• చర్చలు జరపాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేం
  • సమ్మె చట్టవ్యతిరేకమని ప్రకటించలేం
  • మాకు ఆ అధికారాలు లేవు… దానికి వేరే ఫోరం ఉంది
  • చర్చలతో పరిష్కారానికి ఎవరూ ముందుకు రాలేదు
  • వ్యాజ్యాలను మెరిట్‌ ప్రకారం విచారించి ఆదేశాలిస్తాం
  • హైకోర్టు స్పష్టీకరణ… విచారణ నేటికి వాయిదా

ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఎస్మా కిందకు చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) ఇచ్చిందా? మీరు ప్రస్తావించిన జీవోలో ఎక్కడా ఆర్టీసీ సేవలను అత్యవసర సేవల కింద చేర్చలేదు. ఆర్టీసీ అందిస్తున్న సేవలు ప్రజా వినియోగ సేవలు

హైదరాబాదు, నవంబరు 11 : ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం (ఎస్మా) పరిధిలోకి రాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్మా కిందకు తేవాలంటే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ సమ్మె చట్ట వ్యతిరేకమని ఆదేశించలేమని, అలాంటి అధికారాలు ఈ కోర్టు పరిధిలో లేవని ధర్మాసనం పేర్కొంది. ఈ సమ్మె పారిశ్రామిక వివాదాల చట్టం పరిధిలోకి వస్తుందని తేల్చిచెప్పింది. ‘‘ఈ చట్టం ప్రకారం కన్సీలియేషన్‌ ప్రక్రియ (కార్మిక శాఖ వద్ద చర్చలు) జరగాలి. చర్చలు విఫలమైనపుడు కన్సీలియేషన్‌ అధికారి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. దానిని ప్రభుత్వం ఇండస్ట్రియల్‌ ట్రిబ్యునల్‌కు పంపాలి. దానిపై ట్రిబ్యునల్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని వివరించింది. తమ ముందున్న వ్యాజ్యాల్లో దేనిలోనూ ఇలాంటి అభ్యర్థన లేదని తెలిపింది. ‘‘ట్రిబ్యునల్‌కు రిఫర్‌ చేయకుండా ప్రభుత్వం మౌనంగా ఉండవచ్చు. అలాంటప్పుడు సమస్య పరిష్కారానికి ట్రిబ్యునల్‌కు పంపమని కోరుతూ ఆర్టీసీ యాజమాన్యం వ్యాజ్యం వేసుకోవచ్చు. అయితే అటువంటి వ్యాజ్యం ఏదీ ఆర్టీసీ యాజమాన్యం వేయలేదు’’అని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం ఆర్టీసీకి సమ్మెకు సంబంధించిన వ్యాజ్యాలపై విచారణ కొనసాగించింది.

ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ వినలేదు: సమ్మెను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పలుమార్లు సూచించామని, తగినంత సమయం ఇచ్చామని ధర్మాసనం గుర్తుచేసింది. అయినా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం, ట్రేడ్‌ యూనియన్లు ఎవరూ ముందుకు రాలేదని పేర్కొంది. నెల రోజులకు పైగా గడిచిపోయినా ఎటువంటి పరిష్కారానికి రాలేకపోయారని వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యాలను మెరిట్‌ ప్రకారం విచారణ చేయడం ఒకటే తమ ముందున్న మార్గమని స్పష్టం చేసింది. ‘‘భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తి కోర్టును ఆశ్రయిస్తే ముందుగా ఆ జంట కలిసి ఉండడానికి చర్చలు జరపాలని సూచిస్తాం. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కలిసి ఉండాలని చెబుతాం. అందుకు తగిన సమయం ఇస్తాం. అయినా వారు కలిసి ఉండలేమనే నిర్ణయానికి వస్తే వారి వ్యాజ్యాల్లో మెరిట్‌ ఆధారంగా విచారణ చేసి తగిన ఆదేశాలు ఇస్తాం. ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం’’ అని తెలిపింది. కోర్టు విజ్ఞప్తిని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం, ట్రేడ్‌ యూనియన్లు అంగీకరించడం లేదని, అందుకే ఈ నిర్ణయానికి వచ్చామని స్పష్టం చేసింది.

అదనపు అఫిడవిట్లు వద్దని చెప్పాం! : ప్రధాన వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్‌ వేశారని, దీనిపై రిప్లయ్‌ కౌంటర్‌ వేయడానికి గడువు ఇవ్వాలని ట్రేడ్‌ యూనియన్ల తరఫు సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి కోరారు. దీనిపై ఇంకెవ్వరూ అదనపు అఫిడవిట్లు వేయాల్సిన అవసరం లేదని క్రితం విచారణ సందర్భంగా చెప్పామని ధర్మాసనం గుర్తుచేసింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యంలో కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను పొడిగించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కోరారు. దీంతో శుక్రవారం ఇచ్చిన ఆదేశాలను తదుపరి విచారణ వరకు పొడిగించింది. ఆర్టీసీ సమ్మె వల్ల దసరా సెలవులు పొడిగించడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన మూడు వ్యాజ్యాలను నిరర్థకంగా భావించి మూసివేస్తున్నట్లు వివరించింది. మిగిలిన వ్యాజ్యాలపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. సమ్మె విరమించాలని ఆర్టీసీ జేఏసీ, గుర్తింపు పొందిన ట్రేడ్‌ యూనియన్‌ను ఆదేశించాలని కోరుతూ ఉస్మానియా వర్సిటీ విద్యార్థి సుబేందర్‌సింగ్‌, మరికొందరు వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అదే వాదన ఎంతసేపు? : ఆర్టికల్‌ 226 కింద న్యాయస్థానానికి విశేష అధికారాలు ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. తమ వాదనలకు బలం చేకూర్చే విధంగా కోర్టు తీర్పులను ఉటంకించారు. ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలబడాలని కోరారు. ఈ వాదనలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకే అంశాన్ని తిప్పి తిప్పి చెప్పడాన్ని తప్పుపట్టింది.

Courtesy Andhrajyothi…