– 2030కల్లా 12 పాసైనా సగం మంది విద్యార్థులకే సరిపడా నైపుణ్యాలు
– వెంటాడనున్న నైపుణ్యలేమి
– తగిన నిర్ణయాలు తీసుకోకుంటే యువ శక్తి నిర్వీర్యం : యూనిసెఫ్‌
న్యూఢిల్లీ : పీజీలు, పీహెచ్‌డీలు చేసి ప్యూన్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటున్న దుస్థితిని చూస్తూనే ఉన్నాం. మనదేశంలో 45 ఏండ్ల గరిష్టానికి నిరుద్యోగం చేరిన విషయం తెలిసిందే. ఒకవైపు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కారు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు స్కూళ్లు, కాలేజీల్లో చదివిన పాఠాలు ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలను నేర్పలేకపోతున్నది. వీటికోసం ప్రత్యేకంగా ప్రయివేటు కోచింగ్‌ల చుట్టూ చక్కర్లు కొట్టే దుస్థితిని యువత ఎదుర్కొంటున్నది. ప్రయివేటురంగంలో కొలువులకు సరిపడా నైపుణ్యాలు ఆశావాహుల్లో ఉండటంలేదని పలునివేదికలు నొక్కిచెబుతూనే ఉంది. అయితే, ఈ నైపుణ్యలేమి సమస్య ఇప్పటితో ఆగిపోవడం లేదనీ, వచ్చే దశాబ్దంలోనూ ఇలాగే కొనసాగే ప్రమాదమున్నదని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. మనదేశంలో 2030నాటికి 12వ తరగతి ఉత్తీర్ణులైన చిన్నారుల్లో సగం మందికి ఉద్యోగాలకు కావాల్సిన కనీస నైపుణ్యాలు ఉండే అవకాశం లేదని యూనిసెఫ్‌ రిపోర్టు అంచనా వేసింది. 2030కల్లా భారత్‌లో సుమారు 31 కోట్ల మంది సెకండరీ స్కూల్‌ గ్రాడ్యుయేట్లు ఉంటారని గణించిన యూనిసెఫ్‌ అందులో సగం మందికి కొలువులకు కావాల్సిన కనీస అర్హతలు కలిగి ఉండబోరని వివరించింది. గ్లోబల్‌ బిజినెస్‌ కోలిషన్‌(జీబీసీ) ఎడ్యుకేషన్‌ పేరుతో నైపుణ్యాలకు సంబంధించిన రిపోర్టును యూనిసెఫ్‌ ఇటీవలే విడుదల చేసింది. 2030లోపు 12వ తరగతి పాసైన 47శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉపాధికి కావాల్సిన కనీస నైపుణ్యాలు కలిగి ఉండే అవకాశమున్నదని తెలిపింది.
రోజుకు లక్ష మంది మార్కెట్‌లోకి..
దక్షిణాసియా(ఇండియా, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, శ్రీలంక, పాకిస్థాన్‌)లో ప్రతి రోజు సుమారు లక్ష మంది యువతీ యువకులు ఉద్యోగాల కోసం కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్నారు. ఇందులో సగం మందికి 21శతాబ్ది ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాల్లేక అయోమయంలో కొట్టుమి ట్టాడుతున్నారు. అయితే, నైపుణ్యాలకు సంబంధించి దక్షిణాసియాలో భూటన్‌ మెరుగైన స్థానంలో ఉన్నది. భూటాన్‌లో 81శాతం మంది సెకండరీ స్కూల్‌ గ్రాడ్యుయేట్లు ఉద్యోగానికి కావాల్సిన కనీస నైపుణ్యాలు కలిగి ఉండబోగా.. భారత్‌లో 47శాతం మంది మాత్రమే కనీస అర్హతలు కలిగి ఉండే అవకాశమున్నది. పాకిస్థాన్‌, నేపాల్‌లలో 46శాతం మంది, మాల్దీవుల్లో 40శాత మంది మాత్రమే ఈ నైపుణ్యాలు కలిగి ఉండబోతున్నట్టు రిపోర్టు అంచనా వేసింది.
ఇదే కీలక తరుణం : యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌
దక్షిణాసియా దేశాలు కీలక సందర్భంలో ఉన్నాయనీ, ఇప్పుడు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలే భవిష్యత్‌ను ప్రభావితం చేస్తాయనీ యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్రియెట్టా ఫోర్‌ అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా తగిన నిర్ణయాలు తీసుకుంటే దేశ ఆర్థిక వృద్ధి వేగవంతమవడమే కాదు.. కోట్లాది కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని తెలిపారు. ఇందులో విఫలమైతే మాత్రం.. ఆర్థిక వ్యవస్థ పతనమవడం, యువతలో నిరాశా నిస్పృహలు పెరిగిపోవడం, కీలకమైన యువశక్తి నిర్వీర్యమైపోతుందని హెచ్చరించారు. ఈ రిపోర్టుతోపాటు యూనిసెఫ్‌ ‘వాయిసెస్‌ ఆఫ్‌ యూత్‌’ పేరుతో 32వేల మంది యువతీయువల(24 ఏండ్లలోపు)తో సర్వే చేపట్టిన నోట్‌నూ విడుదల చేశారు. కాలం చెల్లిన విద్యా వ్యవస్థలోనే తమ చదువులు సాగాయనీ, అది ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించలేకపోయిందని దక్షిణాసియాలోని యువతీ యువలకు అభిప్రాయపడినట్టు నోట్‌ వివరించింది. పని అనుభవం లేకపోవడం, ఉద్యోగిత పెంపునకు తగిన సేవల్లేక, ఉద్యోగ నియామకాలకు లంచం అడగటం, వివక్షచూపడం, పారద్శరకతలేని విధానాల్లో నియామకాలు జరుగుతుండటంలాంటి కారణాలతోనూ తాము ఉద్యోగాలు పొందలేక పోతున్నామని అభిప్రాయపడ్డారు.

Courtesy Navatelangana..