• క్వార్టర్‌లో నా పక్క గదిలో ఉండు
  • ఇన్‌చార్జ్‌ సీఐ పోస్టు కూడా ఇప్పిస్తా
  • మహిళా ఎక్సైజ్‌ సీఐకి భూపాలపల్లిసూపరిటెండెంట్‌ వేధింపులు
  • పాటలు పాడి వాట్సాప్‌లో వెకిలిచేష్టలు
  • నైట్‌ డ్యూటీలొద్దని విజ్ఞప్తి చేస్తే
  • ఎవరైనా ఎత్తుకెళతారా? అంటూ హేళన
  • మహిళా వైద్యురాలికిభూపాలపల్లి డీఎంహెచ్‌వో వేధింపులు

భూపాలపల్లి : భూపాలపల్లి ఎక్సైజ్‌ సూపరిటెండెంట్‌ తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ కాటారం ఎక్సైజ్‌ సీఐ ప్రశాంతి ఆరోపించారు. కాటారంలో విధుల్లో చేరినప్పటి నుంచి మూడేళ్లుగా నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌, వరంగల్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌కు ప్రశాంతి ఫిర్యాదు చేశారు. ‘నా క్వార్టర్‌ పక్కనే నీకు క్వార్టర్‌ ఇప్పిస్తా. ఇక్కడే ఉంటూ డ్యూటీ చేయ్‌. అవసరమైతే భూపాలపల్లి ఇన్‌చార్జి సీఐ పోస్టు కూడా నీకే ఇప్పిస్తా’ అంటూ తనపై ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఒత్తిడి తెచ్చారని వాపోయారు. ‘నా భర్తకు కూడా ఉద్యోగం ఉంది.. నాకు పాప ఉంది.

వాళ్లను వదిలి ఇక్కడెలా ఉంటాను సార్‌..’ అని ఆయనకు తాను చెప్పినప్పటికీ.. ‘ఏం అయితది.. పాపతో ఇక్కడే ఉండు..’ అని తనకు ఇబ్బంది కలిగించేలా మాట్లాడారని ఆరోపించారు. రాత్రి వేళల్లో స్వయంగా పాట పాడి దానిని తన వాట్సా్‌పలో పెట్టే వారని, మొదట్లో ఆయన బుద్ధి తెలియక ‘బాగుంది సార్‌’ అని రిప్లయ్‌ ఇచ్చానని, అప్పటి నుంచి పనికి మాలిన పాటలను పోస్టు చేస్తూ వెకిలిచేష్టలకు దిగుతున్నారని ఆరోపించారు. అకారణంగా కానిస్టేబుల్‌ ముందు తిట్టడమే కాకుండా రాత్రివేళలో సరిహద్దు గ్రామాల్లో దాడులకు వెళ్లాలని ఆర్డర్‌ ఇస్తారని సీఐ చెప్పారు. ఇంత రాత్రి అక్కడికి వెళ్లాలా? అంటే.. ‘నిన్ను ఎవడైనా ఎత్తుక పోతాడా?’ అంటూ అసభ్యంగా మాట్లాడుతూ వేఽధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. తనను ఎందుకు వేధిస్తున్నారో అడిగి తెలుసుకునేందుకు బుధవారం జిల్లా కార్యాలయానికి వెళ్తే ‘గెటవుట్‌’ అన్నారని, ‘నీకు తలకాయ లేదా..?’ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారని విమర్శించారు.

సూపరింటెండెంట్‌ మాటలతో మానసికంగా క్షోభ అనుభవిస్తున్నానని, గతంలో ఇక్కడ పని చేసిన మహిళాఉద్యోగులతోనూ ఆయన ఇలాగే వ్యవహరించేవారని తెలిపారు. ఈ విషయమై బుధవారం రాత్రి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే సీల్డు కవర్‌లో ఫిర్యాదు చేయమని చెప్పారన్నారు. దీంతో గురువారం సాయంత్రం భూపాలపల్లి కలెక్టర్‌కు, వరంగల్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు సీఐ ప్రశాంతి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. సూపరింటెండెంట్‌ తీరుపై విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై సూపరింటెండెంట్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నింగా ఆయన సెల్‌ స్విచ్ఛా్‌ఫలో ఉంది.

మహిళా డాక్టర్‌కు డీఎంహెచ్‌వో వేధింపులు!
భూపాలపల్లి డీఎంహెచ్‌వో గోపాల్‌రావు వేధిస్తున్నారంటూ గణపురం మండలం చెల్పూరు పీహెచ్‌సీ వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన గతంలోనూ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆస్పత్రి విజిట్‌ సమయంలోనూ, ఫోన్‌లోనూ తనను వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో డీఎంహెచ్‌వోపై గణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాల్సిందిగా  నోటీసు జారీ చేశామని సీఐ రాజన్‌బాబు తెలిపారు.

Courtesy Andhrajyothi