– గత బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించిన సర్కార్‌
– ఇప్పటి వరకూ ఒక్క పైసా విదల్చని వైనం
– బుక్‌ అడ్జెస్ట్‌మెంట్లకే పరిమితమవుతున్న బ్యాంకులు

హైదరాబాద్‌ : రైతు రుణమాఫీ.. టీఆర్‌ఎస్‌కు తొలిసారి (2014లో) అధికారాన్ని కట్టబెట్టటంలో క్రియాశీలక పాత్ర పోషించిన అంశం. ఈ పథకం ఆధారంగా రైతు కుటుంబాల ఓట్లను సంపాదించుకున్న అధికార పార్టీ.. రెండోసారి గద్దెనెక్కిన తర్వాత మాత్రం ఆ అంశాన్ని పూర్తిగా విస్మరిం చింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆ తర్వాత గతేడాది సెప్టెం బరులో పూర్తిస్థాయి పద్దును తీసుకొచ్చారు. ఆ సందర్భంగా రైతు రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లను కేటాయించారు. కానీ అందులోంచి ఒక్కపైసా కూడా ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. దీంతో ఈ పథకంపై నీలినీడలు కమ్ముకు న్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించిన బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో… అసలు ఈసారి పద్దులో రుణమాఫీకి నిధులు కేటాయిస్తారా..? లేదా..? అనే సందేహాలు తలెత్తుతు న్నాయి. టీఆర్‌ఎస్‌ తొలిసారి అధికారంలోకి వచ్చిన 2014లో రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ.17 వేల కోట్లను కేటాయించింది. ఏడాదికి రూ.4,250 కోట్ల చొప్పున నాలుగేండ్లలో వీటిని చెల్లిస్తామని ప్రకటిం చింది. లక్ష లోపు రుణాలున్న రైతులకు ఈ పథకం వర్తించే విధంగా విధివిధానాలను రూపొందించారు. ఆ ప్రకారంగా 2018 నాటికి దాదాపు రూ.15 వేల కోట్ల దాకా రైతుల ఖాతాల్లో జమ చేశారు. కొంతమంది నకిలీ పాస్‌బుక్కులు కలిగున్నారనే కారణాలతో వారికి సొమ్ము చెల్లించలేదు. ఆ తర్వాత 2018లో నిర్వహించిన ముందస్తు ఎన్నికల సమయంలోనూ టీఆర్‌ఎస్‌.. రుణమాఫీ చేస్తామంటూ ప్రకటించింది. ఆ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ రూ.2 లక్షల వరకూ ఉన్న రుణాలను మాఫీ చేస్తామంటూ వాగ్దానమిచ్చింది. అయినా ప్రజలు టీఆర్‌ఎస్‌పైన్నే విశ్వాసాన్ని ప్రకటించి గెలిపించారు. కానీ అధికార పార్టీ ఆ వాగ్దానాన్ని ఇప్పటి వరకూ నెరవేర్చలేదు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ… ‘రైతులు తమకు బ్యాంకుల్లో ఉన్న అప్పులను చెల్లించండి.. ఆ తర్వాత వెసులుబాటు చూసుకుని మేం తిరిగి సొమ్మును ఖాతాల్లో జమ చేస్తాం…’ అని ప్రకటించారు. ఇది జరిగి ఏడాది దాటినా సీఎం ప్రకటన అమలుకు నోచుకోలేదు. మరో సందర్భంలో ప్రతిపక్షాలనుద్దేశించి సీఎం మాట్లాడుతూ… ‘గతంలో వరుసగా నాలుగేండ్లపాటు రుణమాఫీ చెల్లించాం. దాంతో రైతుల అప్పులు తీరాయి. అందువల్లే మేం రైతుబంధు తీసుకొచ్చాం…’ అంటూ చెప్పుకొచ్చారు. అంటే రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు కాబట్టే.. రుణమాఫీని తీసేశారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ పథకానికి నిధులు విడుదల చేయటం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు రుణమాఫీ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటంతో రైతులకు బ్యాంకులు కొత్తగా అప్పులివ్వటం లేదు. కేవలం బుక్‌ అడ్జెస్ట్‌మెంట్లు చేయించుకుని వారిని పంపేస్తున్నారు. దీంతో రైతులు షరా మామూలుగా రుణాల కోసం ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని.. తిరిగి వాటిని చెల్లించలేక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో రుణమాఫీ నిధులను విడుదల చేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అది కూడా ఏకకాలంలో మాఫీ చేయాలని, తద్వారా రైతులను అప్పులు, అధిక వడ్డీల నుంచి కాపాడాలని ఆయన కోరారు.

Courtesy Nava telangana