రాష్ట్రాలు దివాళా తీయకముందే పాలకులు కళ్ళుతెరవాలి. కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించాలి. ప్యాకేజీని వెనక్కుతీసుకొని ప్రజల చేతికి నగదు అందేలా చూడాలి. ఆదాయపుపన్ను చెల్లించేవారిని మినహాయించి, కరోనా కాలానికి నెలకు ఏడున్నరవేల రూపాయల చొప్పున దేశంలోని మిగతా అన్ని కుటుంబాలకు నేరుగా చెల్లించాలి. వలస కార్మికులందరికీ వ్యక్తికి పదికిలోల ఆహారధాన్యాలను వచ్చే ఆర్నెల్లపాటు పంపిణీ చేయాలి. నగరాలలో మిగిలిన వలస కూలీలను ప్రభుత్వం సొంత ఖర్చుతో స్వగ్రామాలకు చేర్చాలి. ప్రతిపక్షాలు, మేధావులతో చర్చించి సామరస్యపూర్వకమైన వాతావరణం కలిగించండి. అందరం కలిసి కరోనా వ్యతిరేక పోరాటాన్ని సాగిద్దాం.

ఏదైనా తప్పు జరిగితే, పొరపాటు జరిగితే దానిని అంగీకరించే ధైర్యం పాలకులకు ఉండాలి. మన ప్రభుత్వం మార్చి నెల ఆఖరువారంలో ఆలస్యంగా లాక్‌డౌన్‌ పెట్టడంతో దేశం పెద్ద మూల్యం చెల్లించుకుంటున్నది. కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది. పరీక్షలు జరుపుతున్నవారి సంఖ్య తక్కువ. ఇంకా ఎక్కువ పరీక్షలు జరిపితే అనేక రెట్ల కేసులు బయటపడతాయి. ఇప్పుడు విదేశాలనుంచి విమానాల్లో తిరిగివచ్చే భారతీయులు దాదాపు ముప్పైవేలు ఉంటారని అంచనా. స్వస్థలాలకు తిరిగివెడుతున్న వలసకార్మికులు కోట్ల మంది ఉన్నారు. వారిలో కొందరికి కరోనా వచ్చింది. విమానాల్లో వచ్చిన వారికి ఎక్కువ శాతం ఉంది. వారు సహప్రయాణీకులకు, ఉద్యోగులకు, తమ కుటుంబ సభ్యులకు దీనిని వ్యాపించచేసే ప్రమా దం ఉంది. ఇది బాధాకరం అయినా వాస్తవం. ఇంకా ఎన్ని లక్షలమందికి కరోనా సోకుతుందో తెలియదు.

కరోనాతో సహజీవనం చేద్దామని పాలకులు అంటున్నారు. దారి ద్ర్యం, అనారోగ్యంతో సహజీవనం చేసినట్లు కరోనాతో చేయమంటున్నారు. ఈ బాధాకరమైన పరిణామాన్ని అడ్డుకొనే అపూర్వ అవకాశాన్ని తమ అహంకారంతో, సంకుచిత ఆలోచనాధోరణితో పాలకపార్టీ బీజేపీ, దాని నాయకత్వం త్రోసిపుచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఆహ్వానించి, లక్షలమందితో సభ జరిపి, ఆయన మెప్పుపొందాలన్నది అవివేకమైన చర్య. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కూలదోసి తమ ముఖ్యమంత్రిని గద్దెనెక్కించేందుకు, అంతా సజావుగా ఉన్నదన్న వాతావరణం కోసం పార్లమెంటు సమావేశాలను పొడిగించడం మరో సంకుచిత చర్య. వీటివల్లే లాక్‌డౌన్‌ ఆలస్యమైంది.

భారత రాజకీయాల్లో శకుని పాత్ర నిర్వహిస్తున్న, ప్రస్తుతం మౌనవ్రతంలో ఉన్న ఒక అగ్రనాయకుడి ఆలోచనే ఈ పరిస్థితికి దారితీసిందని కొందరి అనుమానం. కరోనా ప్రమాదతీవ్రతను చైనా 2019 డిసెంబరు 31న ప్రపంచ ఆరోగ్యసంస్థకు తెలియచేస్తే, వ్యాధి వ్యాపించకుండా సత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సంస్థ అన్ని దేశాలనూ జనవరి 30న హెచ్చరించింది. ఈ హెచ్చరికను తక్షణమే పట్టించుకొన్న వియత్నాం, ఉత్తర కొరియా, కొంచెం ఆలస్యంగానైనా దక్షిణకొరియా సరిహద్దులు మూసివేసి, విమాన ప్రయాణాలు రద్దుచేశాయి. దేశంలో ఒక్క మరణం లేకుండా వియత్నాం తనను తాను కాపాడుకుంది. పొరుగుదేశం శ్రీలంక మొదటి హెచ్చరికకే మేల్కొని కేసుల సంఖ్యను పరిమితం చేసుకుంది. అమెరికా ఖండంలో క్యూబా సమర్థవంతంగా కరోనాను అదుపులోపెట్టి, ఎవరూ పట్టించుకోని అనేక చిన్న దేశాలకు వైద్య బృందాలను పంపి సాయపడింది.

అమెరికా అధ్యక్షుడి ఆలింగనంలో తన్మయుడై ఉన్న నరేంద్ర మోదీకి ఆలస్యంగా జ్ఞానోదయం కలిగి హఠాత్తుగా మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. వాస్తవానికి ఫిబ్రవరి 11వ తేదీనే కరోనా ప్రమాదం గురించి ప్రతిపక్షాలు హెచ్చరించాయి. కానీ, తమ తెలివితేటలు అమోఘమనుకొనే పాలకులు స్పందించ లేదు. ఫిబ్రవరిలోనే స్పందించి, ముందుస్తు వారం రోజుల హెచ్చరికతో వలస కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు తమ తమ నెలవులకు వెళ్ళేందుకు అవకాశం కలిగించి, విదేశీ విమాన ప్రయాణాలను నిషేధించి, అప్పుడు లాక్‌డౌన్‌ పెట్టివుంటే వియత్నాం లాగా భారతదేశం కూడా కరోనా కర్కశ హస్తాల నుండి బయటపడేది. అది జరగనందున దేశం అతలాకుతలమైంది. వందేభారత్‌ పేరుతో వేలాదిమందిని విదేశాల నుండి అసాధారణంగా పెంచిన చార్జీలతో తీసుకువచ్చారు. వందేభారత్‌ వలస కార్మికులకు పనికిరాలేదు. లక్షలాదిమంది వేలకిలోమీటర్లు కాలినడకనపోతున్నారు. పనిలేక, వేతనం లేక, తిండిలేక ఈ శ్రమజీవులు స్వగ్రామాలకు బయలుదేరారు.

లాక్‌డౌన్‌ తరువాత కేంద్రప్రభుత్వ నిర్వాకం మరింత అధ్వాన్నంగా ఉంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరికలు చేసినా స్వయం రక్షణపరికరాలు, మాస్కులు, శానిటైజర్లు సమకూర్చుకోలేదు. దేశంలో ఒక్కశాతానికి కరోనా సోకినా ఆ సంఖ్య కోటీ ముప్పై లక్షలు. అందరికీ రాకూడదనే కోరుకుందాం కానీ, నలభైవేల వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. వైద్యసిబ్బందికి శిక్షణ, రక్షణ లేదు. అన్నింటినీ అజమాయిషీ చేయాల్సిన కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్‌ తన వైఫల్యాలకు బహుమతిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌ అయ్యారు. ట్రంప్‌ సూచనల మేరకు ఆరోగ్యసంస్థను చైనాకు వ్యతిరేకంగా మలచడంలో హర్షవర్థన్‌ తన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించగలరు. కొవిడ్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు సొంత నిధులతో, సిబ్బందితో చక్కగా పనిచేశాయి. కేరళ రాష్ట్రం ఆదర్శనీయమైన పాత్ర వహించి, పొరుగుదేశం శ్రీలంకతో సైతం ప్రత్యేక ప్రశంసలను అందుకుంది.

దేశం లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ బీజేపీ ప్రభుత్వాలు కార్మికచట్టాలను సస్పెండ్‌ చేసి పన్నెండుగంటల పనిదినాన్ని ప్రవేశపెట్టాయి. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌, పంజాబ్‌, పాండిచ్చేరిలలో కూడా ఈ నియమం వచ్చింది. కార్మికులు సుదీర్ఘపోరాటంతో సాధించుకున్న 8గంటల పనిదినం రద్దుచేయడంలో బీజేపీ కాంగ్రెస్‌లు దొందూదొందేనని రుజువుచేసుకున్నాయి. ఇక, 20 లక్షలకోట్ల ప్యాకేజీ ఓ అంకెల గారడీ. ఆర్థికమంత్రి వివరణ తరువాత ఇది జీడీపీలో పదిశాతం కాదనీ, ఒక శాతం కంటే తక్కువేనని ఆర్థికవేత్తలు విశ్లేషించారు. స్వదేశీ నినాదం; విదేశీ గుత్తపెట్టుబడులకు రక్షణ; అంతరిక్షం, బొగ్గు, ఖనిజాలతో సహా అన్నింటా ఆహ్వానం; విద్యుత్‌ సంస్కరణల పేర ప్రజలమీద భారం; శతకోటీశ్వరులకు, కోటీశ్వరులకు భారీగా రుణాలు; గత సంవత్సరం లక్షా డెబ్బయ్‌ ఐదువేల కోట్లు లాభాలు ఆర్జించిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పెట్టుబడిదారులకు, విదేశీ గుత్తసంస్థలకు అమ్మేయడం… ఇదీ మోదీ వల్లించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ సారాంశం.

కరోనా విలయంలో ప్రపంచంలో అనేక దేశాలలో ఖైదీలను బెయిల్‌పై విడుదల చేస్తుంటే, మన కోర్టులు చెప్పినా ప్రభుత్వాలు వినడం లేదు. అర్బన్‌ నక్సలైట్ల పేరిట మేధావులు, హక్కుల కార్యకర్తలను జైళ్ళలో నిర్బంధించారు. అంబేడ్కర్‌ మనుమడు ఆనంద్‌ తేల్తుం బ్డే, జర్నలిస్టు గౌతమ్‌ నవలాఖా, సుధా భరధ్వాజ్, 80 ఏళ్ళ వరవరరావు, అంగవైకల్యంతో, అనారోగ్యంతో చక్రాల కుర్చీకి పరిమితమైన సాయిబాబాలు దేశానికే ప్రమాదమంటూ బెయిల్‌ కూడా నిరాకరిస్తున్నారు. వారి భావాలతో చాలామంది ఏకీభవించకపోవచ్చు. కానీ, భావాలు, ఆలోచనలు ఉండకూడదని శాసించడం ఫాసిజం. లాక్‌డౌన్‌ సడలించిన తరువాతి కాలం మరింత గడ్డుకాలం. కరోనా కేసుల ఉధృతి పెరిగే ప్రమాదముంది. వీటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాల ఆర్థిక, వైద్య, సాంకేతిక శక్తి చాలదు. రాష్ట్రాలను దివాళా అయ్యేందుకు పంపి చోద్యం చూస్తున్న కేంద్రం ఫెడరల్‌ సంబంధాలనే విధ్వంసం చేసే ప్రయత్నాలను పెంచుతున్నది. విద్యుచ్ఛక్తి సవరణ చట్టం అందులో భాగం.

ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరవాలి. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలతో చర్చించండి. కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించండి. ప్యాకేజీని వెనక్కు తీసుకొని ప్రజల చేతికి నగదు అందేలా చూడండి. ప్రభుత్వరంగాన్ని పరిరక్షించండి. విదేశాలనుండి నల్లధనం వాపసు తెచ్చే ప్రయత్నాలు చేయండి. కరోనా ఖర్చుతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు న్యాయబద్ధంగా సాయంచేయండి. ఆదాయపుపన్ను చెల్లించేవారిని మినహాయించి, కరోనా కాలానికి నెలకు ఏడున్నరవేల రూపాయల చొప్పున దేశంలోని మిగతా అన్ని కుటుంబాలకు నేరుగా చెల్లించాలి. వలస కార్మికులందరికీ వ్యక్తికి పదికిలోల ఆహార ధాన్యాలు వచ్చే ఆర్నెల్లపాటు పంపిణీ చేయాలి. నగరాలలలో ఇంకా మిగిలిన వలస కూలీలను ప్రభుత్వం సొంత ఖర్చుతో స్వగ్రామాలకు చేర్చాలి. మరణించిన వలసకూలీల కుటుంబాలకు పాతికలక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరాచేసి, వారి పంటలకు గిట్టుబాటు ధరలు పెంచడం జరగాలి. రాజకీయఖైదీలను, ఇతర ఖైదీలను బెయిల్‌పై విడుదలచేయాలి. ప్రతిపక్షాలు, మేధావులతో చర్చించి సామరస్యపూర్వకమైన వాతావరణం కలిగించండి. అందరం కలిసి కరోనా వ్యతిరేక పోరాటాన్ని సాగిద్దాం.

సురవరం సుధాకరరెడ్డి
పార్లమెంటు మాజీ సభ్యులు

Courtesy Andhrajyothy