లాహోర్‌: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా సంస్థ అధినేత హఫీజ్‌ సయీద్‌కు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం 11 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ‘దోషిగా ప్రకటించవద్దు’ అని కోర్టు హాలులో సయీద్‌ వేడుకొన్నాడు. అయినా, అతడికి శిక్షలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. పూర్తి శిక్షాకాలాన్ని జైలులోనే గడపాలని స్పష్టం చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల కోసం పాకిస్థాన్‌లోని పలు నగరాల్లో ట్రస్టులు, ఎన్‌జీవోల పేరిట భారీగా నిధులను సేకరించిన వ్యవహారంలో అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. అందులో రెండు కేసుల్లో ఇప్పుడు కోర్టు దోషిగా తేల్చింది. ఉగ్రవాదిగా ప్రకటించి 10 మిలియన్‌ డాలర్ల వెలను తలపై అమెరికా ప్రకటించిన సయీద్‌ను గత ఏడాది జూలై 17వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. లాహోర్‌లోని కోట్‌ లఖ్‌పత్‌ జైలులో ఉంచారు. లాహోర్‌, గుజరన్‌వాలా, ముల్తాన్‌లో ఉగ్రవాద సంబంధ ఆర్థిక లావాదేవీలను సాగించారం టూ ఉగ్రవాద వ్యతిరేక విభాగం అతనిపై కేసులను నమోదుచేసింది. వీటికి సంబంధించి సయీద్‌, ఇతరులపై మోపిన అభియోగాలను గత శనివారం ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ధ్రువీకరించింది. తాజాగా వారికి శిక్షలను ప్రకటించింది. సయీద్‌కు ఒక్కోకేసులో ఐదున్నరేళ్లు జైలు శిక్ష విధించింది. అలాగే రూ.15వేలు చొప్పున జరిమానా కూడా వసూలు చేయాలని ఆదేశించింది.

Courtesy Andhrajyothi