‘పీఎం కిసాన్‌’లో 8.48 లక్షల మంది పేర్లలో తేడా

ఆధార్‌ వివరాలతో పోల్చి చూసిన కేంద్రం
అన్నదాతలకు ఆగిన సొమ్ము రూ.508 కోట్లు
వివరాలు సరిచేసి పంపాలని రాష్ట్రానికి ఆదేశం

 

హైదరాబాద్‌: రైతుల పేర్ల నమోదు ఒక్కో శాఖలో ఒక్కో తీరుగా ఉండటం వల్ల ప్రభుత్వ పథకాలు వారికి అందడం లేదు. పేర్ల నమోదు తప్పుల తడకలా ఉన్నందున వారికి అన్యాయం జరుగుతున్నట్లు ‘ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’(పీఎం కిసాన్‌) పథకం అమలులో బయటపడింది. రాష్ట్రంలో మొత్తం 35.07 లక్షల మంది రైతుల పేర్లను ఈ పథకం కింద ఆన్‌లైన్‌లో వ్యవసాయశాఖ నమోదు చేసింది. కానీ వీరి పేర్లను కేంద్ర వ్యవసాయశాఖ వారి ఆధార్‌ కార్డుల్లో ఉండే పేర్లతో పోల్చి చూసి 8.48 లక్షల మందిని తిరస్కరించింది. వీరికి పీఎం కిసాన్‌ పథకం కింద రావాల్సిన రూ.508 కోట్ల సాయం ఆగిపోయింది. ప్రతి 4 నెలలకోసారి వారి బ్యాంకు ఖాతాలో కేంద్ర వ్యవసాయశాఖ నేరుగా రూ.2 వేల చొప్పున జమ చేస్తోంది. గత డిసెంబరు నుంచి ఇప్పటివరకూ 3 విడతలుగా రైతుల ఖాతాల్లో రూ.6 వేలు జమ చేసింది. వారి పేర్లను ఆధార్‌తో పోల్చి చూసి తప్పులు బయటపడ్డాయి. దీంతో వీరి ఖాతాలకు జమ నిలిపివేసింది. మొత్తం 35.07 లక్షల మందికి మూడో విడతలో ఇప్పటివరకూ 24.92 లక్షల మంది వివరాలే సరిగ్గా ఉన్నాయంటూ వారి ఖాతాల్లో మాత్రమే రూ.2 వేల చొప్పున జమ చేసింది. మిగిలిన 10.15 లక్షల మందికి ఇంకా రాలేదు. వీరి పేర్లను ఒక్కోటిగా సరిచూడగా 8.48 లక్షల మంది పేర్లు తప్పుగా ఉన్నాయని కంప్యూటరీకరణలో వెల్లడైంది. వీరి వివరాలన్నీ సరిచేసి ఈ నెలాఖరులోగా పంపాలని రాష్ట్ర వ్యవసాయశాఖను ఆదేశించింది.

పాసు పుస్తకాల్లోనూ తప్పులే
రైతుల వివరాలను పట్టాదారు పాసు పుస్తకాల డేటా నుంచి తీసుకున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. వాటిని యథాతథంగా ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్‌ పథకానికి నమోదు చేశారు. ఈక్రమంలో ఆంగ్ల అక్షరాల్లో తప్పులు వస్తున్నట్లు గుర్తించామని ఓ వ్యవసాయాధికారి ‘ఈనాడు’క చెప్పారు. ఆధార్‌లో ఉన్నవాటిని యధాతథంగా మళ్లీ నమోదు చేస్తున్నట్లు చెప్పారు.

Courtesy eenadu…