న్యూఢిల్లీ : భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బృందంలో.. భారత సంతతికి చెందిన 8 మంది ప్రముఖులు కూడా ఉన్నారు. ఉన్నతస్థాయి అధికారులు, ప్రముఖులతో కూడిన ఈ బృందంలో అమెరికా అణు ఇంధన మంత్రిత్వ శాఖ అసిస్టెంట్‌ సెక్రటరీ రీటా బరన్‌వాల్‌ సహా కాశ్‌ పటేల్‌, బిమల్‌ పటేల్‌, ప్రేమ్‌ పరమేశ్వరన్‌, మనీషాసింగ్‌, అజిత్‌పాయ్‌, సీమావర్మ, సంపత్‌ శివాంగి ఉన్నారు. గతంలో కుదిరిన అణు ఒప్పందంలో భాగంగా అణు విద్యుత్‌ కార్పొరేషన్‌(ఎన్‌పీసీఎల్‌)తో కలిసి ఆరు అణు రియాక్టర్లను నిర్మించేందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై భారత అమెరికా ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. ప్రతిపాదిత రియాక్టర్ల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణు విద్యుత్తు కేంద్రం కూడా ఉంది. అమెరికాకు చెందిన వెస్టింగ్‌ హౌజ్‌ ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌ ఇక్కడ రియాక్టర్లను నిర్మించనుంది. అమెరికా బృందంలో ఉన్న అణు ఇంధన మంత్రిత్వ శాఖ అసిస్టెంట్‌ సెక్రటరీ రీటా బరన్‌వాల్‌.. భారత సంతతి వారే కావడం మనదేశానికి కలిసిరానుంది.

ట్రంప్‌ బృందంలోని రీటా బరన్‌వాల్‌ తండ్రి యూపీలోని బస్తీ జిల్లా బహదూర్‌పూర్‌ వాస్తవ్యుడు. ఆయన ఖరగ్‌పూర్‌ ఐఐటీలో చదివిన తర్వాత.. అమెరికాలోనే పీహెచ్‌డీ చదివేందుకు వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. రీటా అమెరికాలోని ఎంఐటీ, మిచిగాన్‌ యూనివర్సిటీలో అణు ఇంధనరంగంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఇక అమెరికా జాతీయ భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక శాఖకు సీనియర్‌ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌.. గుజరాత్‌లోని వడోదరకు చెందిన వ్యక్తి. ఆయన అమెరికాలోనే జన్మించి న్యాయవాద వృత్తిని చేపట్టారు. కాగా బిమల్‌ పటేల్‌ అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ భవన నిర్మాత. ఆయన నిర్మాణ సంస్థ హెచ్‌సీపీకే ఢిల్లీలో పార్లమెంటు, ఇతర భవనాల నిర్మాణపనులు అప్పగించనున్నారు. ఇక ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ అధినేత ప్రేమ్‌ పరమేశ్వరన్‌ను ట్రంప్‌ పర్యటనకు కొద్దిరోజుల ముందే అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా నియమించారు.

అమెరికాలో ఉన్నత విద్య..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనీషాసింగ్‌ అమెరికాలో పలు వర్సిటీలలో ఉన్నతవిద్య అభ్యసించిన తర్వాత అమెరికా ఆర్థిక, వ్యాపార వ్యవహార మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గోవాకు చెందిన డాక్టర్‌ వరదరాజ్‌పాయ్‌, డాక్టర్‌ రాధాపాయ్‌లు అమెరికా వలస వెళ్లిన తర్వాత జన్మించిన అజిత్‌ వరదరాజ్‌పాయ్‌ అక్కడే న్యాయవిద్యను అభ్యసించి అమెరికా ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ చైర్మన్‌ పదవి చేపట్టే స్థాయికి ఎదిగారు. ఇక ఉత్తరాదికి చెందిన సీమావర్మ అమెరికాలోనే పుట్టి జాన్‌ హాప్‌కిన్స్‌, మేరీలాండ్‌ యూనివర్సిటీలో ఉన్నతవిద్య అభ్యసించారు. ట్రంప్‌ కార్యాలయంలో మెడికేర్‌ కేంద్రానికి ఆమె నిర్వాహకురాలిగా ఉన్నారు. కర్ణాటకలో జన్మించిన డాక్టర్‌ సంపత్‌ శివంగి భారత్‌-అమెరికా రాజకీయ విద్యావేదిక అధ్యక్షుడు. మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్‌ కాలేజీలో చదివిన సంపత్‌ శివంగి.. వాషింగ్టన్‌లో ఉన్నత విద్య అభ్యసించి స్థిరపడ్డారు.

Courtesy Andhrajyothi