బూల్‌గర్హి, హథ్రాస్‌: దారుణంగా సామూహిక మానభంగానికి గురై చనిపోయిన హథ్రాస్‌ బాధితురాలి గ్రామమైన బూల్‌గర్హిలో కులవివక్ష నిత్యకృత్యంగా ఉంది. దాదాపు వందకు పైగా ఇళ్లు ఉన్న ఆ గ్రామంలో దళితులవి నాలుగు ఇళ్లు మాత్రమే ఉన్నాయి. అదే బ్రహ్మణులవి 15, ఠాకూర్లకు చెందివని వందకు పైగా ఇళ్లు ఉన్నాయి. ఈ నాలుగు ఇళ్ల దళిత కుటుంబాలు నిరంతరం కుల వివక్ష, అణిచివేతకు గురౌతూనే ఉన్నాయి. ఊరికి చివర ఉన్న ఆ దళితుల ఇళ్ల వద్దకు వర్షాకాల సమయంలో బురద అంతా వచ్చి చేరుతుంది. దీంతో మురుగు కాల్వల్లోకి దిగి ఆ బురదనంతా వారే శుబ్రం చేయాలి. ”గ్రామంలో అసమానత్వం చాలా ఎక్కువగా ఉంది. అగ్ర కులాల ఇళ్ల ముందు మురుగు కాల్వల్లోకి దిగి మేమే శుభ్రం చేయాలి. అంతకు కూలీ కూడా చాలా తక్కువే ఇస్తారు. మేం చేయమని అంటే ఇక అంతే సంగతులు. మమ్మల్ని కొట్టి మరీ ఆ పని చేయిస్తారు” అని బాధితురాలి బంధువు ఒకరు చెప్పారు. బాధితురాలి చావుకు కారణమైన నలుగురిపై పోలీసులు కేసు పెట్టారు. ఆ నలుగురు కూడా ఠాకూర్ల కులానికి చెందినవారే. అందులో సందీప్‌ అనే వ్యక్తి బాధితురాలిని ఎప్పటి నుండో వేధిస్తున్నాడు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె ఇళ్లు వదలి వెళ్లిపోవాలని భావించింది. ఆ బాధితురాలి ఇంట్లో మొత్తం ఆరుగురు సభ్యులున్నారు. తల్లితండ్రి, ఇద్దరు అక్కచెల్లెళ్లు, ఇద్దరు అన్నదమ్ములు. బాధితురాలి అన్న మాట్లాడుతూ గ్రామంలో కులవివక్ష అధికంగానే ఉన్నప్పటికీ, ఇప్పుడీ సంఘటన దళితులు, ఠాకూర్ల మధ్య మరింత ఘర్షణను పెంచుతుందని, దళితులు పరిస్థితి మరింత ఘోరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

”నువ్వు ముట్టుకుంటే మా ఆహారం మైల పడింది”
బాధితురాలి ఇంటి పక్కనే బన్వారీ, అతని భార్య అంజుదేవి ఉంటున్నారు. వారికి నలుగరు కొడుకులు, ఒక కూతురు ఉంది. అందరూ యుక్తవయస్సులో ఉన్నారు.ఇప్పుడు వారు తమ కూతురు గురించి ఆందోళన చెందుతున్నారు. ఆ గ్రామంలో కుల వివక్ష ఎలా ఉందో తమ కొడుకు విషయంలో జరిగిన సంఘటనే ఉదాహరణ అన్నారు. వాళ్లు చిన్న కొడుకు బజార్‌లో ఆడుకుంటూ ఉండగా ఠాకూర్లుకు చెందిన ఒక వ్యక్తి ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో బెల్లం తీసుకొని వెళ్తున్నాడు. ఆడుకుంటూ ఉన్న ఆ కుర్రాడి చెయ్యి పొరపాటున ఆ ప్లాస్టిక్‌ కవర్‌కు తగిలింది. అంతే ఆ ఠాకూర్‌ కులాని చెందిన వ్యక్తి తమ ఆహారాన్ని ముట్టుకొని మైల చేశాడంటూ పెద్దగా అరుస్తూ ఆ కుర్రాడిని కొట్టడం ప్రారంభించాడు. మరో పదో 20 మంది ఠాకూర్‌ కుర్రాళ్లు కట్టెలు తీసుకొని వచ్చి ఆ కుర్రాన్ని కొట్టసాగారు. ఇంతలో ఆ కుర్రాడి తండ్రి వాళ్ల కాళ్లావేళ్లా పడి బెల్లం ఖరీదుకు రెండింతలు అదనంగా డబ్బులు ఇస్తానని చెపితే గానీ ఆ కుర్రాణ్ని కొట్టటడం ఆపలేదు. ఈ గ్రామంలో ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యంగా సాగుతూనే ఉంటాయని బన్వారీ అన్నారు. తమ పరిస్థితిని ఎవ్వరూ మార్చలేని స్థితి అని దళితులు నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఇంతలో బన్వారీ భార్య అంజూదేవి మాట్లాడుతూ అగ్రకులాల ఇంట్లో ఎవైనా ఫంక్షన్లకు తమను భోజనాలకు పిలుస్తారని, తమకు ప్రత్యేకంగా భోజనం వడ్డిస్తారని, ఆ ప్రాంతం మురికిమురికిగా ఉంటుందని, వడించే భోజనం చాలా ఎత్తు నుండి తమ విస్తర్లలోకి పడేస్తారని, ఒక్కొసారి ఆ భోజనం విస్తర్లలో కాకుండా నేల మీద పడుతుందని, అయినప్పటికీ ఆ మట్టిలోని భోజనాన్ని తీసుకొని తినమని అంటారని తెలిపారు. గ్రామంలో ఆర్ధికంగానూ బలహీనంగా, తక్కువ సంఖ్యలో ఉన్నందున దళితులు అగ్రవర్ణాలతో పోరాడే స్థితిలో లేరని, ఒక వేళ పోరాడితే తామే కష్టాలపాలవుతామని అంజుదేవి పేర్కొన్నారు. కుల వివక్ష, అణిచివేత సంఘటనలు చాలా ఉన్నాయని, తమ పిల్లల భద్రత దృష్ట్యా వాటిన్నింటినీ బయటపెట్టలేమని చెప్పారు.

దళితుడి వేలును కోసేసినప్పుడు…
బాధితురాలి ఇంటికి దగ్గరల్లోనే ఉండే మరో దళితుడు సంతోష్‌కుమార్‌ పదేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఠాకూర్లకు వ్యతిరేకంగా గొంగెత్తి ప్రశ్నించినందుకు తమ బంధువు వేలిని కొడవలితో నరికివేశారని చెప్పారు. తమ బంధువు పొలంలోకి ఠాకూర్లుకు చెందిన గేదేలు వచ్చి పడ్డాయి. వాటిని బయటికి తొలుకు వెళ్లమని అతను గట్టిగా అడిగాడు. దీంతో ఆ ఠాకూర్లు అతని వేలిని కోసేశారు. సంతోష్‌కుమార్‌ మరో సంఘటనను కూడా చెప్పారు. ఊర్లో అందరికీ చెందిన ఒక అరుగుపై దళిత కుర్రాడు కూర్చున్నాడని అతన్ని చాలగొట్టారు. తాము కూర్చునేచోట దళితుడు కూర్చొరాదనేది వారి భావన. ఇలా చాలా సందర్భాల్లో ఆ ఊరిలోని దళితులపై దాడులు, అణిచివేతలు సాగాయి. పంటి బిగువున భరిస్తుండడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని వారు వాపోతున్నారు. బాధితురాలి కుటుంబసభ్యులు మరింత భయపడిపోయారు. ఈకేసు మీడియాలో ప్రాధాన్యత పెరగడం, రాజకీయనాయకులు కూడా జోక్యం చేసుకోవడంతో తమ కుటుంబానికి మరింత ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.