వ్యవసాయ పనులు లేని రోజుల్లో వలసలు నివారించడానికి, వ్యవసాయ కార్మికులకు, ఇతర కష్టజీవులకు ఉపాధి హామీ పథకం అమలు కొంత ఊరటనిచ్చింది. కొంత వరకు వలసలు తగ్గాయి. వలసలను పూర్తిగా అరికట్టేలా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కాని, నేడు జగన్‌ ప్రభుత్వం కాని ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. ఈ పథకాన్ని విస్తృతంగా వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని పాలక పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. గత రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపింది. అయితే వామపక్ష పార్టీలు, ప్రజాతంత్రవాదులు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాపితంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి. దీంతో వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది.

ఎన్‌.డి.ఎ నాయకత్వంలోని బి.జె.పి ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈ పథకాన్ని భవిష్యత్తులో కొనసాగించలేమని బహిరంగంగానే ప్రకటన చేశారు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు రూ.లక్షల కోట్లు సబ్సిడీగా ఇస్తున్న ప్రభుత్వం పేద ప్రజలకు కాస్తంత భరోసా ఇచ్చే పథకాన్ని రద్దు చేస్తామనడం సిగ్గుచేటు. దీనికి వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘాలు దేశ వ్యాపితంగా నిరసన తెలియ చేశాయి.
వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ 2019 సెప్టెంబర్‌ 25వ తేదీన 2020-21 మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రణాళిక ప్రక్రియను 2019 అక్టోబరు 2, నవంబర్‌ 30వ తేదీ మధ్య చేపట్టాలని పేర్కొంది. ‘నాణ్యత లేని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్న వేతనదారులకు 100 రోజులు ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. వీరికి రోజు కూలీ రూ.211, మెటీరియల్‌ నిమిత్తం రూ.140 కలిపి మొత్తం రూ.351.66 ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఏ గ్రామ పంచాయతీ లోనైనా పని చేపట్టడం కోసం అంచనా తయారు చేయకపోతే ఆ పంచాయతీలో ఎటువంటి పనులు గుర్తించబడవు’ అని పేర్కొన్నారు. కాని ఆచరణ పరిశీలిస్తే మన రాష్ట్రంలో ఏ జిల్లాలోను పంచాయతీల వారీగా గ్రామ సభలు నిర్వహించలేదు. అక్కడక్కడ ముఖ్య నాయకులతో మాట్లాడి గ్రామ సభలు నిర్వహించినట్లుగా నివేదికలు పంపారు. ఇది ఏవిధంగా సరైందో అధికారులు ప్రజలకు తెలియ చేయాలి.

కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.60 వేల కోట్లు కేటాయించింది. ఈ పథకాన్ని రూ.50 వేల కోట్లతో ప్రారంభించారు. 14 సంవత్సరాలు గడిచిన తరువాత కూడా కేటాయించింది అదనంగా రూ.పది వేల కోట్లు మాత్రమే. పెరుగుతున్న ధరలతో పోలిస్తే ఈ పథకానికి నిధులు పెంచడం లేదని, పైగా నిధులు తగ్గిస్తున్నారని అర్థమవుతోంది. వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల రోజురోజుకూ పని దినాలు పడిపోతున్నాయి. ఒకప్పుడు సంవత్సరానికి 120 రోజులు పని దినాలు ఉండేవి. నేడు డెల్టాలో 40-50 రోజుల పని కూడా దొరకడం లేదు. మెట్ట సాగులో మాత్రం దాదాపుగా 80 రోజులు పనులు దొరుకుతున్నాయి. పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ చేతి వృత్తులు చితికిపోతున్నాయి. ఈ రంగంలో పని చేస్తున్న శ్రామిక జనం వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్నారు. లేదా పట్టణాలకు వలసలు పోతున్నారు. మరోవైపు వ్యవసాయ పనులు తగ్గుతున్నాయి. ఇందువల్ల గ్రామీణ ప్రాంతంలో నిరంతరం పేదరికం పెరిగి పోతున్నది. జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధి పనులు చేపట్టి ఆదుకోవాల్సిన అవసరం ఉంది.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గత సంవత్సరం కూడా రాయలసీమ ప్రాంతంలో తీవ్ర కరువు ఏర్పడింది. 360 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినా కరువు పనులు చేపట్టలేదు. కనీసం పశువులకు గ్రాసం కూడా ఇవ్వలేదు. ఉపాధి హామీ పథకం పనులు చేపట్టాలని జీపు, సైకిల్‌ యాత్రలు చేపట్టినా, మండలాల వద్ద ధర్నాలు చేసినా చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు. జగన్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక కూడా రాయలసీమలో కరువు పనులు చేపట్టలేదు. కరువు ప్రాంతాల్లో కరువు పనులు అదనంగా 50 రోజులు కలిపి 150 రోజులు పనులు కల్పిస్తామని ప్రభుత్వాలు ప్రకటించినా ఆచరణలో అమలు కాలేదు. ఉపాధి పథకం పనులు చేపట్టలేని దౌర్భగ్య స్థితిలో ప్రభుత్వాలున్నాయి.
కరువు పనులు చేసిన తరువాత 15 రోజుల్లో వేతనాలు చెల్లించాలి. వేతనాలు చెల్లించకపోతే వడ్డీ కూడా కలిపి ఇవ్వాలి. వడ్డీ మాట అటుంచితే, కొన్ని చోట్ల 6 నెలలు దాటినా వేతనాలు ఇవ్వలేదు. కూలీ రాకపోవడంతో, ఉపాధి పనులకు వెళ్ళడానికి శ్రమ జీవులు ఆసక్తి చూపడం లేదు. మరల వలస బాట పడుతున్నారు. నేడు కర్నూలు, అనంతపురం జిల్లాలలో అప్పుడే వలసలు ప్రారంభమయ్యాయి. కుటుంబానికి 100 రోజులు పని దినాలు పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 40 నుండి 60 రోజులు మాత్రమే పని చేస్తున్నారు. కూలీ రూ.211 రావాల్సి ఉండగా వేసవిలో అదనపు వేతనం కలిపి రూ.150 నుండి రూ.200 మధ్య వచ్చాయి తప్ప మామూలు రోజుల్లో రూ.100 వేతానాలు మాత్రమే వస్తున్నాయి. కొన్ని మండలాల్లో భూమి గట్టిగా ఉన్న ప్రదేశాల్లో గునపం కూడా దిగని పరిస్థితుల్లో చేతులు బొబ్బలెక్కేలా కష్టపడి పని చేస్తే కొన్ని చోట్ల రోజుకు రూ.40, మరికొన్నిచోట్ల రూ.60 నుండి రూ.80 మాత్రమే వస్తోంది. దీనివల్ల కూడా కూలీలు ఉపాధి పనులకు వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు.

ఉపాధి పనుల్లో అవినీతి చాలా హెచ్చు స్థాయిలో ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికార రాజకీయ పార్టీల నాయకులు కుమ్మకై ఉపాధి నిధులను దిగమింగేస్తున్నారు. సోషల్‌ ఆడిట్‌లో అవినీతి జరిగిందని నిర్ధారించినా అవినీతిపరుల నుండి సొమ్మును తిరిగి రాబట్టడం లేదు. అనంతపురం జిల్లాలో గతంలో జిల్లా అధికారులు పనిముట్లను కూడా అమ్మేసుకొని అవినీతి సొమ్మును జేబులో వేసుకున్నారు. పత్రికలు బయటపెట్టిన అవినీతి అధికారులను బదిలీ చేస్తున్నారు తప్ప వారిపై కఠిన చర్యలు లేవు.
గ్రామీణ ప్రాంతాల్లో పనులు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఉపాధి కూలీలు అధికారులను అడుగుతున్నా పనులు లేవు, పరిశీలిస్తున్నాం అని కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతు న్నారు. కాని రాష్ట్ర కమిషనర్‌ విడుదల చేసిన పత్రంలో చెక్‌ డ్యాంల నిర్మాణం-మరమ్మతులు, పేద రైతుల భూమి అభివృద్ధి పథకం, స్మశానాల అభివృద్ధి, ప్రహరీ గోడల నిర్మాణం, బి.టి రోడ్లు వేయడం, మురుగు నీరు పోవడానికి సిసి రోడ్ల పక్కన పక్కా డ్రెయిన్‌ నిర్మాణం, గ్రావెల్‌ రోడ్ల నిర్మాణం, ఇళ్ల స్థలాలు మెరక చేయడం, సంతలను అభివృద్ధి చేయడం లాంటి పనులు చేపట్టాలని సూచించారు. ఈ పనులు చేపడితే అభివృద్ధి కన్పిస్తుంది. కూలీలకు ఉపాధి పనులు లభ్యమవుతాయి. కాని ఈ పనుల్లో కొన్నింటికి ఉపాధి కూలీలతో పని లేకుండా పూర్తిగా యంత్రాలతోనే చేయిస్తున్నారు. చట్ట ప్రకారం 60 – 40 నిష్పత్తిలో పనులు చేపట్టాలి. 60 శాతం శ్రమ – వేతానాలకు, 40 శాతం నిధులు మెటీరియల్‌కు ఖర్చు చేయాలి. పక్కా బిల్డింగ్‌లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం చేపడితే శ్రమజీవులకు తక్కువ, మెటీరియల్‌కు ఎక్కువగా వినియోగించే ప్రమాదం ఉంది. దీనివల్ల ఎందుకోసం పథకం ప్రవేశ పెట్టారో ఆ ప్రణాళిక లక్ష్యం దెబ్బ తినే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వేగవంతమవుతున్నది. కొనే వారు లేక మార్కెట్‌ విలవిలలాడుతున్నది. పరిశ్రమలలో పని దినాలు తగ్గించారు. దీనివల్ల కార్మికులకు జీతాలు కూడా తగ్గించారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు, పేద రైతులు, చేతి వృత్తిదారులు కూడా ఈ సంక్షోభంలో చిక్కుకుపోయారు. ఆర్థిక సంక్షోభం నుండి బయట పడాలంటే గ్రామీణ ప్రాంతం లోని ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. అందుకోసం ప్రస్తుతం బడ్జెట్‌లో కేటాయించిన రూ.60 వేల కోట్లకు బదులుగా రూ.లక్షా 20 వేల కోట్లకు పైగా కేటాయించి గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలి. అందుకు ఉపాధి పనులు చాలా విస్తృత స్థాయిలో చేపట్టడం ఒక్కటే మార్గం.

కనుకనే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అక్టోబర్‌ 4న ఢిల్లీలో ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ 600 మందితో సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఈ కింది డిమాండ్లు రూపొందించారు. వాటి అమలుకు దేశ వ్యాపితంగా డిసెంబరు 10వ తేదీన అన్ని రాష్ట్రాల్లో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద, రాష్ట్ర రాజధానిలో కూడా పెద్ద ఎత్తున ఉపాధి కూలీలను సమీకరించి ధర్నాలు నిర్వహించాలని పిలుపు ఇచ్చారు.

డిమాండ్లు :
ఉపాధి హామీ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలి. 90 శాతం నిధులు కూలీలకే ఖర్చు చేయాలి. ప్రస్తుతం కేటాయించిన రూ.60 వేల కోట్లకు బదులు వచ్చే బడ్జెట్‌లో రూ. లక్షా 20 వేల కోట్లకు పెంచాలి. ఉపాధి పనిని 100 నుండి 250 రోజులకు పెంచాలి. రోజు వేతనం రూ.600లకు పెంచాలి. పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలి. సకాలంలో వేతనాలు ఇవ్వకపోతే వడ్డీతో సహా కలిపి చెల్లించాలి. పని కోసం దరఖాస్తు చేసిన గ్రూపులకు15 రోజుల్లోగా పనులు చెప్పకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. పని చేయగలిగిన వారందరికీ జాబ్‌ కార్డులు ఇవ్వాలి. రాష్ట్రంలో ఉపాధి కూలీలకు సంక్షేమం ఏర్పాటు చేయాలి. ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.పది లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. 50 సంవత్సరాలు నిండిన వారికి రూ.3000 పింఛను ఇవ్వాలి. గర్భవతులకు వేతనంతో కూడిన 3 నెలల ప్రసూతి సెలవులు ఇవ్వాలి. పని చేసే చోట్ల పిల్లలకు ఆయాలను నియమించాలి. ఉపాధి పనిలో యంత్రాలు, కాంట్రాక్టర్లను నిషేధించాలి. అవినీతికి పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు బనాయించాలి. దిగమింగిన అవినీతి సొమ్మును రాబట్టాలి. మేట్లకు గుర్తింపు కార్డులు, పారితోషికం రూ.5 పెంచాలి. కూలీలకు పే స్లిప్‌లు, మంచినీళ్ళకు రూ.10లు, గునపానికి రూ.20 ఇవ్వాలి.

– దడాల సుబ్బారావు
( వ్యాసకర్త వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు )