ఇతర ఖర్చుల కోసం రూ.840 కోట్లు వాడేశారు
యాజమాన్యం చర్యతో ఇబ్బందుల్లో ఆర్టీసి ఉద్యోగులు
ఉద్యోగుల అవసరాలకు, పదవీ విరమణ తరువాత ఆర్థికంగా ఆదుకునే వాటిలో భవిష్యనిధి(పిఎఫ్) కీలకమైనది. అలాంటి పిఎఫ్ సొమ్మును ఆర్టీసి యాజమాన్యం పక్కదారి పట్టించింది. అలా పక్కదారి పట్టిన సొమ్ము రూ.840 కోట్లు. ”ఆర్టీసి ఉద్యోగులకు గతంలో లాగా కాకుండా పదవీ విరమణ పొందిన నెలలోనే వారికి రావాల్సిన మొత్తాన్ని సెటిల్ చేస్తాం. పెన్షన్ కూడా అదే నెలలో వచ్చేలా చూస్తాం” ఇది గతంలో ఆర్టీసి ఎమ్‌డి చేసిన ప్రకటన. దాదాపు 4వేల కేసులను పరిష్కరించినా ఆ తరువాత అది మూనాళ్ల ముచ్చటగా మారిపోయింది. ఉద్యోగుల వేతనాల నుంచి పిఎఫ్ కోసం 12 శాతం రికవరీ చేసి అందుకు మరో 12 శాతం యాజమాన్యం జమచేసి పిఎఫ్ ట్రస్టుకు చెల్లించాలి. అలా ప్రతి నెలా సుమారు రూ.36 కోట్లను పిఎఫ్ ట్రస్టుకు ఆర్టీసి యాజమాన్యం జమ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని నెలలుగా ఆ మొత్తాన్ని జమ చేయలేదు. దీంతో బకాయి మొత్తం రూ.840 కోట్లకు చేరింది. చెల్లించాల్సింది చెల్లించకపోగా ఆ మొత్తాన్ని చట్ట వ్యతిరేకంగా సంస్థ అవసరాలకు వినియోగించారు. ఉద్యోగుల జీత భత్యాలకు, పాలన అవసరాలకు ఆ మొత్తాన్ని వాడేశారు. ఆర్టీసి ప్రస్తుతం ఆర్థిక లోటులో ఉన్న రీత్యానే పిఎఫ్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించలేకపోతున్నామని ఆర్టీసిలోని ఓ ఉన్నత స్థాయి అధికారి చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసి రూ.1250 కోట్ల నష్టాల్లో ఉందని, దీనికి తోడుపెరిగిన డీజిల్ ధరలు, సిబ్బందికి వేతనాలు పెంచడం వల్ల రోజుకు రూ.రెండు కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపారు. ఆర్టీసికి రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు రాగానే పిఎఫ్ బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని అంటున్నారు. పిఎఫ్ బకాయిల వల్ల ఆర్టీసి ఉద్యోగులకు పదవీ విరమణ నాటికి అందాల్సిన మొత్తం జూన్ నుంచి అందడం లేదు. ఉద్యోగులు తమ అవసరాలైన ఇంటి మరమ్మతులు, నిర్మాణాలు, పిల్లల ఫీజులు వంటి వాటి కోసం రుణాలు పెట్టుకున్న వారికి కూడా జూన్ 27 తరువాత రుణాలను నిలుపుదల చేశారు. అవసరాలకు డబ్బులు అందక ఆర్టీసి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తక్షణమే బకాయిలు చెల్లించాలి
పిఎఫ్ ట్రస్టుకు ఆర్టీసి యాజమాన్యం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్(ఇయు) రాష్ట్ర అధ్యక్షులు వైవి రావు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. కార్మికుల సొమ్మును చట్ట వ్యతిరేకంగా యాజమాన్యం వాడుకోవడం దుర్మార్గమని తెలిపారు. ఇపిఎఫ్ చట్టం ప్రకారం సిబ్బంది వేతనాల నుంచి రికవరీ చేసిన మొత్తాన్ని పిఎఫ్ ట్రస్టుకు జమ చేయాలని ఆర్టీసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎస్కె జిలానీ బాషా, ప్రధాన కార్యదర్శి సిహెచ్ సుందరయ్య పేర్కొన్నారు. ఆర్టీసి కోసం బడ్జెట్లో కేటాయించిన మొత్తాన్ని ప్రభుత్వం అందించాలని, ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో సాయం చేయాలని కోరారు. తక్షణమే పిఎఫ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
(Courtacy Prajashakti)