• 1500 సర్వీసు చార్జీ బకాయిపడ్డ అన్నదాత
  • చెల్లించలేదని ట్రాన్స్‌ఫార్మర్‌కు కరెంటు కట్‌
  • కరెంటు తీగలు తగిలించబోయి దుర్మరణం

పాపన్నపేట: ఆ నిరుపేద గిరిజన రైతు బకాయిపడ్డ రూ.1500 సర్వీస్‌ చార్జీ కోసం ఏకంగా ట్రాన్స్‌ఫార్మర్‌కే కరెంట్‌ కనెక్షన్‌ను తొలగించారు. రైతు, ఆ డబ్బు చెల్లించినా విద్యుత్తును పునరుద్ధరించలేదు. ‘అయ్యా.. నీళ్లు లేక వేసిన వరి పంట ఎండుతోంది. ట్రాన్స్‌ఫార్మర్‌కు కరెంటు ఇయ్యండి’ అంటూ అధికారులను ఆ రైతు వేడుకున్నాడు. బిల్లును చెల్లించినా విద్యుత్తును పునరుద్ధరించలేదు. పంట ఎండిపోతోందన్న ఆందోళనతో ఆ రైతుకు నేరుగా 11కేవీ విద్యుత్తు వైర్లతో కనెక్షన్‌కు ప్రయత్నించి దుర్మణంపాలయ్యాడు.

మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం అమ్ర్యా తండాలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుడు 35ఏళ్ల లునావత్‌ దీప్లా. ఆయనకు భార్య విజయ.. పిల్లలు ప్రకాశ్‌, నిఖిత ఉన్నారు. దీప్లా తన బోరుబావికి సంబంధించి నెలకు రూ.30 చొప్పున సర్వీసు చార్జీని చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు ఆయన రూ.1500 సర్వీసు చార్జీని బాకీపడ్డాడు. ఈ బిల్లు చెల్లించడం లేదనే కారణంతో ఆయన సర్వీసు ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కే విద్యుత్తును నిలిపివేశారు. డబ్బు చెల్లించినా అధికారులు కనెక్షన్‌ ఇవ్వకపోవడంతో ఆందోళన చెందాడు. పంటను కాపాడుకునేందుకు తానే సర్వీసు వైరును బిగించే ప్రయత్నం చేయడంతో షాక్‌ కొట్టి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఒక్క రైతు బిల్లు చెల్లించకుంటే, నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్‌ఫార్మర్‌నే పనిచేయకుండా చేసి అందరికీ కరెంటును నిలిపివేశారని ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ కింద ఉన్న 14 మంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీప్లా మృతికి అధికారులే బాధ్యత వహించాలని ఆందోళనకు దిగారు.

Courtesy Andhrajyothi