యూపీలోని మీరట్‌ జోన్‌లో ఎన్‌కౌంటర్‌ మరణాల సంఖ్య
– రాష్ట్రంలో 3,896 ఎన్‌కౌంటర్లు.. 76 మంది హత్య
– యోగి పాలనలో పెరిగిన కాల్పులు, మూకదాడులు

ఇప్పటి వరకు 52. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జోన్‌లో పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించిన మృతుల సంఖ్య ఇది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ సింగ్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్‌కౌంటర్‌ మరణాలు, మూకదాడులు అధికమవుతున్నాయి. తాజాగా మీరట్‌ జోన్‌లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నలుగురు నేరస్తులు మరణించారు. యోగి హయాంలో ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌. ఓ పోలీసు మరణానికి ప్రతీకారంగా సినిమాను తలపించేలా ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు సమాచారం. జులై 2న నేరస్తుడు రోహిత్‌ ముజఫర్‌నగర్‌లో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్‌ ముఠా చేతిలో ఓ పోలీసు తీవ్రంగా గాయపడి.. తర్వాత ప్రాణాలొదిలారు. దీంతో రోహిత్‌తోపాటు ఆయన ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులు ముజఫర్‌నగర్‌లో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వారిని వెంటాడారు. ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించగా తొలుత వారే కాల్పులకు తెగబడినట్టు పోలీసులు తెలిపారు. మంగళవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు స్పాట్‌లోనే మరణించగా.. మరో ఇద్దరు ఎనిమిది గంటల తర్వాత మీరట్‌లో పోలీసులు కాల్పుల్లో చనిపోయారు. వీరిద్దరు ఎస్‌యూవీ వాహనాన్ని దొంగిలించి పారిపోయారని, చివరికి ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెప్పారు. బుధవారం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో రాజ్యసభ ఎంపీకి చెందిన కంపెనీ నుంచి రూ. 65 లక్షల దోపిడీలో భాగస్వామ్యమున్న ఓ నేరస్తుడు ఘజియాబాద్‌లో కాల్పుల్లో మరణించాడు.

యోగి అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్ల తర్వాత ఈ జోన్‌లో 945 మంది క్రిమినల్స్‌పై కాల్పులు జరిగాయి. వీరిలో కొందరు తీవ్రంగా గాయపడి అరెస్టయినవారూ ఉన్నారు. తాజా ఎన్‌కౌంటర్‌తో ఈ జోన్‌లో పోలీసుల కాల్పుల్లో మరణించిన నేరస్తుల సంఖ్య 52కు చేరింది. కాగా, ఇటీవలే విడుదలైన అధికారిక సమాచారం ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, నేరస్తులకు మధ్య 3,896 ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇందులో 8,904 మంది నేరస్తులు అరెస్టయ్యారు. కాగా, 76 మంది నేరస్తులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. నేరస్తులు కాకుండా ఈ కాల్పుల్లో 1,154 మంది ఇతరులు గాయపడ్డారు. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌ మరణాలపై హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

(నవ తెలంగాణసౌజన్యంతో)