మోడీ హయాంలో పెరిగిన విద్య వ్యయం
ప్రాథమిక విద్య ఖర్చులో 31శాతం పెరుగుదల
ఎన్‌ఎస్‌ఓ నివేదిక కీలకాంశాలు

న్యూఢిల్లీ : కేంద్రంలో మోడీ సర్కారు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలోని విద్యార్థులకు చదువు మరింత భారమైంది. 2014తో పోల్చుకుంటే 2018 నాటికి దేశంలో విద్య వ్యయం చాలా పెరిగిపోయింది. ఈ రెండు సంవత్సరాలకు సంబంధించి జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ) నివేదికల(71వ, 75వ రిపోర్టులు) ఆధారంగా ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి. దేశంలో అడ్డూఅదుపు లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రయివేటు విద్యాసంస్థలతో విద్య వ్యాపారంగా మారిపోవడంతో పాటు వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనతతో విద్యార్థులు చదువు’కొనలేకపోతున్నారు’. 2018 ఏడాదికి సంబంధించి ఎన్‌ఎస్‌ఓ తన నివేదికలోని కీలకాంశాలను విడుదల చేసింది.

పట్టణ ప్రాంతాల్లో అధికం..
నివేదికలోని కీలకాంశాల ప్రకారం.. 2014తో పోల్చుకుంటే 2018 నాటికి ప్రాథమిక విద్యకు అయ్యే ఖర్చు అత్యధికంగా 31శాతం పెరిగింది. అలాగే సెకండరీ విద్యకయ్యే ఖర్చు(21శాతం పెరుగుదల), సీనియర్‌ సెకండరీ(10శాతం), గ్రాడ్యుయేషన్‌(ఆరుశాతం), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌(13శాతం)లకు అయ్యే వ్యయం దేశంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు చుక్కలు చూపించింది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రాడ్యుయేషన్‌ విద్యకు ఏడాదికయ్యే సగటు వ్యయం రూ.16,485గా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఇది రూ.25,204 గా ఉండటం గమనార్హం.
ప్రయివేటు కాలేజీల్లో ఫీజుల మోత
ఈ తేడా ప్రభుత్వ కళాశాలలతో పోలిస్తే ప్రయివేటు కాలేజీలలో అధికంగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
ప్రయివేటు కాలేజీలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయనీ ఎన్‌ఎస్‌ఓ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ విద్యకయ్యే ఖర్చు ఏడాదికి సగటున రూ. 9,703 కాగా, ప్రయివేటు కళాశాలల్లో ఇది రూ.20,462గా వసూలు చేస్తున్నారు. ప్రైమరీ విద్యకయ్యే ఖర్చు ప్రభుత్వ స్కూళ్లతో పోల్చుకుంటే ప్రయివేటు పాఠశాలల్లో దాదాపు 10 రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. అలాగే సెకండరీ విద్యార్థులకు(ఆరు నుంచి ఎనిమిదో తరగతి) అయ్యే విద్య వ్యయం ప్రయివేటులో నాలుగురెట్లు ఎక్కువగా ఉన్నది. అలాగే టెక్నికల్‌, వృత్తిపరమైన కోర్సులలో కూడా ఇలాంటి భారీ వ్యత్యాసాలే కనిపించాయి. మెడిసిన్‌, ఇంజినీరింగ్‌లకు ప్రభుత్వ నిధులతో నడిచే కాలేజీల్లో ఫీజు ఏడాదికి సగటున రూ.36,180లు ఉండగా, ప్రయివేటు విద్యాసంస్థలో ఇది దాదాపు రూ.72,712గా ఉన్నది. ఇక పీజీ కోర్సులకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఏడాదికి రూ.74,021 ఫీజును వసూలు చేయగా, ప్రయివేటులో ఇది రూ.72,604గా నమోదైంది. అలాగే డిప్లొమా లేదా సర్టిఫికెట్‌ కోర్సులకు అయ్యే వ్యయం ప్రయివేటు విద్యాసంస్థల్లో 2.5రెట్లు అధికంగా ఉన్నది.

మధ్యలోనే చదువులు ఆపేస్తున్న వైనం
బీజేపీ హయాంలో విద్య వ్యయం దారుణంగా పెరిగిపోవడం దేశంలోని సాధారణ కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. మోడీ సర్కారు చర్యలతో దేశంలోని ప్రజల వినియోగ వ్యయం ఇప్పటికే తగ్గిపోయిం దని ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. దీనికి తోడు తమ పిల్లల చదువు కూడా భారంగా మారడంతో తల్లిదండ్రులు తమ చిన్నారుల చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. దేశంలోని ప్రభుత్వ విద్యా సంస్థలు, యూనివర్సిటీలలో ఫీజులు, ఇతర చార్జీలను పెంచుతూ మోడీ సర్కారు ఇప్పటికే విద్యార్థులను కష్టాలకు గురిచేస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) దీనికి తాజా ప్రత్యక్ష ఉదాహరణ. మరింత నాణ్యమైన విద్య పేరుతో విద్యను ప్రయివేటుపరం చేయడానికి మోడీ సర్కారు ప్రయత్నిస్తున్నదనీ, అయితే రాబోయే తరాలకు నాణ్యమైన విద్య కరువై అది దేశానికే ప్రమాదకరంగా మారే ప్రమాదమున్నదని విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లో టెక్‌/వృత్తి విద్య కోర్సులకయ్యే ఖర్చు – 2018 (రూపాయల్లో)
కోర్సు ప్రభుత్వ ప్రయివేటు ప్రయివేటు ఎయిడెడ్‌
పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ 53,797 72,604 74,021
గ్రాడ్యుయేట్‌ 36,180 72,712 65,009
డిప్లొమా(గ్రాడ్యుయేట్‌, అంతకు పైన) 33,505 68,765 85,545
డిప్లొమా(గ్రాడ్యుయేట్‌ కంటే తక్కువ) 13,727 34,984 34,526

Courtesy Nava telangana…