– ఇది మానవాళికే విపత్తు
– 153 దేశాలకు చెందిన 11వేల మందికిపైగా శాస్త్రవేత్తల ప్రకటన
న్యూఢిల్లీ : వాతావరణ సంక్షోభం ఎమర్జెన్సీ స్థాయికి చేరుకుందని 153 దేశాలకు చెందిన దాదాపు 11 వేల మందికి పైగా శాస్త్రవేత్తలు మంగళవారం హెచ్చరించారు. దీనిని ఎదుర్కొనేందుకు గట్టి చర్యలు తీసుకోకపోతే మానవాళికే అది పెను విపత్తుగా పరిణమిస్తుందన్నారు. వాతావరణ మార్పులకు దారి తీస్తున్న హరితగృహ వాయువుల విడుదల, ఇతర కాలుష్య కారకాల వల్ల భూగోళం వేడెక్కకుండా చూడాలన్నారు. ప్రపంచ ప్రజలపై చూపే దుష్ప్రభావం అంతా ఇంతా కాదన్నారు. జర్నల్‌ బయోసైన్స్‌ పత్రికలో ప్రచురించిన ఒక పత్రంలో భారత్‌కు చెందిన 69 మందితో పాటు వివిధ దేశాలకు చెందిన 11,258 మంది శాస్త్రవేత్తలు ఈ పరిస్థితిని సమీక్షించారు. వాతావరణ మార్పులపై 2016 నవంబరు4న కుదిరిన పారిస్‌ ఒప్పందం మూడేళ్లు పూర్తి చేసుకున్న మరుసటి రోజు, ఈ ఒప్పందం నుంచి అమెరికా అధికారికంగా తప్పుకుంటున్నట్లు ట్రంప్‌ ప్రకటించిన తరువాతి రోజున శాస్త్రవేత్తల నుంచి ఈ హెచ్చరిక వచ్చింది. భూ ఉష్ణో గ్రతలు 1.5 డిగ్రీల సెల్షియస్‌ స్థాయిని దాటిపోయేందుకు ఇంకా 12 ఏళ్లు మాత్రమే ఉన్నందన, దీనిపై సత్వరమే ప్రపంచ దేశాలు కదలాలని వారు కోరారు. 2030 నాటికల్లా భూ ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్లియస్‌కు మించకుండా చూడాలని పారిస్‌ ఒప్పందం నిర్దేశిస్తున్నది. ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజి (ఐపిసిసి) నివేదిక విడుదలైనప్పటి నుంచి ప్రపంచ వ్యాపితంగా యవత వీధుల్లోకి వచ్చి వాతావరణ సంక్షోభాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కాలంలో బ్రిటన్‌, పోర్చుగల్‌, కెనడా, అర్జెంటీనాతో సహా 23 దేశాల్లో పెద్దయెత్తున సమ్మెలు జరిగాయి. ప్రమాదరకర స్థాయి వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించి గత నాలుగు దశాబ్దాల డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులతో ఎదురయ్యే ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వాతావరణ ఎమర్జెన్సీని ప్రకటించాలన్నారు. ఇందులో ముఖ్యంగా విద్యుత్‌ వినియోగం, ఉపరితల ఉష్ణోగ్రతలు, జనాభా పెరుగుదల, భూ లభ్యత, అడవుల నిర్మూలన, ధృవప్రాంత హిమనీనదాలు, ఫెర్టిలిటీ రేట్లు, దేశీయ స్థూల ఉత్పాదకత (జిడిపి), కర్బన ఉద్గారాల విడుదల అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వారు వెల్లడించారు. గత నాలుగు దశాబ్దాలుగా ప్రపంచ దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, వాతావరణ మార్పుల సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో విఫలమయ్యాయని ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన ఓరేగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఎకాలజీ విలియం జె రిపిల్‌ అవేదన వ్యక్తం చేశారు. పలువురు శాస్త్రవేత్తల అంచనాల కన్నా వేగంగా వాతావరణ మార్పులు మన ముంగిట్లోకి వచ్చాయని ఆయన వివరించారు. వాతావరణ మార్పులతో భూమండలం వేడెక్కకుండా మానవాళి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ఆరు ప్రధాన రంగాలను ఈ అధ్యయన బృందం గుర్తించింది. ఇందులో విద్యుత్‌, స్వల్పకాలిక కాలుష్య కారకాలు, ప్రకృతి, ఆహారం, ఆర్థిక వ్యవస్థ, జనాభా పెరుగుదల వంటి అంశాలున్నాయి. మనకు విద్యుత్‌, ఆహారం ప్రాథమిక అవస రాలని, ఈ అవసరాలను తీర్చుకునేందుకు మనం ప్రకృతిని దోపిడీ చేస్తున్నామని, దీనితో భారీయెత్తున విధ్వంసం జరుగు తోందని ఈ అధ్యయనంలో భాగస్వామిగా వున్న ఢిల్లీ యూనివర్శిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జ్ఞాన్‌ ప్రకాశ్‌ శర్మ చెప్పారు. భారత్‌లో వాతావరణ పరిస్థితులను ఆయన ప్రస్తావిస్తూ దేశంలో రుతుపవనాల వంటి పర్యావరణ ప్రక్రియల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నా యన్నారు. దీనితో వ్యవసాయ పద్ధతుల్లో కూడా మార్పులు అని వార్యమయ్యాయని ఆయన అన్నారు. తాము పర్యావరణ ఎమర్జెన్సీ ప్రకటించ టానికి దారి తీసిన మార్పులను ఈ శాస్త్రవేత్తలు వివరించారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు ఉద్యమించటం, కోర్టుల్లో న్యాయ పోరాటాలు, మార్పును డిమాండ్‌ చేస్తున్న అట్టడుగు స్థాయి ప్రజా ఉద్యమాలు, అనేక దేశాలు, రాష్ట్రాలు, ప్రావిన్షియల్‌ ప్రభుత్వాలు, వ్యాపార వర్గాల నుండి వస్తున్న స్పందన తమను ఈ ప్రకటన చేయటానికి ప్రోత్సహించిందని వారు చెబుతున్నారు. పర్యావరణ శాస్త్రవేత్తల బృందంగా తాము స్థిరమైన సమతుల్యతతోకూడిన పర్యావరణ వైపు ముందుడుగు వేసే విషయంలో విధాన నిర్ణేతలకు సహకరించేందుకు తాము సిద్ధంగా వున్నామని శాస్త్రవేత్తల బృందం వివరించింది.

Courtesy prajasakti..