– తహసీల్దార్‌ కార్యాలయంలో..
– మరో ఘటనలో పెట్రోల్‌ పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం

-తిమ్మాపూర్‌/దంతాలపల్లి
అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యోదంతం మరువక ముందే పాసుపుస్తకం ఇవ్వడం లేదని కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో మరో రైతు రెవెన్యూ కార్యాలయంలో పెట్రోల్‌ చల్లాడు. సిబ్బంది అప్రమత్తతో ప్రమాదం తప్పింది. మహబూబాబాద్‌ జిల్లాలో ఓ రైతు కుటుంబం తమ భూ సమస్య పరిష్కరిం చాలంటూ తహసీల్‌ ఎదుట ఆత్మహత్యా యత్నం చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు.. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలంలోని లంబాడిపల్లి గ్రామ రైతు కనకయ్య తన భూమి పట్టా కోసం మంగళవారం తహసీ ల్దార్‌ కార్యాలయానికి వచ్చాడు. సీనియర్‌ అసి స్టెంట్‌ రాంచందర్‌, కొత్తగా వచ్చిన వీఆర్వోను పట్టా గూర్చి అడిగాడు. గతంలో ఉన్న వీఆర్వో బదిలీపై వెళ్లారనీ, విషయం తనకు తెలియదనీ వీర్వో చెప్పా డు. దాంతో రైతు ఏడాదిన్నరగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా పని చేయడం లేదనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ బాటిల్‌ తీసి ఆఫీసులోని టేబుళ్లు, కంప్యూటర్‌, ప్రింటర్‌లపై చల్లాడు. ఈ క్రమంలో కొంత అధికారులపైనా పడింది. భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకున్నారు. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి అక్కడికి చేరుకుని రైతు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు. అయితే, అన్నదమ్ముల భూవివాదం కారణంగానే పట్టా చేయలేదని సిబ్బంది వెల్లడించారు. ఘటనా స్థలాన్ని ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ పరిశీలించి సమాచారాన్ని జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ లాల్‌కు తెలిపారు. ఆయన జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ దృష్టికి తీసుకెళ్లారు. పెట్రోల్‌ చల్లిన రైతుపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, క్రిమినల్‌ కేసు నమోదయ్యేలా చూడాలని కలెక్టర్‌ సూచించారు.

లంచం ఇచ్చినా పనికాలే: రైతు కనకయ్య
‘నాకు, నా తమ్మునికి కలిపి 4 ఎకరాలా 26గుంటల స్థలం ఉంది. నా పేరుమీద 19గుంటలు మాత్రమే పట్టా అయిం ది. మిగిలిన భూమి పట్టా కోసం గతంలో ఉన్న వీఆర్వో హన్మంతుకు రూ.9వేల లంచం ఇచ్చిన. మిగతా ఖర్చులకు రూ.6 వేలు ముట్టుజెప్పిన. ఇప్పుడు ఆ వీఆర్వో బదిలీ అయిండని చల్లగా చెబుతున్నరు. అందుకే పెట్రోల్‌ చల్లిన. మహబూబాబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండల కుమ్మరికుంట గ్రామ శివారులో 2012లో 21/ఏ సర్వే నెంబర్‌లో ఎనిమిదెకరాల భూమిని అదే గ్రామ తండా వెంకటయ్య నుంచి అయినాల ఉప్పలయ్య కొనుగోలు చేశాడు. కానీ పట్టా కాలేదు. 8ఏండ్లుగా కాస్తులో ఉన్నామనీ పట్టా చేయాలని పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టింకోవడం లేదనీ, ఈ క్రమంలో తమ తండ్రి గుండెపోటుతో మృతి చెందాడనీ రైతులు శంకర్‌, మోహన్‌రావు తెలిపారు. తమకు న్యాయం జరగడం లేదనే ఆవేదనతో కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక తహసీల్‌ ఎదుట రైతు కుటుంబం పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వారిని సిబ్బంది, అక్కడున్నవారు అడ్డుకున్నారు. దీనిపై తహసీల్దార్‌ గౌరిశంకర్‌ మాట్లాడుతూ భూ సమస్య కోర్టు కేసులో ఉందనీ, పరిష్కారానికి కృషి చేస్తామనీ తెలిపారు.

Courtesy Navatelangana….