– ఐదేండ్లలో 13 శాతం పెరిగిన అప్పులు
– డిజిటల్‌ లావాదేవీల రూపేణా ప్రజలపై పెరిగిన భారం
– మాంద్యంలోనూ కార్పొరేట్ల ఆదాయానికి డోకా లేదు
– కార్పొరేట్‌ అనుకూల పన్నుల విధానంతో ప్రజాధనం ఖాళీ
కొండూరి వీరయ్య

మరో మూడు రోజుల్లో కేంద్రప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదించనుంది. ఇప్పటివరకు వచ్చిన వ్యాఖ్యల్లో అనేక విషయాలు చర్చించుకున్నాం. ముఖ్యంగా ప్రయివేటు కార్పొరేట్‌ కంపెనీలకున్న రుణభారాన్ని తగ్గించటానికి మోడీ సర్కారు అనురిస్తున్న పలు విధానాలు, ఆర్థిక వ్యవస్థపై వాటి పర్యవసానాలు చర్చించుకున్నాం. కార్పొరేట్‌ కంపెనీల రుణభారం తగ్గించటానికి ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యూహంలో వడ్డీరేట్ల తగ్గింపు, పన్ను రాయితీలు, పారుబకాయిలు రద్దు వంటివి ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. ఈ కాలంలో అటు ప్రధాన స్రవంతి మీడియా గానీ ప్రభుత్వం కానీ చర్చకు తేని విషయం దేశంలో సాధారణ కుటుంబాలపై పెరుగుతున్న రుణభారం. సాధారణ కుటుంబాలపై పెరుగుతున్న రుణభారానికి, నిరుద్యోగానికి, ప్రభుత్వ సంక్షేమ వ్యయానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది.

ఉద్యోగాలు, ఉద్యోగాల ద్వారా ఆదాయం లేనప్పుడు కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి అప్పులపై ఆధారపడటమే ప్రధాన సాధనంగా ఉంటుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. కుటుంబ రుణభారం గత ఐదేండ్లలో 13 శాతం పెరిగింది. 2013-14 సంవత్సరం నుంచి 2018-19 మధ్య కాలంలో కుటుంబ స్థాయిలో పెరిగిన రుణభారం వివరాలిలా ఉన్నాయి.

ఈ స్థాయిలో రుణభారం పెరగటానికి ప్రధాన కారణం వినిమయ రుణాలు. వినిమయ రుణాల్లో ఈ రకమైన పెరుగుదల ఉన్నప్పటికీ దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై లేకపోవటం గమనించాల్సిన విషయం. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో వినిమయ రుణాలు పెరుగుతున్నంత కాలం ఆర్థిక వ్యవస్థ పురోగతి కొనసాగుతూ వచ్చింది. 2008లో ప్రపంచం చూసిన ‘సబ్‌ ప్రైమ్‌ సంక్షోభం’ ప్రధానంగా వినిమయ రుణాల చెల్లింపు సంక్షోభమే. అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగం, మొత్తం ఉత్పత్తి రంగంలో వస్తున్న వ్యవస్థాగత, సంస్థాగత మార్పుల కారణంగా ఉపాధి దెబ్బతినడం, దాని ప్రభావం వ్యక్తిగత ఆదాయాలపై పడటంతో ఈ సబ్‌ ప్రైమ్‌ సంక్షోభం దాపురించింది. కానీ మన దేశంలో వినిమయ రుణభారం దాదాపు వంద శాతం పెరిగినప్పటికీ తదనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో కదలిక లేకపోవటం గమనించాల్సిన ఓ ముఖ్యమైన అంశంగా ఉంది. రిజర్వు బ్యాంకు విడుదల చేసిన గణాంకాల నివేదిక కూడా ఈ అంశాన్ని నొక్కి చెప్తున్నది. గత ఐదేండ్లలో వినిమయ రుణాలు 89 శాతం పెరిగినా వివిధ పారిశ్రామికోత్పత్తుల వినిమయం 53 శాతం మాత్రమే పెరిగింది.

2013-18 మధ్య కాలంలో పెరుగుతున్న కుటుంబ రుణభారంలో ఏయే రంగాలకు ఎంతెంత ఖర్చు పెడుతున్నారు అన్న విషయాన్ని విశ్లేషించిన ఆర్బీఐ ఈ క్రింది విధంగా అంచనాకు వచ్చింది. వినిమయ వస్తువులపై పెట్టే ఖర్చుకు గాను తీసుకున్న రుణాలు 0.23 శాతం నుంచి 0.04 శాతానికి పడిపోయాయి. గృహ నిర్మాణం అవసరాల కోసం తీసుకునే రుణాలు తొమ్మిది శాతం నుంచి 13 శాతానికి పెరిగాయి. పిల్లల ఉన్నత చదువుల కోసం తీసుకుంటున్న రుణాలు 1.06 శాతం నుంచి 0.83 శాతానికి తగ్గాయి. క్రెడిట్‌ కార్డులపై తీసుకుంటున్న రుణాలు 0.45 శాతం నుంచి 1.05 శాతానికి పెరిగాయి. అంటే దాదాపు వంద శాతం పెరిగాయి.

ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయాన్ని మనం గమనించాలి. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు 2016లో నోట్లరద్దును ప్రకటించింది. అప్పటి వరకు రొక్కం ఆధారంగా జరిగే లావాదేవీలు ఆ తర్వాతి కాలంలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ఆధారంగా జరుగుతున్నాయి. ఈ కాలంలోనే క్రెడిట్‌ కార్డుల ద్వారా వ్యక్తులు పెట్టే సగటు ఖర్చు పెరగటాన్ని గమనించవచ్చు. 2016-17లో క్రెడిట్‌ కార్డు రుణాలు రూ. 531 కోట్ల మేర ఉంటే నోట్లరద్దుతో డిజిటల్‌ లావాదేవీలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చాక ఈ రుణభారం రూ. 853 కోట్లకు పెరిగింది. ఈ మేరకు ఆయా కుటుంబాలపై వడ్డీ భారం పెరుగుతున్నది.

కుటుంబస్థాయిలో పెరుగుతున్న రుణభారానికి మరో కోణం తగ్గిపోతున్న పొదుపు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్యాంకుల్లో నిల్వవేయబడే సొమ్ములో మూడురకాలైన పొదుపులు కీలకం. ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల ద్వారా జరిగేపొదుపు, ప్రయివేటు కంపెనీల లాభాలు నిల్వ వేయటం ద్వారా జరిగేపొదుపు. సాధారణ ప్రజలు కుటుంబ ఆదాయాల్లో కొంత మొత్తం భవిష్యత్తు అవసరాల కోసం చేసుకునే పొదుపు. గత ఐదేండ్ల కాలంలో ఈ ప్రభుత్వరంగం ద్వారా జరిగే పొదుపు శాతం 0.2 శాతానికి పడిపోతే ప్రయివేటు కంపెనీలు తమ లాభాల రూపంలో దాచుకునే పొదుపు 2.10 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో సాధారణ ప్రజలు దాచుకునే సొమ్ము 6 శాతం పడిపోయింది. దీన్ని బట్టి స్థూలంగా మనకు అర్థమయ్యేది ఒకటి. ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా నడుస్తున్నా దాని ప్రభావం సాధారణ ప్రజలపైనా, ప్రభుత్వ వనరులపైనా ఉందే తప్ప ప్రయివేటు కంపెనీల ఆదాయంపై లేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం ప్రయివేటు కంపెనీల ఆదాయం పడిపోకుండా ఉండేందుకు వీలుగా అనుసరిస్తున్న పన్నుల విధానమే. ఇప్పటికే వివిధ రూపాల్లో ప్రభుత్వం ఇచ్చిన రాయితీల కారణంగా ఖజానాకు దాదాపు రూ. 22 లక్షల కోట్ల మేర నష్టం వస్తే ఈ మొత్తం నేరుగా ప్రయివేటు కంపెనీలకు లాభాల రూపంలో వ్యక్తమవుతున్నది. ఇదే కాలంలో ప్రపంచ కుబేరుల సంఖ్యలో భారతదేశం వాటా వేగంగా పెరగటాన్ని కూడా మనం గమనించవచ్చు. అంటే అటు ప్రజా ధనాన్ని, ఇటు ప్రభుత్వ ధనాన్ని ఫణంగా పెట్టి పాలకులు ప్రయివేటు కంపెనీలకు లాభాలు గ్యారంటీ చేస్తున్నారు.

2013-14 రూ. 3.59 లక్షల కోట్లు
2014-15 రూ. 3.77 లక్షల కోట్లు
2015-16 రూ. 3.91 లక్షల కోట్లు
2016-17 రూ. 3.75 లక్షల కోట్లు
2017-18 రూ. 6.74 లక్షల కోట్లు
2018-19 రూ. 7.60 లక్షల కోట్లు

Courtesy Nava Telangana