•  ఎక్స్‌ అఫీషియోల విషయంలో ఎన్నికల సంఘం ఇష్టారాజ్యం
  • గడువు దాటిన తర్వాత ఓటు హక్కు నమోదు
  • 27వ తేదీన సుభాష్‌ రెడ్డి పేరు కొత్తగా చేర్పు
  • తొలుత తుక్కుగూడలో నమోదు చేసుకున్న ఎమ్మెల్సీ
  • అవసరం రాకపోవడంతో నేరేడుచర్లకు మార్పు
  • ఒకే రోజు రెండు ఉత్తర్వులు ఇచ్చిన అధికారులు
  • కేవీపీ, కేకేలకు ఓటు విషయంలోనూ తప్పటడుగులు
  • నేరేడుచర్ల గులాబీపరం.. ఉత్కంఠ మధ్య ఎన్నిక
  • ఉత్తమ్‌, కేవీపీ అరెస్టు.. మోహరించిన పోలీసులు

నేరేడుచర్ల మునిసిపాలిటీలో ఎక్స్‌ అఫీషియో ఓటర్ల జాబితా-1లో ఐదుగురి పేర్లు ఉన్నాయి కదా! సోమవారం ఇక్కడ కౌన్సిల్‌ ఎన్నిక జరగడానికి ముందు అప్పటి జిల్లా సహాయ ఎన్నికల అధికారి కూడా అయిన నేరేడుచర్ల మునిసిపల్‌ కమిషనర్‌ విడుదల చేశారు!

జాబితా-2లో ఆరు పేర్లు ఉన్నాయి కదా! కొత్తగా ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి పేరు కూడా చేరింది! కౌన్సిల్‌ ఎన్నిక వాయిదా పడిన తర్వాత సోమవారం రాత్రి విడుదల చేసిన జాబితా ఇది. నేరేడుచర్ల మునిసిపల్‌ కమిషనర్‌పై సస్పెన్షన్‌ వేటు పడిన కారణంగా.. జాబితాలో జిల్లా సహాయ ఎన్నికల అధికారి సంతకం కూడా మారింది.

హైదరాబాద్‌ : ఎన్నికల సంఘం అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరుకు నిలువెత్తు నిదర్శనమిది! ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడానికి ఈనెల 25వ తేదీని కటా్‌ఫగా నిర్ణయించారు. కానీ, గడువు దాటిన తర్వాత రెండు రోజులకు ఈనెల 27వ తేదీన కూడా ఎక్స్‌ అఫీషియోగా చేర్చుకున్నారు. ఒక్క ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి విషయంలో మాత్రమే కాదు.. రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, కె.కేశవరావులకు ఎక్స్‌ అఫీషియో ఓటు హక్కు కల్పించే విషయంలోనూ ఇష్టారాజ్యంగానే వ్యవహరించారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కె.కేశవరావును ఏపీ కోటాలో చేర్చారు. కేవీపీ రామచంద్రరావును తెలంగాణ కోటాలో పెట్టారు. కానీ, ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ఇద్దరినీ తెలంగాణ పరిధిలోనే గుర్తించి, ఓటు హక్కు కల్పించారు. దాంతో, ఈ విషయంలో అధికారులు కనీస మార్గదర్శకాలను కూడా పాటించలేదని రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. కేవీపీ రామచంద్రరావుకు ఓటు హక్కును నిరాకరించడానికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్‌పై బదిలీ వేటు పడినా.. మునిసిపల్‌ సస్పెన్షన్‌కు గురైనా అధికారులు మళ్లీ అవే తప్పులు చేయడం గమనార్హం. తాజా పరిణామాల నేపథ్యంలో నేరేడుచర్ల, తుక్కుగూడ మునిసిపల్‌ పాలకవర్గాల ఎన్నికలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

తుక్కుగూడలో సుభాష్‌ రెడ్డి నమోదు
మునిసిపల్‌ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తొలుత తుక్కుగూడ మునిసిపాలిటీలో ఎక్స్‌ అఫీషియోగా నమోదు చేసుకున్నారు. ఎక్స్‌ అఫీషియోగా నమోదు చేసుకోవడానికి ఈ నెల 25 గడువు కాగా.. ఆలోపులోనే అక్కడ ఆయన ఎన్‌రోల్‌ చేసుకున్నారు. సోమవారం ఇక్కడ కౌన్సిల్‌ ఎన్నిక జరిగింది. ఎంపీ కె.కేశవరావు కూడా ఇక్కడే తన ఓటును నమోదు చేసుకున్నారు. నిజానికి, ఏపీ కోటాకు చెందిన కేకేను ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటారో లేదోననే అనుమానంతో ఎమ్మెల్సీ సుభాష్‌ రెడ్డిని కూడా ఎన్‌రోల్‌ చేయిచారని తెలుస్తోంది. అయితే, కేకే ఓటును పరిగణనలోకి తీసుకోవడంతో మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్నికకు అవసరమైన మెజారిటీ టీఆర్‌ఎ్‌సకు వచ్చింది. దాంతో, సుభాష్‌ రెడ్డి పేరును పరిగణనలోకి తీసుకోలేదు.
నేరేడుచర్లకు మారిన సీను
నేరేడుచర్ల మునిసిపాలిటీలో కౌన్సిల్‌ ఎన్నిక మలుపుల మీద మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం తొలుత టీఆర్‌ఎస్‌ సభ్యులు, తర్వాత కాంగ్రెస్‌ సభ్యులు ఓటింగ్‌కు వచ్చారు. కాంగ్రెస్‌ సభ్యులతోపాటు వచ్చిన కేవీపీ రామచందర్‌ రావును ఈసీ అధికారులు తొలుత అనుమతించలేదు. ఎన్నికల కమిషన్‌ నుంచి సమాచారం రావడంతో అనుమతించారు. దాంతో, కాంగ్రెస్‌, టీఆర్‌ఎ్‌సలకు చెరి 10 ఓట్లు ఉండటంతో టాస్‌ తప్పనిసరి అయింది. అప్పటి వరకు కేవీపీ ఓటు లేదనుకుని వచ్చిన టీఆర్‌ఎ్‌సకు ఈ నిర్ణయం ఇబ్బందిగా మారింది. దాంతో, ఆంధ్రా వ్యక్తికి ఇక్కడ ఓటు ఎలా ఇస్తారంటూ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఎన్నికల అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్లు చించి, మైకు విసిరేశారు. ఎన్నిక వాయిదా వేయాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎన్నికను వాయిదా వేశారు. దాంతో, అంతకు ముందు తుక్కుగూడలో ఎన్‌రోల్‌ చేసిన సుభాష్‌ రెడ్డి పేరును సోమవారం సాయంత్రం నేరేడుచర్ల ఎక్స్‌ అఫీషియోగా పరిగణనలోకి తీసుకున్నారు.

నిజానికి, ఈనెల 27 తేదీ ఉదయం అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి హోదాలో మునిసిపల్‌ కమిషనర్‌ ఒక జాబితాను ప్రకటించారు. అందులో ఎక్స్‌ అఫీషియో సభ్యుల జాబితాలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌, కేవీపీ రామచంద్రరావు, లోక్‌సభ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బోడకంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే సైదిరెడ్డి ఉన్నారు. అంటే, ఇక్కడ సభ్యత్వం కోసం అప్పటికే ఎన్‌రోల్‌ చేసుకున్న వారికి ఈ అవకాశం ఇచ్చినట్టు భావించాలి. కానీ, కేవీపీ ఓటు వివాదం కారణంగా మొదటి జాబితా విడుదల చేసిన అధికారి సస్పెండ్‌ అయ్యారు. కొత్తగా వచ్చిన అధికారి రెండో జాబితాను ప్రకటించారు. ఇందులో సుభాష్‌ రెడ్డి పేరును చేర్చి, సభ్యుల సంఖ్యను ఆరుకి పెంచారు. పైగా.. మునిసిపల్‌ సమావేశం జరిగి.. అది అర్ధాంతరంగా వాయిదా పడ్డ తర్వాత ఈ రెండో జాబితాను ప్రకటించడం విశేషం.

తప్పుల మీద తప్పులు
ఎక్స్‌ అఫీషియోగా నమోదు చేసుకోవడానికి ఈ నెల 25వ తేదీన కటా్‌ఫగా ప్రకటించారు. ఆలోపు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఓటు హక్కు కల్పిస్తారు. ఆ తర్వాత ఎన్‌రోల్‌ చేసుకోరు. కానీ, తొలుత తుక్కుగూడలో నమోదు చేసుకున్న సుభాష్‌రెడ్డిని గడువు తర్వాత రెండు రోజులకు నేరేడుచర్లలో ఎన్‌రోల్‌కు అవకాశం ఇచ్చారు. ఒకవేళ ఆయన తొలుత నేరేడుచర్లలోనే నమోదు చేసుకుని ఉంటే.. ఆ విషయాన్ని మొదటి జాబితాలోనే పేర్కొని ఉండేవారు. కానీ, అందులో ఆయన పేరు లేదు. రెండో జాబితాలో సుభాష్‌రెడ్డి పేరు వచ్చి చేరింది. కానీ, అప్పటికే గడువు ముగియడంతో ఆయన పేరును నమోదు చేయడానికి నిబంధనలు అంగీకరించవు. కానీ, ఆయన పేరును పరిగణనలోకి తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Courtesy Andhrajyothi