ప్రొఫెసర్‌ పోస్టుల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు చెల్లుచీటీ
మిగతా సెంట్రల్‌ వర్సిటీల్లో అమలైనా పట్టని వైనం

హైదరాబాద్‌ : ఇంగ్లిషు అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ(ఇఫ్లూ)లో బోధనా పోస్టుల నియామకాల్లో నిబంధనలకు నీళ్లొదులుతున్నారనే ఆరోపణలున్నాయి. అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లను అమలు చేయడం లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ రెండు పోస్టుల భర్తీలో కచ్చితంగా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా వర్సిటీ అధికారులకు అవేవీ పట్టడం లేదని వాపోతున్నారు.  హైదరాబాద్‌లోని ఇఫ్లూ క్యాంప్‌సతో పాటు అనుబంధ క్యాంప్‌సలు షిల్లాంగ్‌, లఖ్‌నవూలలో 52 అసిస్టెంట్‌, అసోసియేట్‌, ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నిరుడు జూలై 14న నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతంలోని రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారమే అధికారులు ఈ నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీని ప్రకారం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు మాత్రమే ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతాయి. అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మాత్రమే అమలవుతాయి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు కావు. ఈ నేపథ్యంలో ఈ రెండు విభాగాల్లోనూ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. దీంతో దేశంలోని ప్రతి సెంట్రల్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీతో పాటు అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది.

అయితే ఇందుకు విరుద్ధంగా ఇఫ్లూ నోటిఫికేషన్‌ జారీ చేయడం గమనార్హం. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేసిన అధికారులు.. అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీలో మాత్రం అమలు చేయలేదు. ఇతర సెంట్రల్‌ వర్సిటీలు.. హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ(హెచ్‌సీయూ), ఒడిసా సెంట్రల్‌ వర్సిటీలు నూతన నిబంధనల ప్రకారం ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేస్తూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాయి. కానీ ఇఫ్లూలో మాత్రం అందుకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ జారీ అయింది. హైదరాబాద్‌, షిల్లాంగ్‌, లఖ్‌నవూ మూడు క్యాంప్‌సల్లో 15 ప్రొఫెసర్‌ పోస్టులు, 24 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఈ రెండు కేటగిరీల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో తమకు అన్యాయం జరుగుతోందని ఆ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. కేంద్రం ఆదేశాల మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా ఈ అంశంపై ఇఫ్లూ వర్సిటీ వీసీ సురేష్‌ కుమార్‌ వివరణ కోరేందుకు ఫోన్‌లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

Courtesy Andhrajyothi