•  రుణ మాఫీలతో నష్టమే.. ఉచిత హామీలు కూడా
  • ఆర్థికవ్యవస్థకు దెబ్బ.. ఆహార సబ్సిడీలూ కోయాలి
  • రేషన్‌ సరుకుల రేట్లు పెంచాలి
  • ఆర్థిక సర్వే కీలక సూచనలు
  • వృద్ధి రేటు 6-6.5 శాతం ఉండొచ్చు
  • జోరుగా ప్రభుత్వ ఆస్తుల అమ్మకం
  • పారిశ్రామికవేత్తలను గౌరవించాలి
  • రెండేళ్లలో లక్షన్నర వెల్‌నెస్‌ సెంటర్లు
  • 2025కు అసెంబ్లింగ్‌ హబ్‌గా భారత్‌
  • భారతీయుడి కొనుగోలు శక్తి పెరిగింది
సంపద సృష్టే సందేశం
130 కోట్ల మంది భారతీయుల అభ్యున్నతి కోసం సంపద సృష్టి జరగాలి. భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారు చేయడానికి బహుముఖ వ్యూహం అవసరం. వ్యాపారం, ఎగుమతుల వృద్ధి, సులభతర వ్యాపార నిర్వహణ లాంటి అనేక మార్గాల ద్వారా ఆర్థిక శక్తిగా పెరగాలి’’

ఆర్థిక సర్వేపై ప్రధాని మోదీ స్పందన

న్యూఢిల్లీ : ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజాకర్షక, సంక్షేమ విధానాలను ఆర్థిక సర్వే నిశితంగా తప్పుబట్టింది. ముఖ్యంగా ఉచిత హామీలు, రుణమాఫీలు ఆర్థిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆక్షేపించింది. సర్వేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంటుకు సమర్పించారు. రుణమాఫీలు వ్యవసాయ రుణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తాయని హెచ్చరించింది. ‘‘లక్షిత రైతాంగం లబ్ధి కోసం అందించే వ్యవసాయ రుణాల ప్రవాహానికి ఈ రుణ మాఫీలు అడ్డుపడుతున్నాయి. పాక్షికంగా లబ్ధి పొందిన వారితో పోలిస్తే పూర్తిగా ఈ రుణమాఫీ లబ్ధి పొందినవారు చేస్తున్న వినియోగం తక్కువ. పొదుపు తక్కువ. మదుపు తక్కువ. ఉత్పత్తి (దిగుబడి) తక్కువ.

మొత్తానికి మొత్తం ఈ రుణ మాఫీల వల్ల ప్రయోజనం తక్కువ’’ అని సర్వే వివరించింది. ఇక, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ బిల్లు రూ.3 లక్షల కోట్లు ఉందని, అందులో సింహభాగం అంటే రూ.1.84 లక్షల కోట్ల దాకా ఉన్న ఆహార సబ్సిడీ బిల్లులో భారీ కోత పెట్టాలని కూడా ఆర్థిక సర్వే గట్టిగా ప్రతిపాదించింది. చౌక డిపోల ద్వారా అందించే సరకుల ధరలను పునస్సమీక్షించాలని సూచించింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద అందించే వీటి ధరలను మూడేళ్లుగా పెంచలేదని తెలిపింది. అత్యవసర (నిత్యావసర) సరకుల చట్టం వంటి కాలదోషం పట్టిన చట్టాల్ని ఎత్తేయాలని తేల్చిచెప్పింది.

ఈసారి జీడీపీ 6-6.5%
రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడుతుందని, స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6 నుంచి 6.5 శాతం దాకా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2019-20లో ఇది 5 శాతం ఉందని, 2021 మార్చినాటికి పుంజుకోవడం ఖాయమని పేర్కొంది. నిజానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7 శాతం ఉంటుందని నిరుటి సర్వే అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 6-6.5 శాతానికి కుదించిందంటే.. పరిస్థితులు కుదుటపడినా.. భారీ ప్రగతి అసాధ్యమని సర్వే తేల్చినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యలోటు అంచనా 3.3 శాతం ఉంటుందనుకున్నా అది 3.8 శాతానికి పెరిగిపోయింది. ఇలా పెరగడం వరుసగా ఇది మూడో ఏడాది.

వ్యాపారులను గౌరవించాలి
సంపదను సృష్టిస్తేనే దానిని పంచిపెట్టగలం. అందుకే ఈ ఏడాది ఆర్థిక సర్వే థీమ్‌.. ‘సంపద సృష్టి’! ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ ఈ సర్వే రూపకర్త. సంపద పెరగాలంటే మొదట దానిని సృష్టించే వారిని.. అంటే వ్యాపార, పరిశ్రమాధిపతులను గౌరవించాలని స్పష్టం చేసింది. తద్వారా.. పన్ను ఉగ్రవాదం ఆగాలని, వాణిజ్యవేత్తల వేధింపులకు అడ్డుకట్ట పడాలని చెప్పకనే చెప్పింది.

జీడీపీ లెక్కల రగడ..
వృద్ధి రేటు విషయంలో మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ వెల్లడించిన అభిప్రాయాలను ప్రస్తుత ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ కొట్టిపడేశారు. ఓ చాప్టర్‌ అంతా జీడీపీ లెక్కల వివాదంపైనే రాశారు. జీడీపీ వృద్ధి రేటు లెక్కను 2011 నుంచి ఏటా 2.5 పర్సంటేజీ పాయింట్ల మేర ఎక్కువ చేసి చూపారని అరవింద్‌ సుబ్రమణ్యన్‌ నిరుడు ఓ వివాదం రేపారు. తన వాదనకు బలం చేకూర్చేలా 2011-17 మధ్య కాలంలో వివిధ రంగాల ఆర్థిక సూచీలను ఆయన చూపారు. ఇంతవరకూ ప్రకటిస్తున్న జీడీపీ వృద్ధి రేటు అసలు సరైంది కాదే కాదన్నారు.

కానీ ప్రస్తుత ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి దీనిని కౌంటర్‌ చేస్తూ- ‘జీడీపీని ఎక్కువ చేసి చూపామంటూ ఆయన ఇచ్చిన ఆధారాలు తప్పు అని స్పష్టమవుతోంది. ఇదేమీ అంకెల గారడీ కాదు. 51 దేశాల జీడీపీ వృద్ధి రేటు లెక్కలతో బేరీజు వేశాం. మెథడాలజీ కూడా ఇదే! ఓవర్‌ ఎస్టిమేషన్‌ మిగిలిన దేశాల్లో వివిధ స్థాయుల్లో ఉంది. మన వరకూ చూస్తే దేశం యావత్తునూ పరిగణించి, వివిధ రంగాల ప్రగతిని తీసుకొని సరిచూశాం. ఎక్కడా ఓవర్‌ ఎస్టిమేషనే లేదు’’ అని తేల్చిచెప్పారు.

వాస్తవ విరుద్ధమైన సర్వే: కాంగ్రెస్‌
ఆర్థిక సర్వేను కాంగ్రెస్‌ తప్పుబట్టింది. సామాన్యుడు ఎదుర్కొంటున్న అనే సమస్యలకు ఇది దర్పణం పట్టడం లేదనీ, వాస్తవాలకు దూరంగా ఉందని, దేశం ఎదుర్కొంటున్న సంక్లిష్ట ఆర్థికస్థితిని కూడా తెలియజెప్పడం లేదని కాంగ్రెస్‌ ప్రతినిధి రాజీవ్‌ గౌడ విమర్శించారు. ఆర్థిక సలహాదారు ఓ అధ్యాయం మేర రాసిన థాలినామిక్స్‌ (భోజన కొనుగోలుశక్తి)ని ఆక్షేపిస్తూ ఆ థాలి కాస్తా ఖాళీగా మారుతుందని వ్యాఖ్యానించారు.

రెస్టారెంట్‌ పెట్టడం కంటే.. పిస్తోలు కొనడం సులువు
మన దేశంలో ఓ హోటల్‌ పెట్టడం కంటే పిస్తోలు వంటి మారణాయుధం కొనడం చాలా సులువు. బెంగళూరులో రెస్టారెంట్‌ పెట్టాలంటే 36 డాక్యుమెంట్లు, వాటికి అనుమతులు కావాలి. అదే ఢిల్లీలో అయితే 26 అనుమతులు, ముంబైలో 22 అవసరం. ఢిల్లీ, కోల్‌కతాల్లో పోలీస్‌ ఈటింగ్‌ హౌస్‌ లైసెన్స్‌ కూడా పొందాల్సి ఉంటుంది. అంటే పోలీస్‌ విభాగం నుంచి అదనపు క్లియరెన్స్‌ కింద మరిన్ని డాక్యుమెంట్లు సమర్పించాలన్నమాట. మొత్తం మీద ఈ రెండు మహానగరాల్లో ఓ రెస్టారెంట్‌ కోసం 45 డాక్యుమెంట్లు కావాలి.

ఇదీ పరిస్థితి. అదే ఓ పిస్తోలు లేదా రివాల్వర్‌ లేదా ఇతర మారణాయుధాల్ని కొనాలంటే కేవలం 12 నుంచి 18 డాక్యుమెంట్లుంటే సరిపోతుంది. సింగపూర్‌ లేదా చైనాల్లో సైతం రెస్టారెంట్‌ ప్రారంభించాలంటే కేవలం నాలుగు డాక్యుమెంట్లు సరిపోతాయి. బార్లు, రెస్టారెంట్లు ఉపాధికల్పన ప్రదేశాలని, వాటికి అడ్డంకులు పెట్టడం సరికాదని సర్వే సర్వే అభిప్రాయపడింది.

COurtesy Andhrajyothi