మహబూబ్‌నగర్‌ క్రైం : వారిద్దరూ ఒకే కాలేజీలో డిగ్రీ చదువుకున్నారు. అప్పట్లో ప్రేమిస్తున్నానంటూ ఆ యువకుడు ఆమెను వేధించేవాడు. చదువైపోయాక ఎవరిదారిన వారు వెళ్లారు. ఆ తర్వాత ఆ యువతికి పెళ్లైంది. అకస్మాతుగా ఓసారి ఆ యువకుడి నుంచి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. చూసిన ముఖమే కదా? అని ఆమె యాక్సెప్ట్‌ చేసింది. అంతే.. ఆ ఫేస్‌బుక్‌ పరిచయమే ఆమెను ఇబ్బందుల్లో నెట్టేసింది. సీన్‌ కట్‌చేస్తే.. ఆమెను తీవ్రంగా వేధించిన ఆ యువకుడు దారుణ హత్యకు గురవ్వగా.. హత్యకేసు తనపైకి వస్తుందేమోననే బెంగతో ఆ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే..

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని న్యూప్రేమ్‌నగర్‌కు చెందిన ఓ వివాహిత(29) శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకుంది. స్కూళ్లో ఉన్న తన ఐదేళ్ల కుమారుడికి మధ్యాహ్న భోజనం అందించాలంటూ మామను పంపి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడింది. ఉరివేసుకోవడానికి ముందు ఆరు పేజీల సూసైడ్‌నోట్‌ రాసిపెట్టింది. ‘‘కార్తిక్‌ నాకు ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్‌ పెడితే ఓకే చేశాను. తర్వాత వాడి నిజస్వరూపం తెలిసింది. నాకు ఎవరెవరితోనో సంబంధాలున్నాయని చెప్పి.. నా సంసారంలో చిచ్చులు పెడతానన్నాడు. ఈ విషయాలన్నీ రవి అన్నకు చెప్పాను. ఇక వేగలేను. ఆత్మహత్య చేసుకుంటున్నా. నా శవానికి పోస్టుమార్టం చేయొద్దు’’ అని అందులో పేర్కొంది.

జరిగింది ఇదీ..
గద్వాలకు చెందిన బాధిత వివాహిత(29) కుటుంబం మహబూబ్‌నగర్‌లో స్థిరపడింది. రెండేళ్ల క్రితం కార్తిక్‌ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌రిక్వెస్ట్‌ పెడితే ఓకే చేసింది. కార్తీక్‌ ద్వారా గద్వాలలో ఉంటున్న అతడి స్నేహితుడు రవితో కూడా ఆమెకు పరిచయం ఏర్పడింది. ఏడాదిన్నరగా కార్తిక్‌ ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ.. డబ్బులు గుంజడం మొదలుపెట్టాడు. దాదాపు లక్ష వరకు ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత విసిగిపోయింది. కార్తీక్‌ను దూరం పెట్టడంతో.. ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేస్తానంటూ బెదిరించేవాడు. చివరకు ఆమె రవికి విషయం చెప్పి కన్నీరుపెట్టుకుంది. దీంతో రవి అతడిని హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో బుధవారం నలుగురు వ్యక్తులతో కలిసి.. గద్వాలకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపల్లి గుట్టల వద్ద కార్తీక్‌ను హతమార్చి.. మట్టిలో పూడ్చిపెట్టాడు. శుక్రవారం రవి, మరో ఇద్దరు వ్యక్తులు గద్వాల పోలీసుల ఎదుట లొంగిపోయారు. విషయం తెలుసుకున్న ఆ వివాహిత.. హత్యకేసులో తననూ ఇరికిస్తారని బెంగపెట్టుకుంది. అంతలోనే పోలీసులు ఆమె తల్లిదండ్రులను విచారించారు. తల్లిదండ్రులు ఆ విషయాన్ని చెప్పడంతో.. ఆమె భయంతో ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మహబూబ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Courtesy Andhrajyothi