నామినేట్ చేసిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ (రిటైర్డ్‌) రంజన్‌ గొగోయ్‌కు కేంద్రం రాజ్యసభ సీటు కేటాయించింది. నామినేటెడ్‌ కోటాలో ఆయనను ఎగువసభకు నామినేట్‌ చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇన్నాళ్లూ నామినేటెడ్‌ కోటాలో ఉన్న  సీనియర్‌ న్యాయవాది కేటీఎస్‌ తులసి వచ్చేనెల 9న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానే గొగోయ్‌ను నియమించినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిరుడు నవంబరులో సీజేగా పదవీ విరమణ చేసిన జస్టిస్‌ గొగోయ్‌- నామినేటెడ్‌ కోటాలో రాజ్యసభలో అడుగుపెట్టబోతున్న తొలి మాజీ సీజే.

అంతకు ముందు – సీజేగా పనిచేసిన జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా కూడా రాజ్యసభ సభ్యుడైనప్పటికీ ఆయన కాంగ్రెస్‌ టిక్కెట్‌ మీద ఎన్నికైనవారు. అయోధ్యలో వివాదాస్పద స్థలం రాముడిదే (హిందువులదే) అని చరిత్రాత్మక తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్‌ గొగోయ్‌ నేతృత్వం వహించారు. దీంతో పాటు రాఫెల్‌ యుద్ధవిమానాల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇచ్చిన బెంచ్‌కూ ఆయనదే నేతృత్వం.  సుప్రీంకోర్టు చేయని వ్యాఖ్యలను బెంచ్‌కు ఆపాదించిన కేసులో విపక్ష నేత రాహుల్‌ గాంధీని మందలించిన కేసు, ఆర్టీఐ కింద సీజే కార్యాలయమూ వస్తుందని ఇచ్చిన తీర్పు… మొదలైన ఎన్నో కీలక తీర్పులను ఆయన వెలువరించారు.

Courtesy Andhrajyothi