• చంచల్‌ గూడ జైలులో తువ్వాలుతో కిటికీకి ఉరి..
  • బుధవారం తెల్లవారుజామున బలవన్మరణం
  • 1.10 కోట్ల లంచం కేసులో ఆగస్టు 14న అరెస్టు
  • 2 నెలలుగా రిమాండ్‌ ఖైదీగా మంజీరా బ్యారక్‌లో

హైదరాబాద్‌, సైదాబాద్‌, మంగళ్‌హాట్ : మేడ్చల్‌ జిల్లా కీసర మాజీ తహసీల్దార్‌ ఎర్వ నాగరాజు (47) చంచల్‌గూడ్‌ జైలులో బలవన్మరణానికి పాల్పడ్డారు. బుధవారం తెల్లవారుజామున మంజీరా బ్యారక్‌లో కిటికీకి తువ్వాలుతో ఉరి వేసుకున్నారు. రూ.1.10 కోట్లు నగదు లంచంగా తీసుకుంటూ ఆగస్టు 14న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడిన నాగరాజు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఆయన ఆత్మహత్యాయత్నాన్ని వార్డర్లు గమనించి సహ ఖైదీలను నిద్ర లేపి నాగరాజును కాపాడే ప్రయత్నం చేశారని, కొన ఊపిరితో ఉండగా, ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారని జైలు అధికారులు తెలిపారు. కీసర మండలం రాంపల్లి దాయర గ్రామంలోని ఓ భూ వివాద పరిష్కారానికి నాగరాజు రూ.2 కోట్లు లంచం డిమాండ్‌ చేయడం.. రూ.1.10 కోట్లు నగదు తీసుకుంటూ పట్టుబడటం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మిగతా నిందితులతో కలిపి నాగరాజును తొలిసారి ఆగస్టు 25 నుంచి 27 వరకు ఏసీబీ కస్టడీకి తీసుకుని విచారించింది. భూమికి అక్రమంగా పాసు పుస్తకాల జారీ విషయంలో విచారణ కోసం మంగళవారం మళ్లీ కస్టడీలోకి తీసుకుని.. తిరిగి అప్పగించింది.

విచారణ నుంచి వచ్చాక మౌనంగా ఉంటూ..
ఏసీబీ కస్టడీ నుంచి వచ్చిన తర్వాత నాగరాజు ముభావంగా ఉన్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి భోజనం చేసిన ఆయన బ్యారక్‌లోని మిగతా నలుగురు ఖైదీలు మాట్లాడించినా మౌనంగా ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున 3 గంటల సమయంలోనూ మేల్కొని ఉన్నట్లు జైలు సిబ్బంది చెప్పారు. 4 నుంచి 4.30 గంటల సమయంలో ఆత్మహత్యకు యత్నించారు. నాగరాజు ఎలాంటి సూసైడ్‌ నోట్‌ రాయలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జైలు అధికారులు డబీర్‌పురా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.   కాగా, మృతదేహాన్ని తీసుకునేందుకు ఉస్మానియా మార్చురీ వద్దకు చేరుకున్న బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మృతిపై అనుమానాలున్నాయని ఆరోపించారు. పోలీసులు సముదాయించడంతో శాంతించారు. నాగరాజు శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. గొంతు బిగుసుకోవడంతోనే   మృతి చెందినట్లు పోస్టుమార్టంలో నిర్ధారణ అయింది.

జైల్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
జైలు సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడం వల్లే.. నాగరాజు ఆత్మహత్య ఉదంతం చోటుచేసుకుందని ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆ సమయంలో మంజీరా బ్యారక్‌లో ఒకే ఒక వార్డర్‌ విధుల్లో ఉన్నారు. బ్యారక్‌లను మూడు గంటలకోసారి పరిశీలించాల్సిన నైట్‌ డ్యూటీ ఆఫీసర్‌, జైలర్‌ అలా చేయనట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో మంగళవారం రాత్రి కొందరు ఖైదీలను వేరే బ్యారక్‌లకు తరలించారు. నాగరాజును మంజీరాలోనే ఉంచారు. ఈ ప్రక్రియ అర్థరాత్రి వరకు కొనసాగింది. దీంతో కొందరు ఉన్నతాధికారులు జైలులోనే ఉన్నారు. అక్కడే నిద్రపోయారు.

ఆయనను కేసులో ఇరికించారు..
నాగరాజుకు కుటుంబం అంటే చాలా ప్రేమ. భార్య, ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. మంగళవారం కలిసిన సమయంలో 10 రోజుల్లో బెయిల్‌ వస్తుంది అని చెప్పాడు. చాలా ధైర్యంగా కనిపించాడు. అలాంటివాడు అంతలోనే ఎలా ఆత్మహత్య చేసుకుంటాడు? ఏసీబీ కేసులో వాస్తవం లేదు. కావాలని ఇరికించారు. ఆయన మృతిపై విచారణ జరిపి నిజానిజాలు బయటకు చెప్పాలి.
నాగరాజు బావమరిది శేఖర్

Courtesy Andhrajyothi