ఆయనపై ప్రజా భద్రత చట్టం ఎత్తివేత
370 నిర్వీర్యంతో అదుపులోకి.. ఆర్నెల్లుగా గృహ నిర్బంధంలో

శ్రీనగర్‌, న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, సీనియర్‌ పార్లమెంటేరియన్‌ ఫారూక్‌ అబ్దుల్లాపై ప్రయోగించిన ప్రజా భద్రత చట్టం (పీఎ్‌సఏ)ను ఉపసంహరిస్తూ స్థానిక అధికార యంత్రాంగం శుక్రవారం ఆదేశాలిచ్చింది. దీంతో ఏడు నెలల అనంతరం ఆయన జన జీవనంలోకి రానున్నారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 ఎత్తివేతతో గతేడాది ఆగస్టు 5న ఫారూక్‌ను ముందుజాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబరు 15న ఆయనపై పీఎ్‌సఏను ప్రయోగించారు. కఠినమైన ఈ చట్టం కింద ఏ వ్యక్తినైనా విచారణ లేకుండా మూడు నెలల పాటు నిర్బంఽధించవచ్చు. కాగా, డిసెంబరు 13న మాజీ సీఎం నిర్బంధాన్ని పొడిగించారు. ఈ వ్యవధి ముగియనుండగా.. కలెక్టర్‌ షాహిద్‌ ఇక్బాల్‌ చౌధురి శుక్రవారం ఫారూఖ్‌ నివాసానికి వెళ్లి విడుదల ఉత్తర్వులిచ్చారు. శ్రీనగర్‌ ఎంపీ అయిన ఫరూఖ్‌ ప్రస్తుత పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే ఆలోచనలో ఉన్నారు. తన విడుదల కోసం పార్లమెంటులో గొంతెత్తిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని మిగతా నాయకులు బయటకు వచ్చాక భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఆయన కుమారుడు, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లాపై పీఎ్‌సఏను గత నెల 6న పునరుద్ధరించారు. మరోవైపు ఫరూఖ్‌ విడుదలను స్వాగతించిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం.. జమ్ముకశ్మీర్‌లో నియంతృత్వం, ఏకపక్ష పోకడలు రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. ఇదే వైరస్‌ దేశంలోని మిగతా రాష్ట్రాలకూ పాకుతోందని అన్నారు. ‘ఎలాంటి అభియోగాలు లేకున్నా ఫరూఖ్‌ను ఏ చట్ట కింద ఇంత కాలం నిర్బంధించారు?’ అని ప్రశ్నించారు.

Courtesy Andhrajyothi