– రాజధానిలో పనుల అంచనా రూ.52,837 కోట్లు
– గ్రౌండ్‌ అయినవి రూ.41,678 కోట్ల విలువైనవి
– చెల్లింపులు రూ.5,674 కోట్లు
– వివరాలు లేకుండా రూ.95.9 కోట్లు చెల్లింపు
– అమరావతి బ్యూరో
రాష్ట్ర రాజధాని పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించి అంచనాలకు, చెల్లింపులకు ఏ మాత్రమూ పొంతన లేదు. నిధులు లేకపోయినా పెద్దఎత్తున పనులు చేపట్టారు. గుత్తేదార్లకు రూ.5674 కోట్లు చెల్లించారు. నిపుణుల కమిటీ కూడా రాజధానిలో పనులకు అదనపు అంచనాలు రూపొందించారని, కేంద్ర ప్రజాపనులశాఖ నిబంధనలను ఏ మాత్రమూ పరిగణనలోకి తీసుకోలేదని నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అవసరానికి మించి టవర్ల నిర్మాణం చేపట్టారని, రియల్‌ ఎస్టేట్‌ కోసమే ఇదంతా చేశారని వెల్లడించింది. రాజధానిలో మొదటిదశ పనులు, సామాజిక సదుపాయాల కల్పనకు రూ.1.09 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న జారీ చేసిన జిఒఎంఎస్‌ నెంబరు 50 ద్వారా తొలిదశ పనులకు రూ.51,685 కోట్లు ఖర్చవుతాయని నివేదించారు. అందులో టైర్‌-1 సదుపాయాలు (నగరస్థాయి రోడ్లు, గ్రామాల్లో సదుపాయాలకు, విద్యుత్‌ టవర్ల మార్పునకు) రూ.19,769 కోట్లు అవసరం ఉంటుందని తేల్చారు.

టైర్‌-2 (ఎల్‌పిఎస్‌ లేఅవుట్ల అభివృద్ధి, కనెక్టివిటీ)కి రూ.17,910 కోట్లు, అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు రూ.14,008 కోట్లు ఖర్చవుతాయని తేల్చారు. రూ.62,623 కోట్లతో డిపిఆర్‌ రూపొందించి నీతి ఆయోగ్‌కూ పంపారు. రూ.1500 కోట్లు కేంద్రం ఇవ్వగా దానికి సంబంధించి రూ.1632 కోట్లకు యుసిలు కేంద్రానికి సమర్పించారు. ఇక్కడ వాడిన దానికన్నా అదనంగా యుసి ఇచ్చారు. ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పనులకు సంబంధించి వివరాలు లేని చెల్లింపులు రూ.95.9 కోట్లు చెల్లించారు. ఇది ఎవరికి, ఎప్పుడు ఎలా చెల్లించారనే వివరాలను మాత్రం పొందుపరచలేదు.

Courtesy Prajasakti..