప్పుని హెచ్చరించడం లోఎవరినీ నిరుత్సాహ పరిచే ఉద్దేశ్యం లేదని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా.

చరిత్రలో సజీవమైన జర్మనీ నాజీ అనుభవాలు ఉన్నాయి. 1923 డిసెంబర్ మునిచ్ కుట్రకు పాల్పడి హిట్లర్ జైలు పాలయ్యాడు. సోషల్ డేమోక్రాట పార్టీ అద్వర్యంలో వైమర్ రిపబ్లిక్ ప్రభుత్వం హిట్లర్ పై నాడు నిప్పులు కక్కింది. కానీ అదే కుహనా సోషలిస్టు సర్కారు ని ద్రవ్యపెట్టుబడిదారీ వర్గం తమ చెప్పు చేతుల్లో పెట్టు కొని, హిట్లర్ నాజీ పార్టీ పట్ల ఉదారవైఖరి తీసుకునే విధంగా తెరవెనుక పధక రచన చేసి విజయం సాధించింది.1928ఎన్నికల లో 2 శాతం మాత్రమే నాజీ పార్టీకి ఓట్లు వచ్చాయి. అదే నాజీ పార్టీ క్రమక్రమ ఎదుగుదలలో తెరవెనుక ద్రవ్యపెట్టుబడి దారీవర్గం తనదైన విలక్షణ పాత్రని పోషించింది. అధికారంలో ఉన్న సోషల్ డెమొక్రటిక్ సర్కారు అండని ఒకవైపు తీసుకుంటూనే; మరోవైపు దాన్ని కూల్చే లక్ష్యం కల నాజీ పార్టీనీ, దాని నేత హిట్లరు నీ ద్రవ్యాపెట్టుబడి దారీ వర్గం ప్రోత్సహించింది. గద్దెపై ఏలుతున్న బూర్జువా ప్రజాస్వామ్య సర్కారుని చక్కగా వాడుకుంటూనే, వీధుల్లో చెలరేగే నాజీ శక్తుల పెరుగుదలకు తమదైన బాణీలో అది సహకరించింది. తుదకు జర్మన్ బూర్జువా ప్రజాతంత్ర పాలకుడైన హిండెన్ బర్గ్ తోనే ఫాసిస్టు హిట్లర్ ని 1933లో జర్మన్ ఛాన్సలర్ గా జర్మన్ ద్రవ్యపెట్టుబడి దారీవర్గం తెలివిగా ఎంపిక చేయించింది. అట్టి కుటిల రాజకీయ ఫాసిస్టు నాటకం చరిత్రలో ఒక భౌతిక సత్యం.

ఆక్స్ ఫామ్ నివేదికలు వెల్లడిస్తున్న తీవ్రాతి తీవ్ర సంపద వ్యత్యాసతల నేపథ్యంలో; త్వరలో మరో సారి ఆర్ధికసంక్షోభం బద్దలు కానున్నదన్న అంచనాల వెలుగులో ద్రవ్యపెట్టుబడి దారీవర్గానికి ఫాసిజం ఒక అనివార్య అవసరంగా మారుతోంది.అట్టి నేపథ్యం లో దేశప్రజలలో వీధి పోరాటాల ద్వారా పెంపొందించే ఫాసిస్టు వ్యతిరేక ప్రజాతంత్ర చైతన్యం మాత్రమే ప్రధానంగా రేపటి ఫాసిస్టు ముప్పు నుండి సమాజాన్ని కాపాడుతుంది. అనేక అనుభవాల వెలుగులో, ముఖ్యంగా జర్మన్, ఇటలీ చరిత్రలు అందించిన అనుభవాల వెలుగులో 1935 లో మూడవ కొమింటర్న్ ఏడవ మహా సభల్లో తీసుకున్న గుణపాటమిది. అది అప్పుడైనా, ఇప్పుడైనా, మార్గదర్శకమైనదే!

మిత్రుల సంతోషాన్ని నిరుత్సాహపరిచే ఉద్దేశ్యం తో పంపే పోస్టింగ్ కాదని మరో సారి మనవి! ఒకవేళ రేపు బీజేపీ సర్కారు ఓటమి తర్వాత వచ్చే ప్రమాదాల పట్ల తగిన రాజకీయ అవగాహన, అప్రమత్తతలతో మిత్రులు పొందే సంతోశం పట్ల సమస్య లేదని కూడా స్పష్టం చేస్తున్నా.

*✍P.ప్రసాద్* (పిపి) IFTU 9-5-2019