జైపూర్‌: దేశంలో దళితులపై దమనకాండలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆధిపత్య కులాలు దురంహకారంతో దారుణంగా దళితుల ప్రాణాలు తీసుస్తున్నారు. తాజాలా ఇలాంటి ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. హోటల్ నుంచి మొబైల్‌ ఫోన్‌ దొంగతనం చేశాడనే అనుమానంతో దళిత వృద్దుడు మదన్‌ లాల్‌ మీనా (75)ను కిరాతంగా కొట్టి చంపిన ఘటన సికార్‌ జిల్లాలో వెలుగుచూసింది.

మార్చి 4న జరిగిన ఈ దారుణోదంతం వీడియో తర్వాత రోజు వైరల్ కావడంతో కలకలం రేగింది. మెటల్ రాడ్డును పాదంలోకి చొప్పించి విచక్షణారహితంగా కొట్టడంతో వృద్ధుడు తీవ్ర గాయాలపాలై చివరకు ప్రాణాలు కోల్పోయాడు. తాను దొంగతనం చేయలేదని చెప్పినా వినకుండా అతడిపై దారుణంగా దాడి చేశారు. మదన్‌ లాల్‌ కుమారుడు మార్చి 8న పోలీసులకు ఫిర్యాదు చేసినా వెంటనే నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. బాధితుడు 12 రోజుల పాటు మృత్యవుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. జైపూర్ లోని సవాయ్‌ మాన్‌ సింగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మదన్‌ లాల్‌ మరణించాడు.

ఆలస్యంగా మేలుకున్న పోలీసులు ఎట్టకేలకు ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. జితేంద్ర యాదవ్‌, భరత్‌భూషణ్‌, దిలీప్‌ సింగ్‌, సందీప్‌ మీనా, సందీప్‌ యాదవ్‌లను అరెస్ట్‌ చేశామని జైపూర్ అదనపు ఎస్పీ దినేష్‌ అగర్వాల్‌ తెలిపారు. మరో నిందితుడు అనిల్ యాదవ్ పరారీలో ఉన్నట్టు చెప్పారు. మదన్‌ లాల్‌ కుమారుడు కనరామ్.. ఢిల్లీలో పోలీసు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.