తీవ్ర ప్రమాదపుటంచున తీరప్రాంత నగరాలు
జాబితాలో కోల్‌కతా, ముంబయి, సూరత్‌, చెన్నై
ప్రపంచవ్యాప్తంగా 140కోట్ల మందిపై ప్రభావం : ఐపీసీసీ నివేదిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో రోజురోజుకు చోటుచేసుకుంటున్న పలు పరిణామాలు భూమిపై జీవుల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్రనీటిమట్టాలు రెట్టింపు వేగంతో పెరిగిపోతున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, గ్రీన్‌హౌజ్‌ గ్యాస్‌ ఉద్గారాలు లాంటి పలు కారణాలతో ‘మంచు’ కరిగిపోయి ఇలాంటి పరిస్థితికి దారి తీస్తున్నది. ఫలితంగా దీని ప్రభావం ప్రపంచంలోని పలు సముద్రతీరప్రాంత నగరాలపై పడనున్నది. ఇందులో భారత్‌ నుంచి కోల్‌కతా, ముంబయి, సూరత్‌, చెన్నై వంటి నగరాలు ఉన్నాయి. అలాగే హిమాలయన్‌ గ్లేసియర్లు కరిగిపోవడం కారణంగా ఈ శతాబ్దాంతానికి ఉత్తరభారతం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఉన్నది. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌(ఐపీసీసీ)’ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 7000 వేల పేజీలతో కూడిన ‘ఐపీసీసీ రిపోర్టు’ను మొనాకోలో విడుదల చేశారు.
ఈ నివేదిక ప్రకారం.. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే గతంలో ఎన్నడూ లేనంతగా 2100 శతాబ్దం నాటికి సముద్ర మట్టాలు ఒక మీటరు అధికంగా పెరిగే ప్రమాదం ఉన్నది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ ప్రభావాన్ని ఎదుర్కోనున్నారు. సముద్ర మట్టం కనీసం 50 సెంటీమీటర్ల పెరిగితే ప్రపంచంలోని 45 కోస్టల్‌ పోర్ట్‌ నగరాలలో(నాలుగు భారత నగరాలతో పాటు) వరదలకు దారి తీసే ప్రమాదమున్నది. గ్లోబల్‌వార్మింగ్‌ తగ్గుముఖం పట్టేందుకు తక్షణ చర్యలను తీసుకోవాల్సిందిగా ప్రపంచ దేశాలకు ఐపీసీసీ సూచించింది. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌హౌజ్‌ గ్యాస్‌(జీహెచ్‌జీ) ఉద్గారాలను శీఘ్రంగా తగ్గించి.. గ్లోబల్‌ వార్మింగ్‌ను రెండు డిగ్రీలకంటే తక్కువకు పరిమితం చేసినప్పటికీ ఈ శతాబ్దాంతానికి సముద్రమట్టాలు దాదాపు 30-60శాతం పెరిగే అవకాశం ఉన్నదని నివేదికలో తెలిపింది. అలా పాటించని తరుణంలో సముద్రమట్టాలు దాదాపు 60-110 సెంటీమీటర్లు పెరిగే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నది.
హిందూకుష్‌ ప్రాంతాలలో 24 కోట్ల మందిపై ప్రభావం
20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు దాదాపు 15 సెంటీమీటర్లు పెరిగాయి. అయితే ప్రస్తుతం ఇది రెండు రెట్ల కంటే అధికమైందని (ఏడాదికి 3.6 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుదల) నివేదిక స్పష్టం చేసింది. మంచుపర్వతాలు కరిగిపోతుండటంతో దాని ప్రభావం హిందూకుష్‌ హిమాలయన్‌(హెచ్‌కేహెచ్‌) ప్రాంతాలలో నివసిస్తున్న దాదాపు 24 కోట్ల మందిపై పడనున్నదని ఐపీసీసీ నివేదిక సహ-రచయిత అంజల్‌ ప్రకాశ్‌ తెలిపారు. జీవనదులతో ఏడాదంతా నీటితో ఉండే ఈ ప్రాంతాలలో నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదమున్నది. ‘ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, గ్లోబల్‌వార్మింగ్‌ ప్రభావంతో 2100 శతాబ్దం నాటికి గ్లేసియర్లు కనుమరుగవడం 36శాతం నుంచి 64శాతానికి పెరగనున్నది. హెచ్‌కేహెచ్‌ ప్రాంతాలలో నీటి ప్రవాహం, లభ్యతపై ప్రభావం చూపుతుంది’ అని ప్రకాశ్‌ తెలిపారు.

Courtesy Navatelangana..