– దాదాపు 72 గంటలు ఇదే తీరు
– ఢిల్లీ అల్లర్లలో ఓ వర్గంవారే లక్ష్యంగా దాడులు
– కేంద్రం తీరుపై బాధితుల ఆగ్రహం
– పౌర సంఘాల నిజ నిర్ధారణ నివేదిక

న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీ హింసాత్మక అల్లర్లతో అట్టుడుకుతున్న తరుణంలో పోలీసు వంటి అత్యవసర సేవలు తగిన విధంగా స్పందించలేదని పౌర హక్కుల సంఘాల నాయకులు, ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. దాదాపు 48 నుంచి 72 గంటల పాటు 100 నంబర్‌కు అనేక సంఖ్యలో పోన్లు వచ్చినప్పటికీ పోలీసులు వాటిని స్వీకరించలేదని తెలిసింది. పౌరహక్కుల సంఘాలకు చెందిన నాయకులు ఫరా నఖ్వీ, ఎన్‌. సరోజిని, నవ్‌షరన్‌ సింగ్‌, నవీన్‌ చందర్‌ లతో ఏర్పాటైన నలుగురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ.. అల్లర్ల ప్రభావిత ప్రాంతాలలో పర్యటించింది. బాధితులు, ప్రత్యక్ష సాక్షులతో కలిసి మాట్లాడింది. దీనికి సంబంధించి ‘లెట్‌ అజ్‌ హీల్‌ అవర్‌ ఢిల్లీ’ పేరుతో నివేదికను విడుదల చేశారు.
భజన్‌పుర, చాంద్‌ బాఘ్, గోకుల్‌పురీ, చమన్‌ పార్క్‌, శివ విహార్‌, మెయిన్‌ ముస్తాఫాబాద్‌లతో పాటు భగీరథీ విహార్‌, బ్రిజ్‌పురీలలో బృందం పర్యటించింది. ఈశాన్య ఢిల్లీలో ముస్లింలే లక్ష్యంగా హిందూత్వ శక్తులు దాడులు జరిపాయని తేల్చింది. ఈ ఘటనలు 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు, గుజరాత్‌లో ముస్లింలపై 2002లో జరిగిన దాడులను గుర్తుకు తెచ్చాయని నివేదికలో పేర్కొంది. ప్రభావిత ప్రాంతాలలోని స్థానికులు, బాధితులకు అత్యవసర పరిస్థితుల్లోనూ పోలీసుల నుంచి సాయం, స్పందన కరువైందని బృందం వివరించింది. అల్లర్ల సమయంలో అదనపు బలగాలను మోహరించకుండా అలసత్వం వహించిన కేంద్రం తీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నది. అలాగే బాధితుల పక్షాన నిలబడలేదని ఢిల్లీ సర్కారుపైనా వారు ఇదే అభిప్రాయంతో ఉన్నారని తెలిపింది.
ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు, వారి ఆస్థులకు రక్షణ కల్పించడానికి బదులు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనలో మోడీ సర్కారు నిమగమై ఉన్నదని ముస్తాఫాబాద్‌ ప్రాంతవాసులు నిజ నిర్ధారణ బృందానికి వివరించారు. అలాగే ఆయా ప్రాంతాలలో ఇండ్లు, దుకాణాలు, మసీదులు ధ్వంసమైన తీరును నివేదికలో పేర్కొన్నారు. ఈశాన్య ఢిల్లీలో అల్లర్లపై పోలీసులు, కేంద్ర ప్రభుత్వాల తీరును ఇటీవల ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే.

కాషాయమూక ‘గోలీ మారో’ నినాదాలు
రాజీవ్‌ చౌక్‌ మెట్రో స్టేషన్లో ఘటన:ఆరుగురురిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు అనురాగ్‌ ఠాకూర్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యల పరంపరను వారి అనుచరగనం కూడా కొనసాగిస్తున్నది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఏఏ వ్యతిరేకులనుద్దేశిస్తూ ఆయన చేసిన ‘గోలీ మారో..’ నినాదాలను వినిపిస్తూ ప్రశాంత వాతావరణాన్ని కాషాయమూకలు చెడగొడుతున్నాయి. కాషాయ దుస్తులు ధరించిన ఆరుగురు.. ఢిల్లీలోని రాజీవ్‌ చౌక్‌ మెట్రో స్టేషన్‌లో శనివారం ఇలాంటి నినాదాలను పెద్దపెట్టున చేశారు. దీంతో అక్కడ ఉన్న ప్రయాణికులు వారి నినాదాలతో కాస్త భయానికి గురయ్యారు. కాగా, నినాదాలు చేసిన ఆ ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ట్రైన్‌లో సైతం ఇవే నినాదాలను చేసిన వారు రైలు ఆగిన తర్వాత కూడా కొనసాగించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ‘జై శ్రీరామ్‌’ నినాదాలు కూడా చేశారని తెలిపారు. దీంతో అత్యంత రద్దీ సమయంలో నినాదాలు చేస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన కాషాయమూకను సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అడ్డగించి ఢిల్లీ పోలీసులకు అప్పగించింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. ‘గోలీ మారో..’ వివాదాస్పద నినాదంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అనురాగ్‌ ఠాకూర్‌పై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలన్న పిటిషన్‌ ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉన్నది.

ఈశాన్య ఢిల్లీలో మార్చి 7 వరకూ పాఠశాలలు బంద్‌
హింసాత్మక అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలోని ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు మళ్లీ మూతపడనున్నాయి. ఈనెల 7 వరకూ పాఠశాలలు తెరుచుకోవని ఢిల్లీలోని ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈశాన్య, తూర్పు ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు, తదనంతర పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. పరిస్థితిని అంచనావేయడానికి శనివారం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సిబ్బందితో అధికారులు సమావేశమయ్యారు. అంతకముందు ఫిబ్రవరి 29వరకు పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే.

Courtesy Nava Telangana