మహిళా సహాయ కేంద్రానికి రెండేళ్లలో 5.81 లక్షల ఫోన్లు

ఇందులో 16.22% అత్యాచారాలు, లైంగిక వేధింపులవే
బాధితుల్లో చిన్నారులే ఎక్కువ
మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక కేసులు

అడుగడుగునా మృగాలే

ఊరూ వాడా మానవ మృగాలు పొంచి ఉన్నాయి. అదును దొరికితే బాలికలు, మహిళల్ని కబళించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మహిళల భద్రతకు షీ టీంలు, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినా, నిందితులకు కఠిన శిక్షలు విధించేందుకు చట్ట సవరణలు జరిగినా నిత్యం లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. అభంశుభం ఎరుగని చిన్నారులు మృగాలకు తొలి లక్ష్యం అవుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో మహిళా హెల్ప్‌లైన్‌ నంబరు 181కు వస్తున్న ఫోన్లలో 16.22 శాతం లైంగిక దాడులు, వేధింపులు, అత్యాచారాలకు సంబంధించినవే ఉంటున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు సమాజంలో మహిళలకు ఎదురవుతున్న అభద్రత వాతావరణాన్ని సూచిస్తోంది.

అడుగడుగునా మృగాలే

పదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు, తక్షణ సహాయం చేసేందుకు ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 24 గంటలూ పనిచేసే మహిళా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 2017 అక్టోబరులో ప్రారంభమైన ఈ కేంద్రానికి ఇప్పటివరకు 5.81 లక్షల కాల్స్‌ వచ్చాయి. రోజుకి సగటున 800 కాల్స్‌ వస్తున్నాయి. అత్యధికంగా గృహహింస ఫిర్యాదులు అందుతుండగా.. ఆపదలో ఉన్న మహిళలు రోజుకి 15-17 మంది ఫోన్‌ చేస్తున్నారు. అత్యాచారాలకు సంబంధించి రెండేళ్లలో 562 ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి సమాచారం తీసుకుని సంబంధిత విభాగాల్ని ఈ కేంద్రం తక్షణం అప్రమత్తం చేస్తోంది. ఆపదలోని మహిళలు, చిన్నారులిచ్చే సమాచారం మేరకు వైద్య సహాయం, భద్రత కల్పిస్తోంది. తీవ్రతను బట్టి కేసులు నమోదు చేయించి, పర్యవేక్షిస్తోంది. అవసరమైన న్యాయ సహాయం, రక్షణ అందిస్తోంది. పునరావాసం కోరుకుంటున్న వారిని సఖి కేంద్రాలకు పంపిస్తోంది.

అడుగడుగునా మృగాలే

ఈ జిల్లాల్లో అత్యధికం
మహిళలపై అత్యాచారాల కేసుల్లో మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
చిన్నారులపై అత్యాచారాల కేసులు నిజామాబాద్‌లో ఎక్కువగా నమోదయ్యాయి.
చిన్నారులు, మహిళలపై లైంగిక వేధింపుల కేసులు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో అత్యధికంగా జరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Courtesy Eenadu…