ఎన్నికల అస్త్రాలుగా మోడీ హామీలు
ఒక్క సమావేశం కూడా జరపని నిటి ఆయోగ్‌
ఆర్టీఐ సమాధానంలో వెల్లడి
‘2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం. అన్నదాత బాగున్నప్పుడే దేశం బాగుంటుంది‘ 2016లో యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ప్రకటన ఇది. రెండేండ్లు దాటిపోయాయి. మళ్లీ మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చింది. కానీ ఇంతవరకూ కనీస మద్దతు ధరకు దిక్కులేదు. రైతు ఆదాయం రెట్టింపు చేయటం గురించి బీజేపీ ప్రభుత్వం అసలు దృష్టేపెట్టలేదని సమాచారహక్కు చట్టం(ఆర్టీఐ)లో వెలుగులోకి వచ్చింది.
న్యూఢిల్లీ : ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే.. అతివృష్టి అనావృష్టి దెబ్బకు అన్నదాత విలవిలలాడిపోతు న్నాడు. ఎలాగోలా పంట చేతికందితే… కనీస మద్దతుధర దక్కటంలేదు. చివరికి దళారుల చేతుల్లో రైతులు నిట్టనిలువున మునిగిపోతున్నారు. ఈ విషయం ప్రభుత్వా లకు తెలియనిది కాదు. గత పాలకులు జనాన్ని మోసపూరిత హామీలతో ఎన్నికల్లో గద్దెనెక్కితే.. మోడీ సర్కార్‌ వచ్చాక రైతులనూ వదిలిపెట్టలేదు. తొలిసారి నల్లధనం తెచ్చి ప్రతి
ఒక్కరి ఖాతాలో లక్షలు వేస్తామని అధికారంలోకి వచ్చాక… ఇంతవరకూ చిల్లిగవ్వా పడలేదు. ఓట్ల కోసం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ ప్రధాని మోడీ యూపీలో హామీ ఇచ్చారు. కానీ ఆ లక్ష్య సాధన దిశగా కేంద్ర సర్కార్‌ అడుగులు వేసిన దాఖలాలు మాత్రం ఎక్కడా కనిపించటంలేదు. ఈ పథకాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలన్న దానిపై మోడీ ప్రభుత్వానికి వ్యవస్థాపక మద్దతును అందించేందుకు నిటి ఆయోగ్‌ అప్పటి నుంచి ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేదు. ఇప్పటివరకూ నిటి ఆయోగ్‌ చేసింది ఒక్కటే… ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం : హేతుబద్ధమైన వ్యూహం, అవకాశాలు, కార్యాచరణ ప్రణాళిక’ అన్నదానిపై ఒక పాలసీ పేపర్‌ను తీసుకువచ్చింది. దీనిని 2017 మార్చిలో నిటి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌ చంద్‌ రూపొందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రులు, గవర్నర్ల సమక్షంలో 2017 ఏప్రిల్‌లో జరిగిన నిటి ఆయోగ్‌ పాలక మండలి మూడో సమావేశంలో ఈ పత్రాన్ని ఆవిష్కరించారు. ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే అంశంపై 2015 నుంచి నిటి ఆయోగ్‌ ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు’ అని ఓ జాతీయ వార్తా సంస్థ దాఖలుచేసిన ఆర్టీఐ దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో తేలింది. ‘ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ముఖ్యమంత్రులతోనూ ఎలాంటి సమావేశాలూ నిర్వహించలేదు’ అని పేర్కొంది. ఏ రాష్ట్రమైనా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిందా? అన్న ప్రశ్నకు సమాధానంగా… ‘ఆ దిశగా నిటి ఆయోగ్‌ ఇప్పటివరకు ఎటువంటి అంచనా వేయలేదు’ అని పేర్కొంది. అంచనావేయటానికి కూడా ఎలాంటి అధ్యయనం నిర్వహించలేదని కూడా ఆర్టీఐ సమాధానంలో తేలింది. కాగా, నిటి ఆయోగ్‌ రూపొందించిన టాస్క్‌ ఫోర్స్‌ నేతృత్వంలో జాతీయ వర్షాధార ప్రాంత అథారిటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి అశోక్‌ దల్వారు అధ్యక్షతన ఈ అంశంపై మూడు సమావేశాలను 2018 జనవరి, మార్చి, ఏప్రిల్‌లో జరిగాయి. అయితే, టాస్క్‌ఫోర్స్‌లో నిటి ఆయోగ్‌ ప్రతినిధి లేరు. కాబట్టి అది నిర్వహించిన సమావేశాలను నిటిఆయోగ్‌ సమావేశాలుగా చెప్పలేమని నిపుణులు తేల్చారు.

Tags-india, Modi, government, Farmers, income, double, no, action, Niti ayog, not, met, RTI ,query, reveals

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని 2016 ఫిబ్రవరిలో మోడీ సర్కార్‌ ప్రకటించింది. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటానికి ఒక వ్యూహాన్ని సిఫారసు చేయాలని కోరుతూ దల్వారు ఆధ్వర్యంలో ఇంటర్‌ మినిస్టీరియల్‌ కమిటీని అదే సంవత్సరం ఏప్రిల్‌లో రూపొందించింది. 2018 సెప్టెంబరులో కమిటీ నివేదికను సమర్పించింది. 2015-16లో రైతుల సగటు వార్షిక ఆదాయం రూ.96,703గా నివేదిక పేర్కొంది. దాని ఆధారంగా 2022-23లో రైతుల ఆదాయ లక్ష్యం రూ. 1,72,694గా ఉండాలని నివేదిక తెలిపింది. కానీ, పత్రాలు రూపొందించారు… నివేదికలు వచ్చాయి. కానీ, ఆ దిశగా చర్యలు మాత్రం శూన్యం.
సంక్షోభఊబిలో రైతన్న
వ్యవసాయం మాత్రం రోజురోజుకూ సంక్షోభ ఊబిలో చిక్కుకుపోతూనే ఉన్నది. రైతుల ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి. కనీస మద్దతు ధరతో పాటు, రుణమాఫీ, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు, ఇతర ప్రోత్సాహకాలు ఇచ్చి తమని ఆదుకోవాలని రైతులు దేశ రాజధానిని ముట్టడించినా… స్పందనలేదు సరికదా.. వారిని లాఠీలతో కొట్టించిన ఘటనలు సైతం జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని చెప్పినట్టుగా అసలు 2022 నాటికి రైతులు ఆదాయం రెట్టింపు కావడం సాధ్యమేనా?.. అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే మిగులుతున్నది.

Courtesy Nava telangana…