– ‘ప్రజా రక్షణ చట్టంతో వేలాది మందిపై అక్రమ నిర్బంధాలు
మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లాతోపాటు అనేకమంది గృహనిర్బంధం
రెండేండ్ల వరకూ అడిగే దిక్కేలేదు…
ఒకవేళ కోర్టులు కొట్టేస్తే…మళ్లీ కొత్త కేసు
న్యూఢిల్లీ : గత 42ఏండ్లుగా జమ్మూకాశ్మీర్‌లో ‘పబ్లిక్‌ సేఫ్టీ యాక్ట్‌'(పీఎస్‌ఏ)ను కేంద్రం ఇష్టమొచ్చినట్టుగా వాడుతోంది. అక్కడున్న అనేకమంది రాజకీయ నాయకుల్ని గృహ నిర్బంధంలో పెట్టడానికి ఈ చట్టాన్ని విచక్షణారహితంగా ప్రయోగిస్తోంది. జమ్మూకాశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లాపై కూడా ఇదే చట్టాన్ని ప్రయోగించి, 42రోజులుగా గృహనిర్బంధంలో ఉంచారు. పీఎస్‌ఏ చట్టాన్ని ఉపయోగిస్తూ కాశ్మీర్‌లో కొనసాగుతున్న నిర్బంధాలు జాతీయ మీడియాలో వార్తా కథనాలుగా వస్తున్నాయి.
ఈ చట్టం దుర్వినియోగం అవుతోందనీ, పీఎస్‌ఏ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలనీ రెండు నెలల క్రితం మానవ హక్కుల సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా’ డిమాండ్‌ చేసింది. అక్రమ నిర్బంధాలకు సంబంధించి ఆమ్నెస్టీ రూపొందించిన నివేదిక కాశ్మీర్‌లో విడుదలకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆన్‌లైన్‌ ద్వారా ఈ నివేదికను విడుదల చేయాల్సి వచ్చింది.

ఇందులో పేర్కొన్న విషయాలు ఇలా ఉన్నాయి…
అనుమానం వస్తే…అరెస్టే..
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటం కోసం…అనే కారణాన్ని చూపి పోలీసులు పెద్ద సంఖ్యలో స్థానిక రాజకీయ నాయకుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. చట్టంలోని నిబంధనల ప్రకారం..పోలీసులకు అనుమానం వస్తే చాలు, ఆధారాలు చూపాల్సిన పని లేదు. 2007-2016 మధ్యకాలంలో ఈ చట్టం కింద 2400మందిని అరెస్టు చేసినట్టు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఇందులో సగానికిపైగా కేసుల్ని కోర్టులు కొట్టేయటంతో ఆయా వ్యక్తులకు స్వేచ్ఛ లభించింది. ఒక్క 2016 ఏడాదిలో 525మందిని గృహనిర్బంధం చేశారు.
కేవలం కొన్ని కారణాల్ని చూపి అరెస్టు చేసే అవకాశం ఈ చట్టం కల్పించటం వివాదాస్పదమైంది. తద్వారా మానవ హక్కుల ఉల్లంఘన పెద్ద ఎత్తున జరుగుతోందని హక్కుల కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. వారిని అరెస్టు చేశాక, పోలీసు అధికారులు ఆధారాలు చూపించాల్సిన పనిలేకపోవటం చట్టాన్ని ఇష్టమున్నట్టు వాడటానికి దారితీసింది.
ఇంటి తలుపులు దాటి (డోర్‌ డిటెన్షన్‌) బయటకు రాకుండా 71 కేసుల్లో వందలాది మందికి నిర్బంధం విధించారు. ఒకవేళ వారు ఇంటి తలుపులు దాటి బయటకు వస్తే, కఠినమైన నిర్బంధాన్ని విధిస్తున్నారు. కొత్త కేసులు నమోదుచేస్తున్నారు. వారు విడుదల కాకుండా అడ్డుకుంటున్నారు. కోర్టుల్లో బెయిల్‌ తెచ్చుకోగలిగిన నాయకుల్ని కూడా చట్టంతో అదుపులోకి తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా మానవ హక్కులకు ప్రాధాన్యత ఇవ్వకుండా రాష్ట్ర పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇదంతా కూడా కేంద్రం ఆదేశాల ప్రకారమే జరుగుతోంది.

Courtesy Navatelangana …