• ఈఎస్‌ఐలో ఏడాదిగా మెడిసిన్స్‌ నిల్‌
  • ఇటీవలి కాలంలో 31 మంది మృతి
  • రక్తపోటు, మధుమేహం మాత్రలూ లేవు
  • స్కాం బయటపడ్డాక నిలిచిన సరఫరా
  • కొనుక్కుని బిల్లులు పెట్టుకోండని సలహా
  • ఏడాదైనా రీయింబర్స్‌మెంట్‌ నో 
  • పిట్టల్లా రాలిపోతున్న కిడ్నీ, కేన్సర్‌ రోగులు
  • పట్టించుకోని శాఖ ఉన్నతాధికారులు

హైదరాబాద్‌ : ఈఎ్‌సఐలో మందుల కుంభకోణం కారణంగా మందుల కొనుగోళ్లు నిలిపివేశారు. ఏడాది కాలంగా కొనుగోళ్లు లేకపోవడంతో సాధారణ మందులూ నిండుకున్నాయి. దీంతో ఈఎ్‌సఐ మందుల మీదే ఆధారపడ్డ బడుగులకు ప్రాణ సంకటంగా మారింది. రాష్ట్రంలో ఈఎ్‌సఐ కింద 17 లక్షల మంది కార్డుదారులు ఉండగా.. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 68 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వారందరికీ ఈఎ్‌సఐ ఆస్పత్రి మందులే ఆధారం. అలాంటి వారికి ఏడాదిగా మందులు అందడం లేదు. సకాలంలో మందులందకపోవడంతో చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికి 31 మంది వరకు మృత్యువాత పడినట్లు సమాచారం. వీరిలో కేన్సర్‌ రోగులు, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు, డయాలసిస్‌ రోగులు ఎక్కువగా ఉన్నారు. తెలంగాణలో 70 వరకు ఈఎ్‌సఐ డిస్పెన్సరీలుండగా.. అందులో 36 గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ డిస్పెన్సరీలకు వెళ్లే బాధితుల్లో 900 మంది వరకు డయాలసిస్‌ రోగులే ఉన్నారు. బీపీ, షుగర్‌, కేన్సర్‌, గుండె సంబంధిత జబ్బులున్న వారు వేలల్లో ఉన్నారు. నిజానికి ఒక కేన్సర్‌ రోగికి నెలకు 60 మాత్రలు ఇవ్వాలి. సీకేడీ (తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి) రోగులకు నెలకు 5 రకాల మందులతో కలిపి మొత్తం 150 మాత్రలు, 21 ఇంజెక్షన్లు ఇవ్వాలి. వీటిలో ఒక్కటి కూడా ఇప్పుడు లభించడం లేదు. దాంతో సీకేడీ రోగులు ఎక్కువగా చనిపోతున్నారు. ఈఎ్‌సఐ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల ఏడాది కాలంగా డిస్పెన్సరీల్లో మందులు అందడం లేదని, కరోనా వచ్చాక ఇబ్బందులు రెట్టింపు అయ్యాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థిక భారం..
ఈఎ్‌సఐ స్కామ్‌ బయట పడటం, ఈఎ్‌సఐ నుంచి బకాయిలు రాకపోవడంతో ఫార్మా కంపెనీలు మందుల సరఫరాను నిలిపివేశాయి. దీంతో ఏడాది నుంచి డిస్పెన్సరీల్లో మందులు లేకపోవడంతో రోగుల్ని బయటే కొనుక్కోమని ఈఎ్‌సఐ సిబ్బంది చెబుతున్నారు. మందులు కొని, వాటి బిల్లులు పెట్టుకోమని సలహా ఇస్తున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటి కొనుక్కొని వేసుకొని, బిల్లులు పెడితే.. ఏడాదైనా రీయింబర్స్‌మెంట్‌ కావడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలిక జబ్బులున్న వారు ఆ ఔషధాల కోసం నెలకు వారి ఆరోగ్య స్థితిని బట్టి రూ.5-25 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అంత మొత్తం ఖర్చు పెట్టడం అందరికీ సాధ్యం కాదు. వాటిని బయట కొనుక్కొని వేసుకొనే ఆర్థిక స్థోమత లేనివారు జబ్బుల్ని ముదరపెట్టుకొని, ప్రాణాలు కోల్పోతున్నారు.

మందుల సరఫరా 50 శాతమే
పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోవడంతో ఈఎ్‌సఐకి మందుల సరఫరాను కంపెనీలు నిలిపివేశాయి. ప్రస్తుతం 50ు మందులే సరఫరా అవడంతో రోగులకు అరకొరగానే ఇస్తున్నాం. మందుల కొనుగోలుకు ప్రభుత్వం ఇటీవల రూ.55 కోట్లు విడుదల చేసింది. వాటితో మెడిసిన్స్‌ కొంటాం. ఒకట్రెండు నెలల్లో అన్ని మందులు అందుబాటులోకి వస్తాయి.
-డాక్టర్‌ సత్యనారాయణ, ఈఎ్‌సఐ జాయింట్‌ డైరెక్టర్

అప్పుల పాలవుతున్నాం
మందులు కొనుగోలు చేసే శక్తి లేక చాలా మంది అప్పుల పాలవుతున్నారు. డిస్పెన్సరీలకు వెళితే మందులు లేవంటున్నారు. అక్కడికి వెళ్లాలన్నా బస్సులు లేవు. ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లే స్తోమత అందరికీ ఉండదు. పైగా కరోనా వైరస్‌ ఉండటంతో దీర్ఘకాలిక జబ్బులున్న వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎక్కడ వైరస్‌ అంటుకుంటుందోనన్న భయంతో బతుకుతున్నాం.
– మనోరమ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తురాలు

మంత్రి హామీ ఇచ్చినా మార్పు లేదు
దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి మందుల కొరత రానివ్వబోమని గత ఏడాది ‘వరల్డ్‌ కిడ్నీ డే’ రోజున కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాకు హామీ ఇచ్చారు. ఇంతవరకు పరిస్థితి మెరుగు పడలేదు. సీకేడీ, దీర్ఘకాలిక వ్యాఽధిగ్రస్తులు నాలుగైదు సార్లు మొరపెట్టుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.
– మమత, సీకేడీ ఫోరమ్‌ వ్యవస్థాపకురాలు

Courtesy Andhrajyothi