– ప్రభుత్వాలు అన్ని వేళలా సరైనవి కావు: జస్టిస్‌ దీపక్‌ గుప్తా
– ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అంతర్లీనంగా ఉంటుందని వ్యాఖ్య

న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యానికి అసమ్మతే అందమనీ, దాన్ని ప్రోత్సహించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీపక్‌ గుప్తా అన్నారు. ఢిల్లీలో ‘ప్రజాస్వామ్యం, అసమ్మతి’ అనే అంశంపై నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ… అసమ్మతిని అణచివేయాలని చూస్తే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని అన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారినీ, ప్రతిపక్ష పార్టీలను దేశద్రోహులుగా ముద్ర వేయడం సరికాదని చెప్పారు. ఇటీవల కాలంలో అటువంటి ఘటనలు కొన్ని జరిగినట్టు ఆయన అన్నారు. ‘ఎన్నికల్లో ఒక పార్టీకి 51 శాతం ఓట్లు వచ్చినంత మాత్రానా, మిగిలిన 49 శాతం మంది ఐదేండ్ల దాకా మాట్లాడకుండా ఉండాలని లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ పాత్ర ఉంది. ప్రభుత్వాలు అన్ని వేళలా సరైనవి కావు’ అని గుప్తా స్పష్టం చేశారు.

‘ఒకరు విరుద్దమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నందున అది దేశాన్ని కించపరిచినట్టు కాదు. ఆలోచనల సంఘర్షణ జరిగినప్పుడల్లా అసమ్మతి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అంతర్లీనంగా ఉంటుంది’ అని తెలిపారు. అంతేగాక శాంతియుత మార్గాలను అనుసరిస్తున్నంత కాలం ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని గుప్తా పునరుద్ఘాటించారు.

Courtesy Nava telangana