– దొంగనోట్లలో 56శాతం రూ.2,000 : ఎన్సీఆర్బీ
– పెద్ద నోట్ల రద్దు ప్రయోగం అట్టర్‌ ఫ్లాప్‌ : విశ్లేషకులు

‘దేశ చరిత్రలో.. ప్రతీ వ్యక్తీ ఈ క్షణాల్లో భాగస్వామ్యం కావాలి. దేశ ప్రగతిని తన వంతు కృషిచేయాలి. ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా వస్తాయి. అవినీతి, నల్లధనం, నకిలీ నోట్లకు వ్యతిరేకంగా ప్రతి పౌరుడు ఈ మహాయజ్ఞంలో (గొప్ప త్యాగం) భాగస్వామ్యం కావాలి. అందుకే ఈ నోట్ల రద్దుకు మద్దతు పలకండి. ఉగ్రవాదులు ఈ డబ్బును ఎలా పొందుతారన్న దానిపై మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సరిహద్దు వెంబడి ఉన్న శత్రువులు తమ కార్యకలాపాలకు నకిలీ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నారు. ఇది సంవత్సరాలుగా కొనసాగుతోంది. దీన్ని అరికట్టాలంటే.. నోట్ల రద్దు తప్పనిసరి..’
– ప్రధాని మోడీ (2016 నవంబర్‌ 8న)

న్యూఢిల్లీ : పెద్ద నోట్లు రూ.1,000, రూ.500 నోట్లను రద్దుచేస్తూ మూడేండ్ల కిందట చారిత్రాత్మక ప్రకటన చేస్తూ… ప్రధాని మోడీ సుదీర్ఘ ప్రసంగంచేశారు. రూ.1000, రూ.500 నోట్లను రద్దుచేస్తూ.. వీటికి బదులుగా రూ.2,000 నోట్లను మోడీ సర్కార్‌ ప్రవేశపెట్టింది. ఈ నోట్లలో అదనపు భద్రతా లక్షణాలు ఉన్నాయనీ, నకిలీ నోట్లను ముద్రించటం సాధ్యంకాదనీ, నల్ల ధనాన్ని అరికట్టవచ్చనీ చెప్పారు. కానీ, వాస్తవం ఇందుకు పూర్తి భిన్నంగా మారింది. నకిలీ కరెన్సీ ముద్రించటం అంత కష్టం కాదని ప్రభుత్వ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి.

నకిలీ కరెన్సీలో రూ.2000 నోట్లు 56శాతానికి పైనే
నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఈ నకిలీ కరెన్సీ చిట్టా విప్పింది. ఎన్సీఆర్బీ తాజా నివేదికల ప్రకారం.. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో స్వాధీనం చేసుకున్న మొత్తం కరెన్సీలో (అంటే 2017.. 2018 సంవత్సరాల్లో) రూ.2,000 నోట్లు 56శాతం. 2018లో స్వాధీనం చేసుకున్న మొత్తం నకిలీ కరెన్సీలో 61శాతం నకిలీ రూ.2000 నోట్లు ఉన్నట్టు ఎన్సీఆర్బీ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. 2017లోనూ స్వాధీనం చేసుకున్న మొత్తం నకిలీ నోట్లలో సగానికిపైగా రూ.2,000 నోట్లు ఉన్నట్టు (సుమారు 53శాతం) నివేదిక తెలిపింది. ఈ రిపోర్టు ప్రకారం… 2018లో మొత్తం 54,776 నకిలీ రూ.2,000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.10.96 కోట్లు. కాగా, మొత్తం స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీ నోట్లు 2,57,243. విలువ పరంగా వీటి మొత్తం రూ.17.95 కోట్లుగా అధికారులు లెక్కతేల్చారు.

2000ల నకిలీ నోట్లే ఎందుకు?
పెద్ద నోట్ల రద్దు తర్వాత నకిలీ రూ.2,000 కరెన్సీ నోట్లు బాగా పెరిగాయి. ఎందుకంటే.. తక్కువ విలువవున్న నోట్లతో పోలిస్తే.. పెద్ద నోట్లను నిల్వ చేయటం సులభం. వాస్తవానికి, రూ.2000 నోట్లతో నకిలీ నోట్‌ తయారీదారులకు మరింత సులభంగా మారింది. ఎందుకంటే తక్కువ ఖర్చుతో పెద్ద మొత్తంలో నకిలీ నోట్లను తయారుచేయటం వారికి ఈజీ అయ్యింది.

లక్ష్యాలు తారుమారు…
చెలామణిలో వున్న 86శాతం కరెన్సీని రద్దుచేస్తూ 2016 నవంబర్‌ 8 సాయంత్రం ప్రధాని చేసిన ప్రకటన దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నిర్ణయం వెనుక మూడు నిర్దేశిత లక్ష్యాలను ఆయన ప్రకటించారు. నకిలీ కరెన్సీని అరికట్టటం. నల్లధనాన్ని నిర్మూలించటం, నగదు ఆధారిత అవినీతిని అంతం చేయడం. ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ డిజిటల్‌ లావాదేవీలతోపాటు, ఇతర లక్ష్యాలను కూడా ఆయన దీనికి జోడించారు. కానీ, ఆయన ప్రకటించిన ప్రధానమైన మూడు లక్ష్యాల్లోనూ విఫలమయినట్టు స్పష్టమైంది. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. నకిలీ కరెన్సీ ఆగలేదు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. మొత్తం నగదులో 99శాతం పైగా బ్యాంకింగ్‌ వ్యవస్థకు తిరిగి వచ్చింది. దేశీయ మార్కెట్లో కేవలం 5శాతం మాత్రమే నగదు ఆధారితమైనదని నిపుణులు చెబుతున్నారు. స్థూలంగా చూస్తే… అన్ని లక్ష్యాల్లోనూ ‘పెద్ద నోట్ల రద్దు విఫలమైంది’ అని ఆర్థికరంగ విశ్లేషకులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు.

Courtesy Nava telangana