కేరళలో జరిగిన తాజా ఎన్‌కౌంటర్‌ వామపక్షవర్గాలలో, సంకీర్ణ ప్రభుత్వంలో కలకలం సృష్టిస్తోంది. అక్టోబర్‌ చివరి వారంలో పాలక్కాడ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌ కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. వీరితో కలిపి, 2016 నుంచి కేరళ వామపక్ష ప్రభుత్వ హయాంలో ఎన్‌కౌంటర్‌ మృతుల సంఖ్య 8కి చేరింది. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకమైనదంటూ కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రతిపక్ష యుడిఎఫ్‌ ఆరోపించింది. కాగా, వామపక్ష ప్రభుత్వంలో భాగస్వామి అయిన సిపిఐ ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా తప్పుపట్టింది. మార్క్సిస్టు పార్టీకి చెందిన ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ మాత్రం, పోలీసు కాల్పులను పూర్తిగా సమర్థిస్తూ, అది ఆత్మరక్షణకోసమే జరిగిన ఎన్‌కౌంటర్‌ అని వాదిస్తున్నారు.

బూటకమైనవో, అప్పుడప్పుడు నిజమైనవో ఎన్‌కౌంటర్లు జరగని రాష్ట్రం దేశంలో ఏదైనా ఉన్నదా అన్నది అనుమానమే. ఎక్కడైనా ఎన్‌కౌంటర్‌కు పోలీసులు ఇచ్చే వివరణ, అధికారంలో ఉన్నవారు ఇచ్చే సమర్థనా ఒకేరకంగా ఉంటాయి. కనీసం కొత్తగా ఏదైనా సృజనాత్మకంగా చెప్పాలన్న తపన కూడా కనిపించదు. అయినప్పుడు కేరళలో ఎందుకు ఇది ప్రత్యేకంగా కలవరం కలిగిస్తున్నది? ఎందుకంటే, అక్కడ సిపిఎం ప్రధాన భాగస్వామిగా ఒక మిశ్రమ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి, ఆ పార్టీకి కొన్ని సిద్ధాంతాలో విలువలో ఉన్నాయన్న పేరున్నది కాబట్టి. 2016లో మొదటి ఎన్‌కౌంటర్‌ జరిగినప్పటి నుంచి (అంతకు ముందున్న యుడిఎఫ్‌ ఊమెన్‌ చాందీ హయాంలో ఇద్దరు మావోయిస్టుల అరెస్టు తప్ప ఎన్‌కౌంటర్లేమీ జరగలేదు), పినరాయి విజయన్‌ మీద, ఆయన పార్టీ మీద రాజకీయ, నైతిక విమర్శలు మొదలయ్యాయి, కూటమిలోనే ఉన్న సాటి వామపక్షం నాటి నుంచి ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతున్నది. బహుశా, సిపిఐఎం లో కూడా అంతర్గతంగా విమర్శలు వస్తూ ఉండి ఉండాలి.

ఎన్నికల బరిలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలైనా, సాయుధ విప్లవం తప్ప మరో మార్గం లేదని చెప్పే మావోయిస్టులైనా ఒకే కుదురు నుంచి పుట్టినవారని అందరికీ తెలిసిందే. పార్లమెంటరీ పక్షాలలో కూడా మార్క్సిస్టు పార్టీ వివిధ అంశాల మీద సిపిఐ కంటె మిలిటెంట్‌ వైఖరి తీసుకుంటుందని సాధారణంగా భావిస్తుంటారు. సిపిఐ కార్యకర్తల పునాది క్రమంగా కరిగిపోతుండగా, సిపిఎం కు ఇప్పటికీ, నిబద్ధులు, త్యాగశీలురు తగినంతగా ఉన్నారని కూడా చెబుతుంటారు. కానీ, సైద్ధాంతిక విషయాలలో ఆ పార్టీ తరచు పిల్లిమొగ్గలు వేస్తుందన్న విమర్శ వింటుంటాము. బహుశా, పార్టీలో ఉన్న రెండు మూడు పంథాలూ, వాటి మధ్య పోరాటమూ కూడా కారణమయి ఉండవచ్చు. మరింత గట్టిగా, రాజీలేకుండా పోరాటాలు సాగించాలన్న వర్గం దగ్గర నుంచి, సైద్ధాంతిక వైఖరులను బాగా సడలించుకుని ఉదారవాద పార్టీగా మారాలన్న వర్గం దాకా సిపిఎంలో అభిప్రాయాలున్నాయంటారు. జ్యోతిబసుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం తప్పా ఒప్పా అనే విషయంలో అనేక చర్చలు ఇంకా సాగుతున్నాయి. బుద్ధదేవ్‌ భట్టాచార్య బెంగాల్‌ ముఖ్యమంత్రి అయ్యాక, సింగూర్‌, నందిగ్రామ్‌ విషయంలో ఆయన తీసుకున్న వైఖరికి, ఆయన పార్టీ ఇతర రాష్ట్రాలలో తీసుకున్న వైఖరులకు వైరుధ్యాన్ని చాలా మంది ఎత్తి చూపారు. అలాగే సమ్మెల విషయంలో, కార్మికుల హక్కుల విషయంలో ఆయన తీరు, పార్టీకి భిన్నంగా ఉండేది. అధికారంలో ఉన్నాము కాబట్టి, అదొక పరిమితి, అందువల్ల అట్లా ఉండవలసి వస్తుంది– అనుకున్నారేమో తెలియదు.

ఎన్‌కౌంటర్ల విషయంలో కూడా సిపిఎంకి మొదట సూత్రబద్ధ వైఖరి ఉండేది. ఆంధ్రప్రదేశ్‌లో బూటకపు ఎన్‌కౌంటర్ల విషయంలో అసెంబ్లీలోనూ బయటా పోరాడినవారిలో పుచ్చలపల్లి సుందరయ్య ప్రముఖులు. నక్సలైట్లు అతివాద దుందుడుకు వాదులని సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తూనే, బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండించారాయన. బెంగాల్‌లో అధికారంలో ఉన్న కాలంలో కూడా బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడడం లెఫ్ట్‌ఫ్రంట్‌ విధానంగా లేదు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన ఎన్‌కౌంటర్లన్నిటి విషయంలో రాష్ట్ర సిపిఎం ఎంతో క్రియాశీలంగా నిరసనలు తెలిపింది. మరి కేరళలో జరుగుతున్నదాన్ని వారు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎంతో నిజాయితీతో, ఆర్తితో పనిచేస్తున్న మార్క్సిస్టు పార్టీ విద్యార్థి, యువజన, రైతాంగ, కార్మిక కార్యకర్తలు, ప్రత్యర్థులు వేసే ప్రశ్నలకు ఎట్లా జవాబు చెబుతారు? సిపిఎం ప్రభుత్వం ఉండగానే, ఆ పార్టీ కార్యకర్తలిద్దరిని ‘ఊపా’ కింద అరెస్టు చేశారట. అదేమి పాలన?

నక్సలైట్లు హింసావాదులే కావచ్చు. గతంలో మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి చంపి ఉండవచ్చు. అవేవీ, పోలీసుయంత్రాంగం ద్వారా జరిపించే బూటకపు చర్యలకు సమర్థన కాలేవు. వారిని రాజకీయంగా ఎదుర్కొనండి. ప్రజాబలంతోనూ ఎదుర్కొనండి. ఎంతటి నేరస్థుడినయినా, చివరకు ఉగ్రవాదినయినా చట్టబద్ధంగానే శిక్షించాలి కదా? వ్యవస్థ మారితే తప్ప నిజమైన ప్రజాప్రభుత్వాలు రావని, అయినప్పటికీ, ఈ పాలనాయంత్రాంగం ద్వారానే ప్రజలకు కొంతవరకైనా మేలు చేయవచ్చునని భావించి అధికారం కోసం పోటీపడతామని మార్క్సిస్టుపార్టీ వాదిస్తుంది. ఆ మేరకు తాము బెంగాల్‌లో, కేరళలో భూసంస్కరణలు వంటి చర్యలనేకం విజయవంతంగా తీసుకున్నామని కూడా చెబుతుంది. మరి, మానవహక్కుల విషయంలో అది ఇతర పాలకపార్టీలకన్న ఏ మేరకు మెరుగుగా ఉన్నట్టు? ఏవో తెలియని ఒత్తిడులు ఉన్నాయని, భిన్నంగా ఉంటే ముద్రలు పడి అధికారం పోతుందని ఏవో కారణాలు చెప్పవచ్చును. కానీ, జీవించే హక్కు వంటి కనీస ప్రాథమిక హక్కు విషయంలోనే రాజీపడితే, ఇక చూపించ గలిగే ఆదర్శ నమూనా పాలన ఏముంటుంది?

ఏ రాయి అయితేనేమి పళ్లూడగొట్టుకోవడానికి– అని ఒక వాడుక. అందరూ అంతే అయినప్పుడు, అన్ని పాలనల్లోనూ ఒకే అబద్ధం అయినప్పుడు పినరాయి అయితేనేమి, పెదరాయి అయితేనేమి?

Courtesy Andhrajyothi…