Image result for ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు"వరంగల్‌ యాసిడ్‌ దాడి బాధితురాలు ప్రణీత

మహిళలపై అత్యాచారాలకు, దాడులకు పాల్పడిన వారిపై సామూహిక హింస కాకుండా.. చట్టపరంగా వారిని కఠినంగా శిక్షించడమే పరిష్కారమని వరంగల్‌ యాసిడ్‌ దాడి బాధితురాలు టి.ప్రణీత అన్నారు. తమపై యాసిడ్‌ దాడిచేసిన ముగ్గురు నిందితుల్ని 2008లో ఎన్‌కౌంటర్‌ చేసినాకూడా.. ఇప్పటికీ న్యాయం జరిగిందన్న భావన తనకు కలగడం లేదని ‘హఫింగ్టన్‌ పోస్ట్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రణీత చెప్పారు. మహిళలపై దాడులు జరగకుండా చూడటమే వారికి చేసే సరైన న్యాయమని ఆమె అభిప్రాయపడ్డారు. యాసిడ్‌ దాడిలో ప్రణీతతో పాటు  గాయపడిన స్వప్నిక 20 రోజుల తర్వాత మరణించారు. గాయాల నుంచి కోలుకుని ఉద్యోగంలో చేరిన ప్రణీత ప్రస్తుతం అమెరికాలోని డెన్వర్‌లో ఉంటున్నారు. హైదరాబాద్‌ శివార్లలో దిశపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురు నిందితుల్ని శుక్రవారం తెల్లవారుజామున   ఎన్‌కౌంటర్‌ చేయడానికి రెండ్రోజుల ముందు ప్రణీత ఇంటర్వ్యూ ఇచ్చారు.

నేనేం తప్పు చేశాను
నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌ తనను ఇప్పటికీ నీడలా వెంటాడుతూనే ఉందన్నారు. ‘‘నేనొక సాదాసీదా కాలేజీ విద్యార్థిని. క్లాసులకు వెళ్లి స్నేహితురాలు స్వప్నికతో కలిసి స్కూటర్‌పై తిరిగొస్తుండగా మాపై యాసిడ్‌ దాడి జరిగింది. నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడే ముగ్గురు నిందితుల ఎన్‌కౌంటర్‌ విషయం తెలిసింది. వారి చావులకు మీరు కారణమయ్యారని ఎవరైనా అంటే నేనేం తప్పుచేశానన్న బాధ కలిగేది. ఎన్‌కౌంటర్‌ మరణాలు మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచాయా? అన్న ప్రశ్న నన్ను అడగొద్దు. ఎన్‌కౌంటర్‌ గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు. ఆ మాట వింటే నాకు భయం వేస్తుంది’’ అని వివరించారు

అప్పుడే నాకు న్యాయం
యాసిడ్‌ దాడి నిందితుల ఎన్‌కౌంటర్‌ వల్ల న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు- ‘‘అలాంటి చర్యల వల్ల ఏ న్యాయమూ జరగలేదు. నా ముఖం, చర్మం సాధారణ స్థితికి వచ్చినపుడు, నేను మామూలు జీవితం గడిపినప్పుడు మాత్రమే నాకు న్యాయం జరిగినట్లు. వాళ్లు ఎన్‌కౌంటర్లో చనిపోయినా.. నేను మాత్రం ఆ సంఘటన తర్వాత ఇప్పటికీ కుమిలిపోతూనే ఉన్నా. నా చర్మానికి మొత్తం 14 సర్జరీలు చేశారు. కొద్దిరోజుల్లోనే జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పటికీ నాటి సంఘటన తాలూకూ భయాలు నన్ను వెన్నాడుతూనే ఉన్నాయి. ఫొటో తీసుకున్నా.. అద్దం ముందు నిలబడినా.. నాటి సంఘటన గుర్తుకొస్తుంది. పరీక్షల్లో 82% మార్కులతో పాసయ్యా. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం వచ్చింది. అప్పటికీ నా జీవితం సాధారణ స్థితికి రాలేదు. నేనొకసారి విదేశీ బిజినెస్‌ ట్రిప్‌కు వెళ్లాల్సి వస్తే ‘మీరు శారీరకంగా ఫిట్‌గానే ఉన్నారా?’ అని టీం లీడర్‌ అడిగితే.. ఆయనతో నేను గొడవపడ్డా’’ అని తెలిపారు.

ఆ ధీమాతోనే వారు నేరం చేస్తారు
హైదరాబాద్‌ శివార్లలో టోల్‌ ప్లాజా వద్దే నిలబడాలని చెల్లెలు చెప్పిన మాటను దిశ విని ఉంటే ఆమెకు ఎవరైనా సాయం చేసి ఉండేవారని ప్రణీత అభిప్రాయపడ్డారు. దాడిచేసినా తమను ఎవరూ పట్టుకోలేరని, ఒకవేళ దొరికినా బెయిల్‌పై బయటికి వస్తామనే ధీమాతోనే చాలా మంది పురుషులు నేరాలు చేస్తారని ప్రణీత చెప్పుకొచ్చారు. పోలీసులు తక్షణం స్పందిస్తే చాలామంది మహిళలు దాడుల నుంచి బయటపడతారన్నారు. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక పోలీసు టీం ఉంటే మహిళలకు న్యాయం చేయగలుగుతారని చెప్పారు. ‘‘నిందితులకు వ్యతిరేకంగా పోలీసులు గట్టి సాక్ష్యాలు సేకరించాలి. వారిని కోర్టులో విచారించి తగిన శిక్ష పడేలా చేయాలి. ప్రతి కేసుపైనా పకడ్బందీగా విచారణలు జరిపి శిక్షిస్తే. ఇలాంటి నేరాలు పునరావృతం కావు’’ అని వివరించారు.

(Courtesy Eenadu)