– ఏడేండ్లుగా సగం ఖాళీలే…
-నాలుగేండ్లలో రెండింతలైన ఈఎస్‌ఐ లబ్దిదారులు
– సిబ్బంది అంతంతే..
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తున్నదో తెలుసుకునేందుకు ఈఎస్‌ఐ ఆస్పత్రుల నిర్వహణ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నది. అమాంతం పెరు గుతున్న లబ్దిదారుల నుంచి ప్రతినెలా క్రమం తప్పకుండా వాటా కింద లబ్దిదారులు చెల్లిస్తున్నా…వారికి అందుతున్న సేవల విషయం మాత్రం గాలికొదిలేశారు. పెరిగిన లబ్దిదారుల సంఖ్యకు తగినట్టుగా ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, బెడ్లు, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, రోగ నిర్ధా రణ కేంద్రాలు తదితర వాటిని సమకూర్చడంలో మాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈఎస్‌ఐ లబ్దిదారులు ఆ ఆస్పత్రుల్లో కన్నా బయట ప్రయివేటు ఆస్పత్రులకు రెఫర్‌ చేయించుకుని వెళ్లే పరిస్థితి కల్పిస్తున్నది.తద్వారా సర్కారు ఈఎస్‌ఐ ఆస్పత్రులను బలోపేతం చేయకుండా ప్రయివేటు ఆస్పత్రులకు సహకరిస్తున్నది. ప్రయివేటుకు సిఫారసులకు తగ్గించి ఉన్న నిధులతో ఈఎస్‌ఐ ఆస్పత్రులను బలోపేతం చేయాలని లబ్దిదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హయాంలో చివరి నియామకాలు చేశారు. అప్పటి నుంచి 2019 వరకు ఒక్క పోస్టునూ భర్తీ చేయలేదు. ఇకపోతే అదే లబ్దిదారుల సంఖ్య అమాంతంగా పెరిగి రెండింతలైంది. దీంతో ఉన్న కొద్ది మంది సిబ్బంది పెరిగిన లబ్దిదారులకు సేవలందించలేక చేతులెత్తేస్తున్నారు. బీమా వైద్య సేవల సంచాలకుల కార్యాలయంలో అవినీతి జలగల పుణ్యమా అని, ఎన్నో అక్రమాలు జరుగుతున్నా కార్మిక శాఖ ఆ వ్యవస్థ ప్రక్షాళనపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ఉదాత్త లక్ష్యంతో సామాజిక భద్రత, ఆరోగ్య భద్రత కాస్తా నీరుగారిపోయింది. ఈఎస్‌ఐ లబ్దిదారుల సంఖ్య గత నాలుగేండ్లలో గణనీయంగా పెరిగింది. 2015-16 లో 10,23,398 మంది ఉండగా, 2016-17లో 10,73,000 మంది, 2017-18లో 14,73,000, 2017-18లో 17,45,634 మంది ఉన్నారు. లబ్దిదారులైన కుటుంబ సభ్యులతో కలుపుకుని మొత్తం 69,82,536 మంది ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు అర్హులు. కాగా నెలసరి వేత నం రూ.21,000 ఉన్నవారు (వికలాంగులకు రూ.25,000 వరకు) బీమాకు అర్హత ఉంది. ఈ ఏడాది వీరి సంఖ్య మరింత పెరిగినట్టు సమాచారం. ఆస్పత్రు ల్లో పని చేసేందుకు 2940 పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 1542 మంది పని చేస్తుండగా, మిగిలిన మంజూరైన పోస్టులను భర్తీ చేయకపోవడంతో గత ఏడేండ్లుగా 1398 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 120 మంది డాక్ట ర్లుండగా మరో 150 మంది వరకు డాక్టర్లు, నర్సులు 150 మంది వరకు ఉడగా 200 నుంచి 300 మంది వరకు నర్సులతో పాటు సరిపడినంత మంది పారా మెడికల్‌ సిబ్బందిని నియమిస్తే తప్ప రోగులకు సంతృప్తికర సేవలనం దించలేమని సిబ్బంది అంటున్నారు. ఈ పోస్టులు కూడా గతంలో ఉన్న లబ్దిదా రుల సంఖ్య ఆధారంగా మంజూరు చేసినవే. పెరిగిన లబ్దిదారుల సంఖ్యను కూ డా కలుపుకుంటే మరిన్ని పోస్టులు మంజూరు చేసి భర్తీ చేయాల్సి ఉంటుంది. దాదాపు 70 లక్షల మంది కొరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో 700 బెడ్లు మాత్రమే ఉండడంతో నిత్యం రద్దీని తట్టుకునే పరిస్థితి లేదు. నాచారం ఆస్పత్రిలో 450, రామచంద్రాపురంలో 100, వరంగల్‌ లో 50, సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ లో 62 బెడ్లు ఉన్నాయి. నిజామాబాద్‌ ఈఎస్‌ఐ డయా గస్టిక్‌ సెంటర్లో 20, హైదరాబాద్‌ లోని జీడిమెట్లలో గల డయాగస్టిక్‌ సెంటర్‌ లో 10 బెడ్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. ఇవి కాకుండా కేంద్ర ప్రభు త్వ పరిధిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో బెడ్లను కలుపుకున్నా కూడా మొత్తం 1000 నుంచి 1500 లోపు బెడ్లు మాత్రం ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇఎస్‌ఐసీ కిందికి వచ్చే రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 317 మంది డాక్టర్లు, 150 మం ది నర్సులు, 21 మంది ఫార్మసిస్టులున్నారు. వీరిలో ఎక్కువ మంది సనత్‌నగర్‌ లోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలోనే సేవలేందించే వారు కావడం గమనార్హం.
అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో ఇబ్బంది
రెగ్యులర్‌ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టని రాష్ట్రం ప్రయివేటు ఏజెన్సీలకు కింది స్థాయి సిబ్బంది నియామకానికి థర్డ్‌ పార్టీ ఏజెన్సీకి అప్పగించింది. ప్రతి సారి ఈ ఏజెన్సీ ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. 8 నెల లుగా జీతాలు చెల్లించకపోవడంతో సిబ్బంది రోగుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేయడం ఇబ్బందికరంగా మారింది. ఏజెన్సీ గత 8 నెలల నుంచి జీతాలు చెల్లించకపోయినా ఏజెన్సీని అధికారులు అడిగే పరిస్థితి కనిపించడం లేదు.

Courtesy Navatelangana…